ఎస్ఐఆర్ నిర్వహణపై నిర్ణయాధికారం మాదే.. ఈసీఐ

ఎస్ఐఆర్ నిర్వహణపై నిర్ణయాధికారం మాదే.. ఈసీఐ

నిర్ణీత కాల వ్యవధుల్లో దేశవ్యాప్తంగా ‘ఓటర్ల జాబితా సమగ్ర సవరణ’ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను నిర్వహించాలనే ఆదేశాలు జారీ అయితే తమ ప్రత్యేక అధికార పరిధికి విఘాతం కలుగుతుందని సుప్రీంకోర్టుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తెలిపింది.  ‘ఓటర్ల జాబితా సమగ్ర సవరణ’కు సంబంధించిన విధానంపై పూర్తి విచక్షణతో స్వతంత్రంగా నిర్ణయాన్ని తీసుకునే అధికారం తమకు ఉందని పేర్కొంది. ఈ విషయంలో ఇతర సంస్థలతో నిమిత్తం లేకుండా పనిచేసే స్వేచ్ఛ తమకు ఉందని ఈసీ చెప్పింది. 

ఈ మేరకు వాదనలతో సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్‌ను ఎన్నికల సంఘం దాఖలు చేసింది. దేశవ్యాప్తంగా నిర్ణీత కాల వ్యవధుల్లో ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిర్వహించాలని ఈసీకి ఆదేశాలు ఇవ్వాలంటూ అడ్వకేట్ అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ప్రత్యేకించి ఎన్నికలకు ముందు తప్పకుండా దేశమంతటా ఎస్‌ఐఆర్ ప్రక్రియ జరిగేలా చూడాలని కోరరు. 

ఈ పిటిషన్‌లోని వాదనలను కౌంటర్ చేస్తూ తాజాగా ఈసీ కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఓటరు జాబితాల సవరణ ప్రక్రియతో ముడిపడిన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు తమకు రాజ్యాంగపరమైన, చట్టపరమైన అధికారాలు ఉన్నాయని అఫిడవిట్‌లో ఈసీ ప్రస్తావించింది. `ప్రజాప్రాతినిధ్య చట్టం -1950’లోని సెక్షన్ 21 ప్రకారం ఓటర్ల జాబితాల తయారీ, సవరణ ప్రక్రియ తమ పరిధిలోనే జరుగుతుందని సుప్రీంకోర్టుకు ఎన్నికల సంఘం తెలిపింది. 

వాటిని ఎప్పుడు నిర్వహించాలనేది నిర్ణయించే అధికారాన్ని సెక్షన్ 21 తమకు కల్పించిందని పేర్కొంది. నిర్ణీత వ్యవధుల్లో ఓటర్ల జాబితాల తయారీ, సవరణ ప్రక్రియలను చేపట్టాలనే నిబంధనేదీ సెక్షన్ 21లో లేదని ఈసీ చెప్పింది.  ప్రతి సార్వత్రిక లేదా అసెంబ్లీ ఎన్నికకు ముందు, ఉప ఎన్నికకు ముందు ఓటరు జాబితాల సవరణ చేపట్టాలనే సాధారణ నిబంధన మాత్రమే అందులో ఉందని గుర్తుచేసింది.

రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్ -1960లోని ‘రూల్ 25’ ప్రకారం ఓటరు జాబితాల సమగ్ర సవరణ ప్రక్రియ నిర్వహణపై నిర్ణయం తీసుకునే విచక్షణాధికారం తమకే ఉందని ఈసీ వాదించింది. ఈనేపథ్యంలో అడ్వకేట్ అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని సుప్రీంకోర్టును ఎన్నికల సంఘం కోరింది.

“దేశ పార్లమెంటు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలను నిర్వహించేందుకు, ఓటరు జాబితాల తయారీకి, వాటి తయారీ ప్రక్రియను పర్యవేక్షించడంతో పాటు నియంత్రించేందుకు ఈసీకి రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 అధికారాన్ని ఇస్తుంది. ఈ అంశాలపై ఈసీకి ఉన్న అధికారాల గురించి చాలాసార్లు సుప్రీంకోర్టు ఆదేశాలు, తీర్పుల్లోనూ ప్రస్తావించారు” అని గుర్తు చేసింది. 

“ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాల్లో చట్టపరమైన ప్రస్తావనలు లేని అంశాలపైనా ఈసీకే అధికారం దక్కుతుందని గతంలో సుప్రీంకోర్టు చెప్పిన దాఖలాలు ఉన్నాయి. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ సరిగ్గా జరిగిందా? లేదా? అనేది కూడా ఈసీయే నిర్ణయించగలదు” అని సుప్రీంకోర్టులో ఈసీ వాదనలు వినిపించింది.