
భారతీయ విద్యార్థులకు అమెరికా తలుపులు మూసేసినట్టుగానే కెనడా కూడా భారత విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లుతున్నది. ఈ ఏడాది ఇప్పటి వరకు భారతీయ విద్యార్థుల వీసా దరఖాస్తుల్లో 80% తిరస్కరించింది. ఇది గత పదేండ్లలోనే అత్యధికం కావడం గమనార్హం. ఈ గణాంకాలను స్వయంగా కెనడా ప్రభుత్వమే వెల్లడించింది.
కెనడా ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ (ఐ ఆర్ సి సి) నివేదిక ప్రకారం గత దశాబ్దంలో ఇంత పెద్ద స్థాయిలో తిరస్కరణలు జరగడం ఇదే తొలిసారి. వీసా రిజెక్షన్ రేటు పెరగడంతో కెనడాలో చదువుకోడానికి వెళ్తున్న భారత విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. 2024లో కేవలం 1.88 లక్షల మందికి మాత్రమే అనుమతులు లభించాయి.
ఇది రెండు సంవత్సరాల క్రితం కంటే సగానికి పైగా తగ్గిన సంఖ్య. ఒకప్పుడు భారతీయ విద్యార్థుల్లో 18% మంది కెనడాను ఎంచుకోగా, ప్రస్తుతం ఆ సంఖ్య 9%కు పడిపోయింది. దానితో 2024లో ఉన్నత విద్య కోసం భారతీయ విద్యార్థులు ఆసక్తి చూపిన గమ్యస్థానంగా జర్మనీ నిలిచినట్లు నివేదికలు చెబుతున్నాయి.
భారతీయ విద్యార్థుల్లో 31శాతం మంది జర్మనీలో ఉన్నత విద్యను అభ్యసించడానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చారు. 2022లో 18శాతం మంది భారతీయ విద్యార్థులు కెనడాలో చదివేందుకు మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. అంటే కెనడాలో చదవాలని కోరుకునే మన దేశ విద్యార్థుల సంఖ్య రెండేళ్ల వ్యవధిలో సగానికి సగం (18 శాతం నుంచి 9 శాతానికి) తగ్గిపోయింది.
కెనడా తిరస్కరణలతో ప్రధానంగా ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని దేశాల విద్యార్థులపై ప్రభావం పడింది. దీంతో వారు ఇతరత్రా దేశాల్లోని ప్రముఖ యూనివర్సిటీలు, కాలేజీల్లో చేరడం మొదలుపెట్టారు. కెనడా తలుపులు కఠినతరం కావడంతో, భారతీయ విద్యార్థులు ప్రత్యామ్నాయ గమ్యస్థానాలను వెతుకుతున్నారు. తక్కువ లేదా ఉచిత ఫీజులు, ఇంగ్లిష్ మాధ్యమంలో అందుబాటులో ఉన్న కోర్సులు, బలమైన ఆర్థిక వ్యవస్థ, మెరుగైన ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ జర్మనీని ఆకర్షణీయంగా మార్చాయి. గత ఐదేళ్లలో జర్మనీలో భారతీయ విద్యార్థుల సంఖ్య రెట్టింపై సుమారు 60,000కి చేరింది.
కెనడా ప్రభుత్వం గృహాల కొరత, మౌలిక వసతులపై ఒత్తిడి, స్థానిక రాజకీయ కారణాలను దృష్టిలో పెట్టుకుని కొత్త నియమాలు అమలు చేస్తోంది. ఇప్పుడు విద్యార్థులు వీసా కోసం 20,000 కెనడియన్ డాలర్లకు పైగా ఆర్థిక సాక్ష్యాలు, స్పష్టమైన స్టడీ ప్లాన్‌లు, లాంగ్వేజ్ టెస్ట్ ఫలితాలు సమర్పించాల్సి ఉంది. చదువు పూర్తయ్యాక వర్క్ పర్మిట్ అవకాశాలను కూడా పరిమితం చేశారు. అంతేకాకుండా, వేగవంతమైన వీసా ప్రాసెస్ కోసం ఉద్దేశించిన స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ ను నిలిపివేశారు.
కెనడా, అమెరికాలతో పోలిస్తే జర్మనీలో విద్యార్థుల విద్యా వ్యయాలు చాలా తక్కువగా ఉన్నాయి. జీవన వ్యయాలు సైతం తక్కువే. టెక్నాలజీ, మేనేజ్‌మెంట్, ఇంజినీరింగ్ విభాగాల్లో నాణ్యమైన ఉన్నత విద్యకు జర్మనీ పెట్టింది పేరు. ఉన్నత విద్య తర్వాత ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. దీనితో పాటు ఫ్రాన్స్, ఫిన్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, జపాన్, మలేషియా, మిడిల్ ఈస్ట్ దేశాల్లోనూ ఉన్నత విద్య కోసం అవకాశాలు క్రమంగా పెరుగుతున్నాయి.
More Stories
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్ కు చైనా, ఐరోపా, యుఎఈ, అమెరికాల నిఘా యంత్రాలు
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు