
ప్రస్తుతం బహుళజాతి కంపెనీలు, అలోపతి మందుల కంపెనీలు ఆయుర్వేద వైద్య పద్ధతులను, యోగాను అణచి వేసే ప్రయత్నం చేస్తున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ లో జరిగిన విశ్వ ఆయుర్వేద పరిషత్ మహాసభలలో ముఖ్యఅతిథిగా పాల్గొంటూ ఆయుర్వేదానికి వ్యతిరేకంగా ప్రపంచంలో ఒక లాబీ పని చేస్తున్నదని తెలిపారు.
ఈ లాబీని తట్టుకుని ఆయుర్వేదానికి ప్రాధాన్యతనివ్వాలంటే మనం సమర్థవంతంగా పని చేస్తూ తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని సూచించారు. ఆయుర్వేదం మన ప్రాచీన వైద్యవిజ్ఞానం మాత్రమే కాదని, భారతీయ జీవన విధానంలో వెల్నెస్, భౌతిక, మానసిక ఆరోగ్యంపై సంబంధించిన సంపూర్ణ తత్వశాస్త్రంగా మనం చూడాలని సూచించారు.
చరకుడు, సుశ్రుతుడు, వాగ్భట్టు వంటి ఎందరో మహానుభావులు ఈ ప్రాచీన భారత విజ్ఞానం ద్వారా నాటి సమాజానికి వైద్యం చేశారని, మొత్తం ప్రపంచంకు మార్గదర్శనం చేశారని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. ఇలాంటి గొప్ప వైద్య విజ్ఞానాన్ని మరింత ప్రోత్సహించే విషయంలో గత ప్రభుత్వాలు పెద్దగా ఆసక్తి చూపలేదని విమర్శించారు. ఆయుర్వేదాన్ని ఓ పాత కాలపు వైద్యంగా, పనికి రానిదిగా చూశారని ధ్వజమెత్తారు.
కానీ, గత 11 ఏళ్లలో మన ఆయుర్వేదం పొటెన్షియల్ ప్రపంచానికి మరోసారి తెలిసిందని, ఆయుర్వేదానికి ఘనమైన గత ప్రాభవాన్ని అందించేందుకు మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని కిషన్ రెడ్డి చెప్పారు. మనమంతా గర్వపడేలా ఆయుర్వేదాన్ని మళ్లీ వినియోగంలోకి తీసుకొచ్చి ‘వెల్నెస్’ విషయంలో భారతదేశాన్ని ప్రపంచానికి హబ్ గా మారుస్తోందని స్పష్టం చేశారు.
ఇటువంటి సమయంలో మన సంస్కృతిని పరిరక్షించుకోవడంలో భాగంగా ప్రతి ఒక్కరూ మాట్లాడాలని, అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రాజకీయాలకు సంబంధం లేకుండా యోగాను ఆయుర్వేదాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని చెప్పారు. ఆయుర్వేదానికి ప్రాచుర్యం కల్పించడం మాత్రమే కాకుండా, ఈ విషయంలో సృజనాత్మకతను, పరిశోధనలను ప్రోత్సహిస్తూ భారతదేశాన్ని గ్లోబల్ వెల్నెస్ కేంద్రంగా మార్చడంలో విశేషమైన ప్రయత్నం జరగనుందని తెలిపారు.
More Stories
లొంగిపోయిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు సుజాతక్క
17 నుంచి `సేవా పక్షం అభియాన్’గా మోదీ జన్మదినం
దక్షిణ భారత కుంభమేళాగా గోదావరి పుష్కరాలు