సుప్రీంకోర్టు శక్తి హీనురాలై, పని లేకుండా కూర్చోవాలా?

సుప్రీంకోర్టు శక్తి హీనురాలై, పని లేకుండా కూర్చోవాలా?
‘ప్రజాస్వామ్యంలోని ఒక విభాగం తన విధులను నిర్వర్తించడంలో విఫలమైతే, రాజ్యాంగ సంరక్షకురాలైన సుప్రీంకోర్టు శక్తి హీనురాలై, పని లేకుండా కూర్చోవాలా?’ అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బిఆర్‌ గవాయ్ ప్రశ్నించారు.  143వ అధికరణ కింద రాష్ట్రపతి చేసిన ప్రస్తావనపై పది రోజుల పాటు సుదీర్ఘంగా వాదనలు విన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బిఆర్‌ గవాయ్, న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ పిఎస్‌ నరసింహ, జస్టిస్‌ ఎఎస్‌ చందూర్కర్‌లతో కూడిన ధర్మాసనం తన తీర్పును రిజర్వు చేసుకుంది. 
 
గురువారం విచారణ సందర్భంగా సిజెఐ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ”ఎంత ఉన్నతాధికారంలో వున్న వ్యక్తి అయినా చట్టానికి అతీతుడు కాదు.  నేను అధికారాల విభజన సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతాను. న్యాయపరమైన క్రియాశీలత న్యాయపరమైన ఉగ్రవాదంగా మారకూడదని గట్టిగా విశ్వసిస్తున్నా. అయితే అదే సమయంలో, ప్రజాస్వామ్యంలోని ఒక విభాగం తన విధులను నిర్వర్తించడంలో విఫలమైతే, రాజ్యాంగ సంరక్షకురాలిగా ఉన్న కోర్టు శక్తి ఉడిగి, పనేమీ లేకుండా చేతులు ముడుచుకుని కూర్చోవాలా?” అని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు.
 
రాష్ట్రాల్లో గవర్నర్ల పాత్రను ఊహించేటప్పుడు పరస్పర ఆమోదయోగ్యంతో కూడిన వాతావరణాన్ని రాజ్యాంగ రూపకర్తలు దృష్టిలో పెట్టుకున్నారని జస్టిస్‌ గవారు తెలిపారు. గవర్నర్ల పాత్రను రాజ్యాంగ రూపకర్తలు పరిశీలించేటప్పుడు పరస్పర సామరస్య వాతావరణం వుంటుందని భావించారు. అందువల్ల గవర్నర్లను నియమించేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కేంద్రం గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం వుందని గవాయ్ వ్యాఖ్యలు చేశారు. 
 
ఆర్టికల్‌ 200 కింద గవర్నర్‌ను ఒక నిర్దిష్ట పద్ధతిలోనే నిర్ణయం తీసుకోవాలని కోర్టు కోరలేదని, కానీ గవర్నర్‌ ఒక నిర్ణయం తీసుకోవాల్సిందేనని కోర్టు కోరవచ్చని జస్టిస్‌ జె. సూర్యకాంత్‌ వ్యాఖ్యానించారు. తరువాత సందర్భాల్లో మాండమస్‌ను జారీ చేయవచ్చని పేర్కొన్నారు. బిల్లులను ఆమోదించే విషయంలో రాష్ట్రపతికి, గవర్నర్లకు న్యాయస్థానాలు కాలపరిమితులను విధించవచ్చా? అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టును వివరణ కోరారు.
ఈ సందర్భంగా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 143(1) కింద 14 ప్రశ్నలను సుప్రీంకోర్టుకు సంధించారు. వాటిపై న్యాయ సలహా కోరారు. దీంతో ఈ అంశంపై తమ అభిప్రాయాలను తెలపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు కోరింది.  బిజెపి పాలిత రాష్ట్రాలు గవర్నర్లు, రాష్ట్రపతికి అనుకూలంగా అభిప్రాయం వ్యక్తం చేశాయి. బిల్లులపై నిర్ణయం తీసుకునేందుకు నిర్ణీత గడువు ఉండాలని తమిళనాడు, కేరళ, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌, కేరళ, కర్ణాటక, పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాలు స్పష్టం చేశాయి. మొత్తంగా వాదనలు ముగియడంతో ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది.