వైసీపీ అవినీతి పాలనకు బాబు, మోదీ చరమగీతం

వైసీపీ అవినీతి పాలనకు బాబు, మోదీ చరమగీతం

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి పెచ్చుమీరిపోయిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా తీవ్ర స్థాయిలో ఆరోపించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త పర్యటన `సారధ్యం’ కార్యక్రమం ముగింపు సందర్భంగా విశాఖపట్నంలో ఆదివారం జరిగిన బహిరంగసభలో పాల్గొంటూ వైసీపీ అవినీతి పాలనను అంతమొందించడంలో చంద్రబాబు, మోదీ కీలక పాత్ర పోషించారని తెలిపారు. 

రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, అవినీతి ప్రజల జీవితాలను ఎంతగానో ప్రభావితం చేశాయని ఆయన విమర్శించారు. వైసీపీ అసమర్థ, అస్తవ్యస్త ప్రభుత్వాన్ని కూలదోసి కూటమిని ఎంచుకున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.  వైసీపీ హయాంలో అవినీతి, అక్రమాలు, అరాచక పాలన ఉంది. అంధకారంలోకి వెళ్లిన ఏపీని మోదీ, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు.

`మోదీ మదిలో ఏపీ ఉంటుంది. ఏపీ ప్రజల మదిలో మోదీ ఉంటారు’ అని జేపీ నడ్డా భరోసా ఇచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయకత్వం, మోదీ సహకారంతో కేంద్రం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందని చెబుతూ  ఎన్డీయే పాలనలో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతోందని తేలిపరు. 2014కు ముందు దేశంలో అసమర్థ, వారసత్వ ప్రభుత్వాలు ఉండేవని విమర్శించారు. 2014 తర్వాత దేశంలో వచ్చిన మార్పులను ప్రజలు గమనించాలని జేపీ నడ్డా సూచించారు.

2014కు ముందు భారతదేశంలో కేవలం ప్రజలను మభ్యపెట్టే హామీలతో, తప్పుడు మేనిఫెస్టోలతో అధికారంలోకి వచ్చేవారని ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలో దేశంలో అసమర్థ, వారసత్వ రాజకీయాలు రాజ్యమేలాయని, దానివల్ల దేశ పురోగతి కుంటుపడిందని చెప్పారు. కానీ, 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో నిజమైన మార్పులు మొదలయ్యాయని, సుపరిపాలన, అభివృద్ధికి ప్రాధాన్యత లభించిందని ఆయన వివరించారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయకత్వంలో, కేంద్రంలో మోదీ నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడడం వల్ల రాష్ట్రం అభివృద్ధిపథంలో వేగంగా పయనిస్తుందని జేపీ నడ్డా ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి, ప్రజల సంక్షేమానికి ఈ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు. అవినీతి లేని, ప్రజలకు మేలు చేసే పాలనను అందించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

గత 11 ఏళ్లలో కేంద్రంలో ఇచ్చిన హామీలను అమలు చేశామని పేర్కొంటూ “బీజేపీ ఒక ఐడియోలాజికల్ పార్టీ. ప్రపంచంలోనే అత్యధిక మంది కార్యకర్తలు బీజేపీలోనే ఉన్నారు. ఆర్టికల్ 370, అయోధ్యలో రామమందిరం నిర్మాణం, ట్రిపుల్ తలాక్ ఇలా ఎన్నో సమస్యలను పరిష్కరించాం. 11వ లార్జెస్ట్ ఎకానమీగా భారతదేశం ఉండేది. ఇప్పుడు నాల్గోవ లార్జెస్ట్ ఎకానమీగా అవతరించింది. భవిష్యత్‌లో మూడోదిగా అవతరిస్తుంది” అని తెలిపారు.  కాగా, ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత , ఆమె భర్త జెపి నడ్డా సమక్షంలో  బీజేపీ కండువా కప్పుకున్నారు.