ప్రధాని మోదీ, ఆయన తల్లిపై ఏఐ వీడియో కేసు

ప్రధాని మోదీ, ఆయన తల్లిపై ఏఐ వీడియో కేసు

ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ఆయన తల్లి దివంగత హీరాబెన్​కు సంబంధించి ఏఐ ద్వారా వీడియో రూపొందించిన కాంగ్రెస్​ పార్టీపై కేసు నమోదు అయ్యింది. డిల్లీలోని నార్త్ అవెన్యూ పోలీస్‌ స్టేషన్‌లో బీజేపీ డిల్లీ ఎలక్షన్ సెల్ కన్వీనర్ సంకేత్ గుప్తా ఫిర్యాదు చేశారు. గుప్తా ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్​ను నమోదు చేశారు.

సెప్టెంబర్ 10న కాంగ్రెస్ బిహార్ పోస్టు ఆ డీప్‌ఫేక్ వీడియోను పోస్ట్ చేసింది. అందులో ప్రధాని మోదీకి ఆయన తల్లి హీరాబెన్ కలలోకి వచ్చినట్లు ఏఐతో వీడియో క్రియేట్ చేశారు. “ఇవాళ ఓటు చోరీ చేయడం పూర్తైంది. ఇక నిద్రించే సమయమైంది. ముందు నోట్ల రద్దు చేసినప్పుడు లైన్​లో నిలబెట్టావు, ఇప్పుడు నా పేరు మీద బిహార్​లో రాజకీయం చేస్తున్నావు. నన్ను అవమానించేలా బ్యానర్లు, పోస్టర్లు వేయిస్తున్నావు. బిహార్​లో నువ్వు మళ్లీ నాటకాలు ఆడుతున్నావు. రాజకీయం పేరుతో దిగజారిపోకు” అంటూ మోదీకి తల్లి చెబుతున్నట్లు ఫేక్ ఆడియా బ్యాక్ గ్రౌండ్​లో జత చేశారు.

ఆ వీడియోపై గుప్తా ఫిర్యాదు చేశారు. ప్రధాని మోదీ, ఆయన తల్లిని అవమానించేలా ఆ వీడియో ఉందని తెలిపారు. గుప్తా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు. పరువు నష్టం, మహిళను అవమాన పరచడంతో పాటు ఐటీ యాక్ట్‌, డిజిటల్‌ డేటా ప్రొటెక్షన్‌ యాక్ట్‌లోని నిబంధనలు అనుసరించి డిజిటల్‌ దుర్వినియోగం వంటి పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

కొద్ది రోజుల క్రితం, ఆర్జేడీ- కాంగ్రెస్‌లు నిర్వహించిన పలు సమావేశాల్లోను, వేదికల పైనా చనిపోయిన తన తల్లిని అవమానిస్తూ మాట్లాడారని, ఆమెకు అవమానం జరిగిందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు కేవలం తన తల్లికి జరిగిన అవమానం మాత్రమే కాదని, దేశంలోని తల్లులు, సోదరీమణులకు జరిగిన అవమానమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవి తనను ఎంతో బాధించాయని మోదీ పేర్కొన్నారు. బిహార్‌ ప్రజలు కూడా తనలాగే బాధ పడ్డారనే విషయం కూడా తెలుసని చెప్పారు. దివంగత మాతృమూర్తి హీరాబెన్‌ మోదీ తనను, తోబుట్టువులను పెంచేందుకు ఎంతో కష్టపడ్డారని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.