
* నవంబర్ లో ట్రంప్ భారత్ లో పర్యటించే అవకాశం
భారీ సుంకాలతో అమెరికా-భారత్ మధ్య సంబంధాలు దెబ్బతిన్న వేళ భారత్‌ను చైనాకు దూరం చేసి యూఎస్‌కు దగ్గర చేసుకోవడమే తమ ప్రాధాన్యమని భారత్‌కు అమెరికా రాయబారిగా నియమితులైన సెర్గీ గోర్ ప్రకటించడం ఆసక్తి కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ఈ ఏడాది చివర్లో నవంబర్‌లో భారత్‌లో జరగనున్న క్వాడ్ దేశాధినేతల సదస్సుకుహాజరయ్యే అవకాశం ఉన్నట్లు సెర్గీ గోర్ వెల్లడించారు. ఈ సదస్సు కోసం ఆయన ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఈ పర్యటనకు సంబంధించి ఇంకా చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.
విలేకరులతో సెర్గీ గోర్ మాట్లాడుతూ “భారత్‌ను యూఎస్ వైపునకు తీసుకురావడం అత్యంత ముఖ్యమైన విషయం. ఇందులో భాగంగా న్యూ ఢిల్లీని చైనా నుంచి దూరం చేయాలి. మా ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్‌ఎన్‌జీ కోసం భారత్ ప్రధాన మార్కెట్ కావాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చలు కూడా ఆ దిశగానే సాగుతున్నాయి” అని తెలిపారు.
అమెరికా మొత్తం జనాభా కంటే భారత్‌లో మధ్య తరగతి ప్రజలే ఎక్కువ అని ఆయన గుర్తు చేశారు. ఆ దేశ మార్కెట్ అమెరికాకు అపారమైన అవకాశాలను అందిస్తుందని వివరించారు. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య నెలకొన్న అడ్డంకులు త్వరలోనే తొలగిపోతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. భారత ప్రభుత్వం, అక్కడి ప్రజలతో అమెరికా సంబంధాలు దశాబ్దాల నాటివని ఈ సందర్భంగా సెర్గీ గోర్ గుర్తు చేశారు.
చైనీయులతో కంటే అమెరికా ప్రజలతోనే వారికి గొప్ప స్నేహం ఉందని అభిప్రాయపడ్డారు. భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, ఇతర ప్రతినిధులను ట్రంప్ అమెరికాకు ఆహ్వానించినట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. వారు అమెరికా వాణిజ్య ప్రతినిధితో సమావేశమవుతారని, ఈ సమావేశంలో ఆశించదగిన ఒప్పందం జరిగే అవకాశం ఉందని చెప్పారు.
అయితే సెర్గియో గోర్ అభ్యర్థిత్వాన్ని సెనెట్ ఆమోదించాల్సి ఉంటుంది. ఈ క్రమలో సెనెట్ ఆమోదం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సెర్గియో గోర్‌ను సెనెట్ ఫారన్ రిలేషన్స్ కమిటీకి రూబియో పరిచయం చేశారు. భవిష్యత్తులో ఇండో-ఫసిఫిక్ ప్రాంత అభివృద్ధి ముఖ్యంగా అందులో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని రూబియో అభిప్రాయపడ్డారు.
భారత్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తూ ప్రస్తుతం ప్రపంచంలో అమెరికాతో అత్యున్నత సంబంధాలు కలిగి ఉన్న దేశాల్లో భారత్ ఒకటని ఆయన కొనియాడారు. భారత్‌తో సంబంధాల విషయంలో మనం కొంత అసాధారణ స్థితిలో ఉన్నామని, దీనిపై వారితో కలిసి పని చేసి పరిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ క్రమంలోనే భారత్‌లో అమెరికా రాయబారిగా ప్రతిపాదించిన సెర్గియో గోర్‌ను ప్రశంసించారు రూబియో.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో గోర్‌కు ఉన్న అనుబంధం ఈ సమస్యల పరిష్కారానికి ఉపయోగపడాతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సెర్గియో గోర్ కంటే ఈ పనులు చేయగల సమర్థుడు తనకు మరొకరు కనిపించడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్‌లో ప్రెసిడెన్షియల్ పర్సనల్ డైరెక్టర్‌గా ఉన్న గోర్‌ను తదుపరి భారత్‌లో అమెరికా రాయాబారిగా నియమించారు.
మాజీ రాయబారి ఎరిక్ గార్సెట్టి తర్వాత ఈ ఏడాది జనవరి నుంచి ఖాళీగా ఉన్న స్థానాన్ని భర్తీ చేయడానికి గోర్‌ను ట్రంప్ నామినేట్ చేశారు. ఒకవేళ ఈ నియామకం పూర్తి అయితే భారత్‌లో అతి పిన్న వయస్కుడైన అమెరికా రాయబారి రికార్డ్ సాధించనున్నారు.
More Stories
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్‌లో చీలిక!