భారీ ఉగ్ర కుట్ర భగ్నం చేసిన ఢిల్లీ స్పెషల్ పోలీస్

భారీ ఉగ్ర కుట్ర భగ్నం చేసిన ఢిల్లీ స్పెషల్ పోలీస్

* పాక్ హ్యాండ్లర్ల సూచనలతో పని చేస్తున్న ముష్కరులు!

దేశంలో భారీ ఉగ్ర కుట్రను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు భగ్నం చేశారు. ఉగ్రవాద మాడ్యూల్‌కు సంబంధించి బుధవారం ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు, గురువారం మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముష్కరులంతా ఉగ్రవాదానికి బాగా ఆకర్షితులయ్యారనీ, పాకిస్థాన్‌కు చెందిన హ్యాండ్లర్ల సూచనలతో ఇక్కడ పని చేస్తున్నారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. 

పేలుడు పదార్థాలు తయారు చేసేందుకు వాడే వస్తువులను ఈ ముష్కరుల నుంచి స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. నిఘా వర్గాల సమాచారంతో దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఉగ్రవాద మాడ్యూల్‌కు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేశారు. ముంబయిలో ఉండే అఫ్తాబ్, సుఫియాన్‌లను దిల్లీలో అరెస్టు చేశారు.  అషర్ డానిష్‌ను ఝార్ఖండ్‌లోని రాంచీలో అరెస్టు చేశారు. హుజైఫా యమన్‌ను తెలంగాణలో, కమ్రాన్ ఖురేషీని మధ్యప్రదేశ్‌లో అరెస్టు చేశారు.

ముష్కరుల నుంచి ‘ఐఈడీ’ల తయారీకి వాడే ముడి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. దేశీయంగా తయారు చేసిన పిస్టల్, లైవ్ మందుగుండు సామగ్రితో సహా హైడ్రోక్లోరిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లం, సల్ఫర్ పౌడర్, వైర్లు, ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు, ల్యాప్ టాప్‌లు, మాస్క్‌లు, ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. డిల్లీ స్పెషల్‌ సెల్ అరెస్టు చేసిన ఐదుగురు ఉగ్రవాదులు పాకిస్థాన్‌కు చెందిన హ్యాండ్లర్ల సూచనల ఆధారంగా పని చేస్తున్నారని డిల్లీ స్పెషల్‌ సెల్ అదనపు సీపీ ప్రమోద్ సింగ్ కుష్వాహా తెలిపారు.

మొత్తం 11 మందిని విచారించిన తర్వాత ఐదుగురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ ఉగ్రవాద మాడ్యూల్‌లో ప్రధాన పాత్ర డానిష్‌ది అని సీపీ తెలిపారు.  ఇతడు పైకి ఓ ప్రొఫెషనల్ కంపెనీని నడుపుతున్నట్లు వ్యవహరిస్తాడని చెప్పారు. నిఘా వర్గాలకు అనుమానం రాకుండా సంప్రదింపులు జరిపేటప్పుడు కోడ్‌వర్డ్‌ల కింద సిఈఓ అని వాడుతారని తెలిపారు. అతడి ఉగ్రవాద ముఠా మాత్రం అంతర్గతంగా ఘజ్వా లీడరని పిలుస్తారని వివరించారు.

డానిష్‌ తర్వాత రెండో కీలక వ్యక్తి ఆఫ్తాబ్‌ అని అతడి పని వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని చంపడమని పేర్కొన్నారు. ఈ ముష్కరులు ఉగ్రవాదానికి బాగా ఆకర్షితులయ్యారని చెప్పారు. “ఈ ఉగ్రవాద గ్రూపునకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేశాం. ఈ ఉగ్రవాద ముఠాను పాకిస్థాన్ నుంచి హ్యాండిల్ చేస్తున్నారు. ఇది ఒక ప్యాన్‌ ఇండియా టెర్రర్‌ మాడ్యూల్‌. ఇందులో కీలక వ్యక్తి డానిష్‌. ఈ ఐదుగురి వయస్సు 20 నుంచి 26 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఇందులో డానిష్ అనే ఉగ్రవాది ఝార్ఖండ్‌లో ఉంటాడు” అని కుష్వావా  తెలిపారు. 

“ఝార్ఖండ్‌లో అతడి వద్దనే అధికంగా వస్తువులను స్వాధీనం చేసుకున్నాం. పాకిస్థాన్ హ్యాండ్లర్లతో డానిష్ సంప్రదింపులు జరిపాడు. డానిష్‌ తర్వాత రెండో కీలక వ్యక్తి ఆఫ్తాబ్‌. ముంబయికి సమీపంలోని ఠానేలో ఉంటాడు. మాంసం వ్యాపారం చేస్తాడు. వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని చంపడం అతడి పని” అని వివరించారు.