ఢిల్లీ, ముంబై హైకోర్టులకు బాంబు బెదిరింపులు

ఢిల్లీ, ముంబై హైకోర్టులకు బాంబు బెదిరింపులు
దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఆర్ధిక రాజధాని ముంబైలలో హై కోర్టులకు బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. దీంతో పోలీసులుఅప్రమత్తం అయ్యారు. ఢిల్లీ పోలీసు వర్గాల సమాచారం ప్రకారం శుక్రవారం ఉదయం ఢిల్లీ హైకోర్టులో బాంబులు పెట్టినట్లు ఈమెయిల్‌ వచ్చింది. కోర్టు ప్రాంగణంలో మూడు బాంబులను అమర్చామని, మరికాసేపట్లో అవి పేలుతాయంటూ అందులో బెదిరించారు. 
 
మధ్యాహ్నం 2 గంటల్లోపు ఖాళీ చేయాలని సూచించారు. అయితే, పేలుడు పదార్థాలు ఎక్కడెక్కడ పెట్టారన్నది అందులో పేర్కొనలేదు. వెంటనే బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌తో అక్కడికి చేరుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా కోర్టులోని న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బందిని బయటకు పంపించారు. అనంతరం తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు.

ఈ మెయిల్ పంపించిన వ్యక్తి తనను తాను విజయ్​ శర్మగా చెప్పుకున్నాడు. అతను ఆర్​జీ అరుణ్ భరద్వాజ్​కు ఈ-మెయిల్​ పంపాడు. అందులో “డాక్టర్​ షా ఫైసల్ అనే తెలివైన యువ షియా ముస్లిం కాంబటోర్​లోని పాకిస్థాన్ ఐఎస్​ఐ సెల్స్​తో సంబంధాలు ఏర్పరుచుకున్నాడు. 1998లో పట్నాలో జరిగిన బాంబు దాడుల లాంటివి వారు ప్లాన్ చేశారు” అని అందులో పేర్కొన్నాడు.

ఈ-మెయిల్​లో ఒక ఫోన్ నంబర్​ కూడా ఉంది. అది సత్యభామ సెంగోట్టయన్​ మహిళ నంబర్​ అని. ఆమె వద్ద పేలుడు పరికారలను నిర్వీర్యం చేసే కోడ్​లు ఉన్నాయని అందులో ఉంది.“2017 నుంచి పోలీసు దళాల్లో స్లీపర్ అసెట్స్​ను చొప్పించడం జరుగుతోంది. వారు ఈ పవిత్ర శుక్రవారం కోసం వేచి చూస్తున్నారు. వీరు ఢిల్లీ హైకోర్టులో పేల్చే బాంబులు, ఇవి మునుపటిలా అబద్దపు బెదిరింపులు కావని స్పష్టం చేస్తుంది. ఇవాళ మధ్యాహ్నం ప్రార్థనల తరువాత జడ్జి ఛాంబర్​లో బాంబు పేలుతుంది” అని ఈ-మెయిల్​లో పేర్కొనడం జరిగింది.

అదేవిధంగా ముంబై హైకోర్టులో కూడా బాంబు బెదిరింపు మెయిల్‌ రావడంతో  అధికారులు అప్రమత్తమయ్యారు. లాయర్లను, కేసుల విచారణ కోసం వచ్చిన ప్రజలను, కోర్టు సిబ్బందిని వెంటనే ఖాళీ చేయించారు. పోలీసులు, బాంబ్ స్క్వాడ్‌ ను రప్పించి తనిఖీలు చేపట్టారు. ఎలాంటి బాంబు లేదని తనీఖీల్లో తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

బెదిరింపు మెయిల్‌ పంపిన వ్యక్తిని గుర్తించేందుకు  పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

గత కొన్ని నెలలుగా గుర్తుతెలియని వ్యక్తులు ఢిల్లీలోని పలు సంస్థలకు ముఖ్యంగా పాఠశాలలే లక్ష్యంగా బాంబులు పెట్టామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. వారిని గుర్తించడం పోలీసులకు పెను సవాల్‌గా మారింది.