రేపు మ‌ణిపూర్‌లో ప్ర‌ధాని మోదీ పర్యటన

రేపు మ‌ణిపూర్‌లో ప్ర‌ధాని మోదీ పర్యటన
జాతుల మధ్య ఘర్షణలతో రావణకాష్టంలా మారిన ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం పర్యటించనున్నారు. ఘర్షణలు ప్రారంభమై రెండున్నరేళ్లు పూర్తైనా మోదీ అక్కడ పర్యటించకపోవడం తీవ్ర విమర్శలకు తావిచ్చిన వేళ ఆయన అక్కడ పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.  మీడియాతో మాట్లాడిన మణిపుర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునీత్‌ కుమార్‌ గోయెల్‌ రేపు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు ప్రధాని చురాచంద్‌పూర్‌లో ఘర్షణల్లో నిరాశ్రయులైన వారిని కలుసుకుంటారని తెలిపారు. 
స‌మ‌గ్ర‌, సుస్థిర‌, స‌మృద్ధిక‌ర‌మైన అభివృద్ధి సాధించే దిశ‌గా ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న సాగ‌తుందని చెప్పారు.  రాష్ట్రంలో మొత్తం రూ. 7,300 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారని,  అనంతరం పీస్‌గ్రౌండ్‌లో మణిపుర్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. తర్వాత రాజధాని ఇంఫాల్‌ వెళ్లి అక్కడ రూ. 1200 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. మైతేయ్‌-కుకీ తెగల మధ్య జరిగిన ఘర్షణల్లో చురాచంద్‌పుర్‌ తీవ్రంగా నష్టపోయింది. 260 మందికి పైగా ఇక్కడ బలయ్యారు. వేలమంది నిరాశ్రయులయ్యారు.

సెప్టెంబర్‌ 13-15 మధ్య మోదీ మిజోరాం, మణిపుర్‌, అసోం, పశ్చిమ బంగాల్‌, బిహార్‌లలో పర్యటిస్తారు. మోదీ మణిపుర్‌ పర్యటనను కాంగ్రెస్‌ స్వాగతించింది. ఇప్పటికైనా మోదీ పర్యటించడం సంతోషించదగ్గ విషయమని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. ఇన్నేళ్లు రణరంగంగా మారిన మణిపుర్‌లో మోదీ 3 గంటలు మాత్రమే పర్యటించడం ఆ రాష్ట్రాన్ని అవమానించడమే అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ విమర్శించారు.

ఈశాన్య రాష్ట్రాల్లో సుమారు రూ. 71,850 కోట్ల ఖ‌రీదైన ప్రాజెక్టుల‌కు మోదీ శంకుస్థాప‌న చేయ‌నున్నారు. బీహార్‌లో జాతీయ మ‌కానా బోర్డును ప్రారంభించ‌నున్నారు. ప్రాంతీయ సంబంధాల‌ను బ‌లోపేతం చేసేందుకు బీహార్‌లోని పుర్నియా విమానాశ్ర‌యంలో కొత్త ట‌ర్మిన‌ల్ బిల్డింగ్‌ను ప్రారంభించ‌నున్నారు.  పుర్నియాలో సుమారు రూ. 36 వేల కోట్ల ఖ‌రీదైన ప్రాజెక్టుల చేప‌ట్ట‌నున్నారు. మిజోరంలోని ఐజ్వాల్‌లో సుమారు రూ. 9 వేల కోట్ల ఖరీదైన డెవ‌ల‌ప్మెంట్ ప‌నులు ప్రారంభంకానున్నాయి. మిజోరంలో బైరాబి-సైరంగ్ మ‌ధ్య కొత్త రైల్వే లైన్‌ను ప్రారంభించ‌నున్నారు.

గౌహ‌తిలో జ‌ర‌గ‌నున్న డాక్ట‌ర్ భూపెన్ హ‌జారికా శ‌త జ‌యంతి ఉత్స‌వాల్లో మోదీ పాల్గొంటారు. అస్సాంలో సుమారు  రూ.18,350 కోట్ల‌ విలువైన ప‌నుల‌కు ప్ర‌ఝ‌ధాని మోదీ శంకుస్థాప‌న చేస్తారు. అనంతరం అస్సాం బయో ఇథనాల్‌ ప్రైవేట్‌ లిమెటెడ్‌ను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1.45 గంటలకు గోలాఘాట్‌లో నుమాలిగఢ్‌ రిఫైనరీని ప్లాంట్‌ను ప్రారంభిస్తారు.

సోమవారం ఉదయం 9.30 గంటలకు పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో 16వ ‘కంబైన్డ్‌ కమాండర్స్‌ కాన్ఫరెన్స్‌-2025’ ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం బీహార్‌కు వెళ్లి పూర్నియా ఎయిర్‌పోర్టు కొత్త టెర్మినల్ బిల్డింగును ప్రారంభిస్తారు. అనంతరం పూర్నియాలో రూ.36 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అక్కడ బహరింగసభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత నేషనల్ మఖానా బోర్డును ప్రారంభిస్తారు.