మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా తిపిరి తిరుపతి

మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా తిపిరి తిరుపతి

తిప్పిరి తిరుపతిని కొత్త మావోయిస్టు ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. మరో కీలక నేత హిడ్మాకు బస్తర్ బాధ్యతలు అప్పగించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్‌లోని నారాయణపూర్ జిల్లా అడవుల్లో మే 21న భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో సంస్థ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ అలియాస్ గగన్న మరో 28 మంది మావోయిస్టులు చనిపోయారు. 

ఉమ్మడి దళ ఆపరేషన్‌లో మరణించిన సిపిఐ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ వారసుడిగా తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ ఎన్నిక య్యాడు. తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన ఈ దళిత నాయకుడు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, కేంద్ర సైనిక కమిషన్ అధ్యక్షుడు. 

మరోవైపు, సాయుధ దళాల పిఎల్‌జిఎ(పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) యొక్క ‘అత్యంత సమర్థవంతమైన యూనిట్’గా పిలువబడే 1వ బెటాలియన్ కమాండర్ మాండవి హిడ్మా అలియాస్ సంతోష్ అలియాస్ హిడ్మలుకు సంస్థ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి బాధ్యత అప్పగించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్ అంతటా ఉమ్మడి కార్యకలాపాలను నిరోధించే బాధ్యత ఈ కమిటీకి ఉంది. 

ఆంధ్రప్రదేశ్‌లో లొంగిపోయిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కమలేష్‌ను ప్రశ్నించిన తర్వాత పోలీసులకు ఈ విషయం వెల్లడైందని సమాచారం. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికారిక నియామక లేఖ విడుదల చేసినట్లు ప్రచారం జరిగినా, ఆ లేఖ వెలుగులోకి రాలేదు.  మావోయిస్టు పార్టీ నూతన జాతీయ ప్రధాన కార్యదర్శి తిపిరి తిరుపతి అలియాస్ దేవ్’జీ… సంజీవ్, చేతన్, రామన్న, దేవ్’జీ అనే పేర్లతో దళంలో కీలక బాధ్యతలు పోషించారు. అయితే చిరకాలంగా దళంలో దేవ్’జీ అనే పేరే వాడకంలో ఉంది.

కోరుట్లకు చెందిన తిపిరి వెంకట నరసయ్య, గంగుబాయి దంపతులకు 1966లో తిరుపతి జన్మించారు.  ఆయనకు ముగ్గురు తోబుట్టువులున్నారు. అక్కయ్య లీల తన కుటుంబంతో హైదరాబాదులో స్థిరపడ్డారు. పెద్ద తమ్ముడు వెంకటి మృతిచెందగా ఆయన భార్య రాజనర్సు కుటుంబం ప్రస్తుతం తిరుపతి పుట్టి పెరిగిన ఇంట్లోనే జీవిస్తోంది. చిన్న తమ్ముడు గంగాధర్ కుటుంబం కోరుట్లలోనే ఉంటున్నారు. 

కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యాభ్యాసం సమయంలో ఆర్ఎస్ యూ అధ్యక్షునిగా తిరుపతి పనిచేశారు. అనంతరం 1983లో కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాలలో డిగ్రీ అడ్మిషన్ తీసుకున్నారు. 1984లో ఆయనను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్’కు తరలించగా, బెయిల్’పై ఇంటికి వచ్చిన తిరుపతి అడ్వకేట్’ను కలిసి వస్తానని వెళ్లి, మళ్లీ ఇంతవరకు తిరిగి రాలేదు.

చత్తీస్ ఘఢ్ కు చెందిన మావోయిస్టు జిల్లా కార్యదర్శి సృజన అనే ఆదివాసి మహిళతో దళంలోనే తిరుపతికి వివాహం జరిగినట్లు సమాచారం. కరోనా సమయంలో మహారాష్ట్రలోని గడిచిరోలి ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఆమె మృతి చెందింది. దళంలోనే ఏకమైన వీరికి ఎలాంటి సంతానం కలగలేదని సమాచారం. 

దళంలోకి వెళ్లిన తర్వాత కుటుంబ సభ్యులు ఆయన్ని కలవాలని ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు. అయన కూడా స్వగ్రామానికి రావడానికి, బంధువులకు కలవడానికి ప్రయత్నించలేదు. దళంలో చేరిన తిరుపతి మొదట మహారాష్ట్రలోని గడిచిరోలి జిల్లా కార్యదర్శిగా సంజీవ్ పేరుతో పనిచేశారు. తదుపరి రాష్ట్ర కమిటీ సభ్యునిగా చేతన్ పేరుతో, అంతరం మిల్ట్రీ కమిషన్ సభ్యునిగా రామన్న పేరుతో పనిచేశారు. అనంతరం సెంట్రల్ కమిటీ సభ్యునిగా, పోలిట్ బ్యూరో సభ్యునిగా దేవ్’జీ పేరుతో చిరకాలంగా పనిచేస్తున్నారు.

కాగా, 2019లో జరిగిన బిజెపి ఎమ్మెల్యే భీమా మాండవి హత్య కేసులో సిపిఐ (మావోయిస్ట్) కేంద్ర కమిటీలో అతి పిన్న వయస్కుడైన హిడ్మాపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) చార్జిషీట్ దాఖలు చేసింది. అతని సమాచారం కోసం రూ.40 లక్షల రివార్డును కూడా ప్రకటించారు. కానీ అతను ఇంకా కనిపించడం లేదు. పోలీసుల విచారణలో, ’మొబైల్ అకాడెమిక్ పొలిటికల్ ఆర్గనైజేషన్ స్కూల్’ మాజీ అధిపతి రామచంద్రారెడ్డి అలియాస్ శ్రీనివాస్‌కు దండకారణ్య జోనల్ కమిటీ బాధ్యత ఇస్తారని మొదట భావించామని కమలేష్ చెప్పాడని తెలిసింది. కానీ వయస్సు, ఆరోగ్యం కారణంగా, చివరికి అతనికి ఆ బాధ్యత రాలేదు.