రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన

రామ రాజ్యం నాటి  సుపరిపాలన కోసం కూటమి పాలన
రామ రాజ్యంలో ప్రజలు పొందిన సుపరిపాలన అందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పని చేస్తోందని అనంతపురంలో నిర్వహించిన సూపర్​ సిక్స్​-సూపర్​ హిట్​ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.  సభ ద్వారా 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు కాలర్ ఎగరేసుకునేలా అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు. తాము ప్రజా భవిష్యత్తు కోసం పనిచేసే వారధులం మాత్రమేనని, పెత్తందార్లం కాదని తేల్చిచెప్పారు. 
 
ఎలాంటి పొరపాట్లు చేయొద్దని, మూడూ పార్టీల నేతలు, కార్యకర్తలను చంద్రబాబు కోరారు. మూడు పార్టీల కార్యకర్తలు ఐకమత్యంగా ఉండాలని, కలిసి ఉంటేనే బలం అని పేర్కొంటూ అహకారంతో విర్రవీగ్గొద్దంటూ కూటమి ఎమ్మెల్యేలకు సుతిమెత్తగా చురకలంటించారు. మళ్లీ వైకుంఠపాళి వద్దు, కూటమి ఉంటే ఏపీకి బంగారు భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. కలిసి పోటీ చేశాం – కలిసి పాలన చేస్తున్నాం – కలిసే ఉంటామని తేల్చి చెప్పారు.
 
కాగా, వచ్చే నెల 15వ తేదీన వాహనమిత్ర పథకాన్ని ప్రారంభించనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ పథకం కింద ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేలు అందజేస్తామని చెప్పారు. రాష్ట్ర పునర్‌ నిర్మాణం లక్ష్యంగా కూటమిలోని మూడు పార్టీలూ పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ‘సూపర్‌ సిక్స్‌-సూపర్‌ హిట్‌’ పేరుతో మూడు పార్టీలూ కలసి అనంతపురం నగరంలో భారీ బహిరంగ సభను బుధవారం నిర్వహించాయి. 
 
ఈ కార్యక్రమానికి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్‌, టిడిపి, జనసేన, బిజెపి ఎమ్మెల్యేలు, ఎంపిలు, రాష్ట్ర, జిల్లా నాయకులు హాజరయ్యారు.  సామాజిక న్యాయం కూటమి ప్రభుత్వ ధ్యేయమని సీఎం చంద్రబాబు తెలిపారు.  బీసీ సోదరులను ఆదుకునేందుకు నేతన్నలకు విద్యుత్ రాయితీ, మత్స్య కారులకు ఆర్థిక సాయం, కల్లుగీత కులాలకు మద్యం షాపుల్లో 10 శాతం కేటాయింపులు ఇచ్చామని గుర్తు చేశారు.
ఎస్సీ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన వర్గీకరణను ఎవరికీ నష్టం లేకుండా పూర్తి చేశామని, ఎస్టీల జీవన ప్రమాణాలు పెంచుతున్నామని తెలిపారు.  వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 700 సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అందరి ప్రభుత్వమని, అన్ని వర్గాలు, అందరి జీవితాలు మార్చే ప్రభుత్వమని చంద్రబాబు స్పష్టం చేశారు. యూనివర్సల్ హెల్త్ స్కీంతో పేదల వైద్య ఖర్చులు తగ్గుతాయన్నాని భరోసా ఇచ్చారు.

ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ పార్టీలు వేరైనా ప్రజల శ్రేయస్సు కోసం కలసి పనిచేస్తున్నామని తెలిపారు. సూపర్‌ సిక్స్‌ హామీలతో గత ఎన్నికల్లో ఘన విజయం సాధించామని, ఇప్పుడు వీటిని అమలు చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలో నాలుగు వేల కిలోమీటర్లు సిసి రోడ్ల నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు.  పిఎం జన్‌ధన్‌ పథకం ద్వారా 625 గిరిజన గ్రామాలను అనుసంధానం చేసే విధంగా రోడ్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు.

గిరిజన ప్రాంతాల్లో ఎక్కడా డోలీ మోతలు లేకుండా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లేవారని, ఇకనుంచి స్థానికంగానే ఉపాధి అకాశాలు కల్పించే పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని తెలిపారు.  బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్‌ మాట్లాడుతూ అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.15 వేల కోట్ల తోడ్పాటు అందించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందని తెలిపారు.