ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్‌

ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్‌

నిజామాబాద్ జిల్లా బోధన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ‘ఉగ్ర’ లింకులు కలకలం సృష్టించాయి. ఎన్‌ఐఎ, కేంద్ర దర్యాప్తు సంస్థలు నిజామాబాద్ జిల్లా బోధన్‌లో తనిఖీలు చేపట్టాయి. ‘బోధన్ పట్టణంలో బుధవారం తెల్లవారు జామున ఎన్‌ఐఎ విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్లు అనుమానిస్తున్న పట్టణంలోని అనీసనగర్‌‌కు చెందిన డ్యానిష్ ను పోలీసులు గుర్తించారు. అతడి నుంచి ఓ తుపాకీ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.  

అనంతరం బోధన్ కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీకి తీసుకొని తీసుకుని ప్రశ్నిస్తున్న సమయంలో కీలక విషయాలు బయటపడ్డాయని పోలీసులు వెల్లడించారు.  ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా కేంద్ర నిఘా సంస్థలు, ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలు కలిగి ఉన్న వారిపై నిఘా ఉంచాయి. ఈ క్రమంలో అషర్ డానిష్‌ను జార్ఖండ్‌లోని రాంచీలో అరెస్ట్ చేశాయి. అనంతరం అతడు ఇచ్చిన సమాచారం మేరకు దేశవ్యాప్తంగా తనిఖీలు చేపట్టాయి. 

ఢిల్లీలో మరో ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని బోధన్ పట్టణంలో కూడా ఎన్‌ఐఎ బృందాలు జల్లెడ పట్టాయి. పక్కా సమాచారం మేరకు ఉగ్ర మూలాలు కలిగిన వ్యక్తిని అరెస్టు చేశాయి. అతని వద్ద ఐఎస్‌ఐఎస్ కార్యకలాపాలకు సంబంధించిన కీలక సమాచారం రాబట్టడంతో పాటు ఓ ఎయిర్ పిస్టల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. 

డ్యానిష్‌కు ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధాలు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఝార్ఖండ్‌‌‌లోని రాంచిలో బాంబు బ్లాస్టింగ్‌‌కు కుట్రలు పన్నుతున్నట్లు పేర్కొన్నారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు బోధన్‌‌లోని పలు చోట్ల తనిఖీలు నిర్వహించామని చెప్పారు. మరింత సమాచారం కోసం అతడిని విచారించాల్సి ఉందని ఢిల్లీ నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. అయితే.. బోధన్‌లో డ్యానిష్ ఒక్కడే ఉన్నడా.? డ్యానిష్ ఒక్కడే ఉంటే తనకి చేతికి తుపాకీ ఎలా వచ్చింది.? ఝార్ఖండ్‌‌‌లాగానే తెలంగాణలో కూడా ఏమైనా బాంబు బ్లాస్టింగ్‌ ప్లాన్ చేశాడా? రాష్ట్రంలో డ్యానిష్ లాంటి ఉగ్రవాదులు ఇంకా ఉన్నారా? అనే సందేహాలు ప్రజలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి.

 గతంలోనూ బోధన్ పట్టణంలో ఉగ్రలింకులకు సంబంధించి ఎన్‌ఐఎ సహా పలు కేంద్ర దర్యాప్తు సంస్థలు సోదాలు చేపట్టాయి. ఉగ్ర లింకులు కలిగిన వారిపై ఆరా తీశాయి. ప్రత్యేకించి బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు ఇక్కడి నుంచే పాస్‌పోర్టులు జారీ అయిన ఉదంతం కూడా అప్పట్లో తీవ్ర చర్చకు దారి తీసింది. తాజాగా ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలున్న వ్యక్తి పట్టుబడడం జిల్లాలో చర్చనీయాంశంతో పాటు ఆందోళనలకు తావునిస్తోంది.