భారత ప్రధానిగా నాలుగోసారీ నరేంద్ర మోదీనే!

భారత ప్రధానిగా నాలుగోసారీ నరేంద్ర మోదీనే!
భారతదేశానికి నాలుగోసారి కూడా ప్రధానిగా నరేంద్ర మోదీనే ఉంటారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా వ్యక్తం చేశారు. వచ్చే దశాబ్దంలో ఏపీతోపాటు, దేశంలో అద్భుతాలు జరుగుతాయని చెబుతూ ఒక ముఖ్యమంత్రిగా తాను భావితరాల కోసం ఆలోచన చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు.  విజయవాడలో వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో ‘రానున్న దశాబ్ద కాలంలో ఆంధ్రప్రదేశ్‌ ఎలా ఉండబోతోంది’ అనే అంశంపై మాట్లాడుతూ విజన్ రూపకల్పన చేయడమే కాదు, దాన్ని సాధ్యం చేసే దిశగా పని చేయాలని ఆయన సూచించారు.
జాతీయ స్థాయిలో వికసిత్ భారత్-2047, రాష్ట్ర స్థాయిలో స్వర్ణాంధ్ర-2047 డాక్యుమెంట్లను సిద్ధం చేశామని తెలిపారు.  “20-25 ఏళ్ల క్రితం భారతీయులకు సరైన గుర్తింపు లేని సమయంలో తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి భారతదేశం అభివృద్ధి అన్ స్టాపబుల్ గా మారింది. 2038 నాటికి భారతదేశం నెంబర్-1 అవుతుంది. ఇందులో తెలుగు వారి పాత్ర ప్రధానంగా ఉండాలని భావిస్తున్నా” అని చంద్రబాబు వెల్లడించారు. 

ఈ సంవత్సరం డబుల్ డిజిట్ గ్రోత్ సాధించగలిగామని చెప్పారు. “2028-29 నాటికి రూ.29,29,402 కోట్ల మేర జీఎస్డీపీ సాధించగలం. 2029-2034 నాటికి రూ.57,21,610 కోట్ల జీఎస్డీపీ సాధించేలా ప్రణాళికలు ఉన్నాయి. దీన్ని సాధించే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటుంది” అని చంద్రబాబు స్పష్టం చేశారు. 2028-29 నాటికి తలసరి ఆదాయాన్ని రూ.5,42,985కి సాధిస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

“2029-2034 నాటికి తలసరి ఆదాయం రూ. 10,55,000కి సాధించగలం. ఇదేమీ అసాధ్యం కాదు. నిర్దిష్టమైన ఆలోచనతోనే ప్రణాళికలు వేశాం. మెగా డ్రీమ్స్ ఉండాలి. సంకల్పం ఉండాలి. అప్పుడు సాధ్యమే” అని చంద్రబాబు తెలిపారు. విజన్-2020 డాక్యుమెంట్ సాకారమయ్యాక కూడా విజన్ డాక్యుమెంట్లపై ఇంకా అనుమానాలు సరికాదని చంద్రబాబు చెప్పారు.

“భారత్ లాంటి దేశాల్లో సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమాంతరంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ‘సూపర్ సిక్స్ ద్వారా సంక్షేమం చేస్తున్నాం. అభివృద్ధికి అదే తరహాలో నిధులిస్తున్నాం. రాజకీయాలు ముఖ్యమే కానీ.. సమాజం గురించి కూడా ఆలోచించాలి. రాజకీయాలే ఆలోచించి ఉంటే హైదరాబాద్ అభివృద్ధి జరిగేది కాదు. విద్యుత్ సంస్కరణలు వచ్చేవి కావు” అని చంద్రబాబు పేర్కొన్నారు.

‘అమరావతిలో ప్రారంభించిన ప్రతి పనినీ మూడేళ్లలో పూర్తి చేస్తాం. ప్రధాని మోదీతో వాటిని ప్రారంభింపజేస్తాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం అమరావతిలో రూ.50వేల కోట్లపైచిలుకు విలువైన మౌలిక వసతుల కల్పన పనులు జరుగుతున్నాయని, వాటన్నింటినీ మూడేళ్లలో పూర్తిచేసి తీరతామని తెలిపారు. అమరావతి అభివృద్ధి అనేది హైదరాబాద్‌ తరహాలో నిరంతరం సాగుతూనే ఉంటుందని తెలిపారు. రాజధానిలో క్వాంటమ్‌ మిషన్‌ వచ్చే జనవరి నాటికి వస్తుందని తెలిపారు.