వలసదారులకు వ్యతిరేకంగా లండన్‌లో భారీ ప్రదర్శన

వలసదారులకు వ్యతిరేకంగా లండన్‌లో భారీ ప్రదర్శన
యూకే రాజధాని లండన్ వలస వ్యతిరేక నిరసనలతో హోరెత్తిపోయింది. యునైట్ ద కింగ్‌డ‌మ్ పేరుతో యాంటీ ఇమిగ్రెంట్‌, యాంటీ ఇస్లాం కార్యకర్త టామీ రాబిన్సన్ నేతృత్వంలో జరిగిన ర్యాలీలో లక్ష మందికిపైగా పాల్గొన్నారు. ప్రధాని కీర్‌ స్టార్మర్‌కు వ్యతిరేకంగా పెద్ద‌పెట్టున‌ నినాదాలు చేశారు. వలసదారులను బ్రిటన్‌ నుంచి పంపించేయాలనే నినాదాలతో ప్లకార్డులు ధరించారు. 
 
ఈ ర్యాలీలో దాదాపు 1.10 లక్షల నుంచి 1.50 ల‌క్ష‌ల మంది పాల్గొన్నారని మెట్రోపాలిటన్ పోలీసులు వెల్లడించారు. యూకేలో ఇటీవల కాలంలో జ‌రిగిన‌ అతిపెద్ద ప్రదర్శనల్లో ఇది ఒకట‌ని చెప్పారు.  యూకేలో ఇటీవల కాలంలో అతిపెద్ద ప్రదర్శనల్లో ఇది ఒకటిగా పేర్కొన్నారు. ఈ ప్రదర్శన సమయంలో పోలీసులు, నిరసనకారుల మధ్య ఉద్రిక్తవాతావరణం నెలకొంది.
 
రాబిన్‌సన్ నాయకత్వంలోని యునైట్ ది కింగ్‌డమ్ మార్చ్‌కు సమాంతరంగా, స్టాండ్ అప్ టు రేసిజమ్ అనే కౌంటర్-ప్రొటెస్ట్ జరిగింది. ఈ ప్రదర్శనలో సుమారు 5 వేల‌ మంది పాల్గొన్నారు.  ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరగకుండా నిరోధించేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్రమంలో పోలీసులు ప్రదర్శనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు.
 
ఈ క్రమంలో నిరసనకారులు పోలీసులపై బాటిల్స్‌తో పాటు వస్తువులతో దాడులు చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనల్లో 26 మంది అధికారులు గాయపడ్డారని, వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. 25 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఈ అల్లర్లలో పాల్గొన్నవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ కమిషనర్ మాట్ ట్విస్ట్ తెలిపారు.

ఇటీవల కాలంలో బ్రిటన్‌కు అక్రమ వలసలు భారీ ఎత్తున పెరిగాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 28,000 మందికి పైగా వలసదారులు పడవల ద్వారా బ్రిటన్ చేరుకున్నట్లు నివేదికలు చెబున్నాయి. బ్రిటన్‌కు వచ్చే వారిలో చాలామంది ఆశ్రయం కోరుతూ వస్తున్నారు. వలసలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో స్థానిక జనాభాలో అసంతృప్తి పెరిగింది. ప్రభుత్వం వలసదారులను తాత్కాలికంగా హోటళ్లలో ఉంచుతోంది. ఈ క్రమంలో ఈ హోటళ్ల వెలుపల గత కొన్ని నెలలుగా స్థానికుల నిరసనలు తెలుపుతున్నారు.

వలసదారులు దేశ వనరులను వాడేస్తున్నారని, స్థానికుల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు.  ఇప్పటికే బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర కష్టాల్లో ఉండగా, అక్రమ వలసదారులు దేశానికి భారంగా మారారని యాంటీ ఇమిగ్రేషన్ నిరసనకారులు చెబుతున్నారు. వలసల వల్ల తమ జాతీయ గుర్తింపు, సాంస్కృతిక విలువలు ప్రమాదంలో పడుతున్నాయని భావిస్తున్నారు. 

యాంటీ ఇమిగ్రేషన్ ఉద్యమానికి టామీ రాబిన్‌సన్ వంటి రైట్ వింగ్ కార్యకర్తలు నాయకత్వం వహిస్తున్నారు. వలస సమస్య బ్రిటన్ రాజకీయాల్లో ప్రధాన అంశంగా మారింది. రిఫార్మ్ యూకే వంటి పార్టీలకు ఇది కీలక అజెండాగా మారింది. రాబిన్‌సన్ లాంటి నేతలు ఈ అంశాన్ని మరింతగా ప్రోత్సహిస్తూ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. టామీ రాబిన్‌సన్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. యూకే ప్రభుత్వంలోని అనివీతిని తాను బయటపెడుతున్న టామీ పదే పదే చెబుతుంటారు.

అతనికి అమెరికా బిలియనీర్లు, ముఖ్యంగా ఎలాన్ మస్క్ వంటి ప్రముఖుల మద్దతు ఉందని ప్రచారంలో ఉంది. టామీ నిర్వహంచిన యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీకి ఎలాన్ మస్క్ వీడియో ద్వారా మద్దతు తెలపడం ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చింది.  బ్రిటన్‌లో ప్రజలు స్వేచ్ఛా హక్కులు వినియోగించడానికి భయపడుతున్నారు మస్క్ ఆ వీడియోలో వ్యాఖ్యానించినట్లు అంతర్జాతీయ మీడియా రాసుకొచ్చింది.

యాంటి ఇమిగ్రేషన్ ర్యాలీలో నిరసనకారులు యూనియన్ ఫ్లాగ్, సెంట్ జార్జ్ క్రాస్ జెండాలను ప్రదర్శించారు.  కొందరు అమెరికా, ఇజ్రాయెల్ జెండాలు కూడా పట్టుకున్నారు. ప్రధాని కియర్‌ను విమర్శలు చేస్తూ నినాదాలు చేశారు. ‘సెండ్ దెం హోమ్’ అంటూ వలస వ్యతిరేక నినాదాలు వినిపించాయి. కొంతమంది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ఉన్న టోపీలు ధరించారు.