
2026 నాటికి దేశంలో నక్సల్స్ లేకుండా చూస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికే తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే దేశంలో ఎక్కువ మంది నక్సల్స్ తలదాచుకుంటున్న ఛత్తీస్‌గఢ్‌లో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఈ నేపథ్యంలోనే అడవుల్లో భారీ ఎత్తున నక్సల్స్ ఆచూకీ కోసం కూంబింగ్ కొనసాగుతోంది. ఇందులో భాగంగానే గత కొన్ని నెలలుగా ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న వరుస ఎన్‌కౌంటర్లలో వందల సంఖ్యలో మావోయిస్ట్‌లు నేలకొరిగారు.
తాజాగా గరియాబంద్ జిల్లాలో భద్రతా బలగాలు చేపట్టిన మేజర్ ఆపరేషన్‌లో 10 మంది మావోయిస్ట్‌లు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో కీలక నేతలు ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇందులో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్ అలియాస్ మోడెం బాలకృష్ణ ఉన్నారని భద్రతా దళ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. మోడెం బాలకృష్ణ స్వస్థలం తెలంగాణ కావడం గమనార్హం. ఇతడిపై కోటి రూపాయల రివార్డ్ ఉన్నట్లు తెలిపారు.
మరోవైపు ఒడిశా రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రమోద్ అలియాస్ పాండు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి 10 మంది మావోయిస్ట్‌ల మృతదేహాలతోపాటు భారీ మొత్తంలో ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఆపరేషన్‌లో గరియాబంద్ ఈ30, కోబ్రా జవాన్లు, ఎస్‌టీఎఫ్ బలగాలు పాల్గొన్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌ను గరియాబంద్ ఎస్పీ నిఖిల్ రఖేచా అనుక్షణం పర్యవేక్షించారు. రాయ్‌పూర్ రేంజ్ ఐజీ అమ్రేష్ మిశ్రా ఎన్‌కౌంటర్‌ను ధ్రువీకరించారు.
గరియాబంద్‌లో భద్రతా దళాలు, నక్సల్స్ మధ్య ఎదురుకాల్పులు జరిగాయని, ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు “స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టిఎఫ్), కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్ – సిఆర్పిఎఫ్ ఎలైట్ యూనిట్), ఇతర రాష్ట్ర పోలీసు విభాగాలకు చెందిన సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. అడపాదడపా కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి” అని మిశ్రా పేర్కోన్నారు.
మరోవంక, దంతేవాడ జిల్లాలోని పల్లి-బార్సూర్ రోడ్డు ప్రాంతంలో ప్రెజర్ ఐఈడీ పేలుడులో ఇద్దరు సీఆర్‌పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. ఈ క్రమంలో తెల్లవారుజాము నుంచి భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. దంతేవాడ పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) గౌరవ్ రాయ్ మాట్లాడుతూ మందుపాతరలను నిర్మూలించేందుకు చేపట్టిన ఆపరేషన్ సమయంలో పేలుడు జరిగిందని పేర్కొన్నారు.
ప్రెజర్ ఐఈడీ పేలుడులో ఇద్దరు జవాన్లు గాయపడ్డారని, ఇందులో ఒకరు ఇన్‌స్పెక్టర్ అని పేర్కొన్నారు. బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజబుల్ స్క్వాడ్ టీమ్ జవాన్ గాయపడ్డట్లు చెప్పారు. గాయపడిన ఇద్దరు దంతేవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, మెరుగైన వైద్య సంరక్షణ కోసం రాయ్‌పూర్‌కు హెలికాప్టర్ ద్వారా తరలించనున్నట్లు తెలిపారు. గాయపడిన సిబ్బంది సీఆర్పీఎఫ్ 195 బెటాలియన్‌కు చెందినవారని చెప్పారు.
More Stories
సుప్రీంకోర్టు శక్తి హీనురాలై, పని లేకుండా కూర్చోవాలా?
భారీ ఉగ్ర కుట్ర భగ్నం చేసిన ఢిల్లీ స్పెషల్ పోలీస్
ఈ20 బ్లెండింగ్ పై సోషల్ మీడియాలో పెయిడ్ క్యాంపెయిన్