నేపాల్ సుస్థిరత భారత్‌కు ఎంతో కీలకం

నేపాల్ సుస్థిరత భారత్‌కు ఎంతో కీలకం
 
నేపాల్‌లో చెలరేగిన హింసాత్మక ఘటనల్లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించడంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితులను చూస్తుంటే తన మనసు చివుక్కుమంటోందని ఆయన అన్నారు. ప్రస్తుతం అగ్నిగుండంలా మారిన హిమాలయ దేశంలో సుస్థిరత, శాంతి, సంపద.. వంటివి భారత్‌ ప్రధాన ప్రాధామ్యాలు అని ప్రధాని తెలిపారు. 

“నేపాల్‌లో హింసను చూసి మనసు తరుక్కుపోతోంది. ఎంతోమంది యువకులు ప్రాణాలు కోల్పోడం చాలా బాధేస్తోంది. నేపాల్‌లో సుస్థిరత, శాంతి, సంపద.. వంటివి భారత్ ప్రథమ ప్రాధాన్యాలు. ఆ దేశంలోని సోదరులు, సోదరీమణులు.. అందరిని శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా” అని మోదీ ఎక్స్ పోస్ట్‌లో వెల్లడించారు.  మంగళవారం ఉదయం ప్రధాని వరదలకు తీవ్రంగా నష్టపోయిన పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భద్రతా సమావేశంలో క్యాబినెట్ కమిటీ నేపాల్‌లోని పరిస్థితులను చర్చించిందని ప్రధాని తెలిపారు.

“ఈరోజు నేను హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ నుండి తిరిగి వచ్చినప్పుడు, భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశంలో నేపాల్‌లో జరిగిన పరిణామాల గురించి చర్చించారు. నేపాల్‌లో జరిగిన హింస హృదయ విదారకంగా ఉంది. చాలా మంది యువకులు ప్రాణాలు కోల్పోయారని నాకు బాధగా ఉంది. నేపాల్ స్థిరత్వం, శాంతి, శ్రేయస్సు మాకు అత్యంత ముఖ్యమైనవి. నేపాల్‌లోని నా సోదరులు, సోదరీమణులందరూ శాంతికి మద్దతు ఇవ్వాలని నేను వినయంగా విజ్ఞప్తి చేస్తున్నా” అని ప్రధాని మోదీ రాసుకొచ్చారు.

నేపాల్‌లో జరుగుతున్న పరిణామాలను భారత్​ నిశితంగా పరిశీలిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అనేక మంది యువకులు ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తోందని ఒక ప్రకటనను విడుదల చేసింది.

 “మా ఆలోచనలు మరియు ప్రార్థనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కూడా మేం కోరుకుంటున్నాం. సన్నిహిత మిత్రుడిగా, పొరుగువారిగా, సంబంధిత వారందరూ సంయమనం పాటిస్తారని అనుకుంటున్నాం. శాంతియుత మార్గాలు, సంభాషణల ద్వారా ఏవైనా సమస్యలను పరిష్కరిస్తారని మేం ఆశిస్తున్నాము. నేపాల్‌లోని అనేక ఇతర నగరాల్లో అధికారులు కర్ఫ్యూ విధించారని కూడా మేం గమనించాం” అని విదేశాంగ శాఖ విడుల చేసిన ప్రటనలో తెలిపింది.