
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ జరిగే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇటీవల బీహార్ లో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను ఇప్పుడు దేశం మొత్తం విస్తరించే దిశగా కేంద్ర ఎన్నికల సంఘం ఆలోచనలో ఉంది. బీహార్‌లో ఇటీవల జరిగిన ఓటర్ల జాబితా సవరణలో పెద్దఎత్తున మార్పులు చోటుచేసుకున్నాయి. ఆ ప్రక్రియలోనే దాదాపు 65 లక్షల ఓటర్ల పేర్లు తొలగించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఈ కసరత్తు బీహార్‌లో అత్యంత ప్రాముఖ్యం సంతరించుకుంది.
ఇదే నమూనాను ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఎన్నికల సంఘం యోచిస్తోంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్య ఎన్నికల అధికారులతో బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సవరణ చేపట్టేందుకు అవసరమైన అంశాలను చర్చించినట్లు సమాచారం. ఎలాంటి లోపాలు లేకుండా ఓటర్ల జాబితాను మరింత ఖచ్చితంగా మార్చే ప్రయత్నమే ఈ చర్చల ప్రధాన ఉద్దేశ్యం. ప్రస్తుతం ఈ సవరణ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందన్న దానిపై అధికారిక ప్రకటన రాలేదు.
కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికీ ఖచ్చితమైన తేదీలను వెల్లడించలేదు. అయినా త్వరలోనే ఆ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సవరణ ప్రక్రియ ప్రధాన ఉద్దేశ్యం అక్రమ ఓటర్ల తొలగింపు. ఓటర్ల జాబితాలో పేర్లు పునరావృతం కావడం, తప్పుడు వివరాలతో నమోదు కావడం వంటి సమస్యలు తరచూ వస్తూనే ఉంటాయి.
బీహార్‌లో జరిగిన సవరణలోనే ఇది స్పష్టమైంది. ఇలాంటి లోపాలను దేశవ్యాప్తంగా సరిచేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజాస్వామ్యంలో పారదర్శకమైన ఎన్నికలు అత్యంత ముఖ్యం. అందుకోసం ఓటర్ల జాబితా తప్పులు లేకుండా ఉండటం అవసరం.
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టబోయే ఈ భారీ కసరత్తు ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయనుంది. సరైన ఓటర్లు సరైన హక్కు వినియోగించుకునేలా ఈ చర్య ఉపకరించనుంది. ఈ ప్రక్రియ విజయవంతం కావాలంటే రాష్ట్రాల సహకారం అత్యంత అవసరం. రాష్ట్ర ఎన్నికల అధికారులు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తే మాత్రమే అక్రమ ఓటర్ల తొలగింపు సులభమవుతుంది.
More Stories
ఢిల్లీలో నలుగురు బీహార్ మోస్ట్‌వాంటెడ్ గ్యాంగ్స్టర్లు హతం
లోక్‌పాల్ కు ఏడు బిఎండబ్ల్యూ కార్ల కొనుగోలుపై దుమారం
శబరిమల బంగారం కేసులో కుట్ర?.. దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం