సరిహద్దుల్లో పరస్పర విశ్వాసం పెంచుకునే దిశగా భారత్ – చైనా

సరిహద్దుల్లో పరస్పర విశ్వాసం పెంచుకునే దిశగా భారత్ – చైనా
పరస్పర విశ్వాసాన్ని పెంచుకునే దిశగా భారత్ – చైనా అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగా తూర్పు లడఖ్‌‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) వద్ద ఉద్రిక్తతలకు తావు ఇవ్వకుండా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాయి. సైనిక ఉద్రిక్తతలు తగ్గినప్పటికీ, తూర్పు లద్ధాఖ్ ఎల్‌ఏసీ వద్ద భారత్, చైనాలకు చెందిన దాదాపు 60 వేల మంది సైనికులు ఉన్నారు. 

గత ఐదేళ్లుగా ఇరుదేశాలు చర్చలు జరుపుతున్నప్పటికీ, పరస్పర విశ్వాస భావన కొరవడింది. అందుకే ఇప్పటికీ ఎల్‌ఏసీ వద్ద పెద్ద సంఖ్యలో సైన్యాలను సిద్ధంగా ఉంచాయి. ఈ పరిస్థితిని మార్చాలని భారత్, చైనా భావిస్తున్నాయి. ఇరుదేశాల సైన్యాలు విశ్వాస లేమిని తగ్గించుకునేందుకు క్షేత్రస్థాయిలో కలిసి పనిచేసేందుకు సమాయత్తం అవుతున్నాయి. పరస్పర విశ్వాసాన్ని పెంచుకునే పలు చర్యలను చేపట్టబోతున్నాయి.

భారత్‌ నుంచి చైనా ఆక్రమించుకున్న ఆక్సాయ్ చిన్ ప్రాంతానికి సమీపంలో గల్వాన్ లోయ ఉంది. ఈ లోయలో 2020 సంవత్సరం జూన్ 15, 16 తేదీల్లో భారత్, చైనా సైన్యాలు ఘర్షణ పడ్డాయి. ఆ భీకర ఘర్షణలో ఇరుదేశాల సైనికులు ప్రాణాలు కోల్పోయారు. నాటి నుంచి నేటి వరకు (ఐదేళ్లలో) భారత్, చైనా సైన్యాలు, విదేశాంగ శాఖల ఉన్నతాధికారుల స్థాయిలో చర్చలు జరిగాయి. 

దీని వల్ల తూర్పు లద్ధాఖ్లోని ఎల్‌ఏసీ వద్ద సైనిక ఉద్రిక్తతలు తగ్గిపోయాయి. 2024 అక్టోబరులో కుదిరిన ఒక ఒప్పందం ప్రకారం, ఇరుదేశాల సైన్యాలు ప్రస్తుతం సంయుక్తంగా ఎల్‌ఏసీ వద్ద పెట్రోలింగ్ చేస్తున్నాయి. తద్వారా సైనిక ఘర్షణలకు తావు లేకుండా పోయింది. చైనా సైన్యంతో గల్వాన్ ఘర్షణ తర్వాత భారత్ పలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. 

ప్రధానంగా చలికాలంలో భారత సైనికుల ప్రాణాలకు రిస్క్‌ను తగ్గించే లక్ష్యంతో పలు ఏర్పాట్లు చేసింది. ఎల్‌ఏసీ సమీపంలోని ఏరియాల్లో అత్యాధునిక నిఘా కెమెరాలను బిగించింది. ఎల్ఏసీ పరిసరాల్లో చైనా సైన్యం అనుమానాస్పద కదలికలు జరిగితే నిఘా కెమెరాల ద్వారా ట్రాక్ చేసే వ్యవస్థను సిద్ధం చేసుకుంది.  చలికాలంలో ఎల్ఏసీ సమీపంలోని ప్రాంతాల్లో ఎముకలు కొరికే చలి ఉంటుంది. ఉష్ణోగ్రతలు మైనస్ 10 డిగ్రీల నుంచి మైనస్ 25 డిగ్రీల దాకా పడిపోతుంటాయి. ఇటువంటి ప్రతికూల వాతావరణంలో పెట్రోలింగ్ నిర్వహించడం భారత సైన్యానికి పెద్ద సవాల్‌గా మారుతుంటుంది. 

కొత్తగా అందుబాటులోకి వచ్చిన నిఘా కెమెరా వ్యవస్థల వల్ల కాలినడక పెట్రోలింగ్‌కు వీలైనంత తక్కువ మంది సైనికులను పంపే వెసులుబాటు కలిగింది. చలికాలంలో ఎల్ఏసీ వద్ద కాలినడకన సైనికులు పెట్రోలింగ్ చేయడమంటే ఆషామాషీ విషయం కాదు. మంచు దుప్పటి మీదుగా గంటల తరబడి నడుచుకొని వెళ్తూ ఈ డ్యూటీని చేయాల్సి ఉంటుంది.  ఈ క్రమంలో సైనికులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. వారు తమ సైనిక స్థావరానికి సకాలంలో తిరిగి చేరుకోవడం కూడా కష్టతరంగా మారుతుంటుంది. ఈ పెట్రోలింగ్ చేస్తూ ఏటా పలువురు భారత సైనికులు అమరులు అవుతుంటారు. నిఘా కెమెరాల పుణ్యమా అని చలికాలంలో కాలినడకన పెట్రోలింగ్‌కు వెళ్లే సైనికుల సంఖ్యను తగ్గించారు.

ఎల్ఏసీ వద్దనున్న సైనిక పెట్రోలింగ్ పాయింట్లను జియో ట్యాగింగ్ చేసే ప్రక్రియను భారత్ ఇప్పటికే మొదలు పెట్టింది. ఆయా పెట్రోలింగ్ పాయింట్ల భౌగోళిక స్వరూపం ఎలా ఉంది? అక్కడున్న ప్రధాన ప్రదేశాలు ఏమిటి? అనే సమాచారంతో జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఆయా పెట్రోలింగ్ పాయింట్ల వద్ద చైనా ఆర్మీతో సైనిక ఘర్షణ జరిగినా, భారత్‌కు స్పష్టమైన భౌగోళిక ఆధారంగా జియో ట్యాగింగ్ సమాచారం పనికొస్తుంది. 

భారత సైనికులు ఎల్‌ఏసీలో పెట్రోలింగ్ నిర్వహించేందుకు సైతం ఈ సమాచారం ఎంతో ఉపయోగపడనుంది. మొత్తం మీద ఎల్ఏసీ ఏరియాల్లో నిఘా కెమెరాలతో పర్యవేక్షణ, పెట్రోలింగ్ పాయింట్ల జియో ట్యాగింగ్ వల్ల భారత సైనికులపై భారం గణనీయంగా తగ్గింది. దీనివల్ల చైనాకు భారత్‌పై విశ్వాస భావన పెరిగింది. ప్రస్తుతం భారత్, చైనాలు కోరుకుంటున్నది కూడా ఇదే.