
విశాఖ ఉక్కు పరిశ్రమలో ఏదో జరిగిపోతోందని అపోహలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వామపక్ష పార్టీల దుష్ప్రచారాన్ని నమ్మవద్దని రాష్ట్ర బిజెపి అధ్యక్షులు పివిఎన్ మాధవ్ స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు విషయంలో జరుగుతున్న మంచిని బయటకు చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఒక భూతంలా చూపించే ప్రయత్నం జరుగుతోందని పేర్కొంటూ ప్రైవేటీకరణ అనేది అన్ని దేశాల్లోనూ జరుగుతోందని ఆయన తెలిపారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేయాలని బీజేపీ పార్టీ మొదట కోరిందని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడంతో పురోభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. విశాఖలో సారథ్య యాత్ర బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని మాధవ్ ప్రకటించారు. విశాఖలోని రైల్వే మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రతి బీజేపీ కార్యకర్తను భాగస్వామ్యం చేస్తున్నామని వివరించారు.
కడప నుంచి సారథ్యం యాత్ర ప్రారంభించగా, ఈ సారథ్యం యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభించిందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీని స్ఫూర్తిగా తీసుకుని బీజేపీ ప్రతి కార్యకర్త పనిచేయాలని సారథ్యం యాత్ర నిర్వహించామని మాధవ్ చెప్పారు. సారథ్యం యాత్రలో వైతాళికులను గుర్తించి వారిని స్మరించుకున్నామని, ఈ సారథ్యం యాత్ర లో చాయ్ పే చర్చ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుతున్నాయని పేర్కొన్నారు.
అక్టోబర్ 2 తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఖాదీ సంతలను నిర్వహిస్తామని మాధవ్ తెలిపారు. నెక్స్ట్ జనరేషన్ జీ ఎస్ టి సాహసోపేతమైన నిర్ణయమని కొనియాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో అనేక రకాల వస్తువుల ధరలు తగ్గనున్నాయని వివరించారు. సెప్టెంబర్ 17వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ విశాఖలో పర్యటిస్తారని చెప్పారు. అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ విజయవంతమైందని తెలిపారు.
పోలవరం ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొంటూ ఎన్ డి ఏ సారధ్యంలో పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని మాధవ్ భరోసా వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో డ్రామా ఆడిందని, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా జగన్ మోహన్ రెడ్డి వ్యవహరించారని మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం మైనారిటీల నిధులను దారిమళ్లించిందని మాధవ్ ధ్వజమెత్తారు. అమరావతి రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతుందని వివరించారు.
More Stories
2026 జూన్ నాటికి భోగాపురం ఎయిర్పోర్ట్ సిద్ధం
భారత ప్రధానిగా నాలుగోసారీ నరేంద్ర మోదీనే!
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన