ఇది ప్రతి భారతీయుడి విజయం

ఇది ప్రతి భారతీయుడి విజయం
ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడం ప్రతి భారతీయుడి విజయంగా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ అభివర్ణించారు. ఉపరాష్ట్రపతిగా దేశ అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఆయన ప్రకటించారు. అందరం కలిసి కట్టుగా కృషి చేయాలని సూచించారు.  ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పం వికసిత భారత్ సాధించాలంటే ప్రతి విషయంలో రాజకీయాలు చేయకూడదని హితవు చెప్పారు. అలాగే, ప్రజాస్వామ్యంలో అధికార పక్షం, ప్రతిపక్షం రెండూ సమానంగా అవసరమని, ఇవి ఒకే నాణానికి రెండు వైపులని వ్యాఖ్యానించారు.
“2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలంటే, ప్రతి విషయంలోనూ రాజకీయాలు చేయకూడదు. ఇకపై మనం అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. నా కొత్త బాధ్యతలో దేశ అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తాను. ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు రెండూ ముఖ్యమైనవి. అవి ఒకే నాణానికి రెండు వైపుల లాంటివి. ప్రజాస్వామ్య ప్రయోజనాలు పరిగణనలోకి ముందుకుసాగుతాను” అని రాధాకృష్ణన్ ప్రకటించారు.
ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష ఇండియా కూటమి చేసిన ప్రచారాన్ని కూడా సీపీ రాధాకృష్ణన్ తనదైన శైలిలో స్పందించారు. ‘ఇండియా’ కూటమి ఈ పోటీని ఒక సైద్ధాంతిక పోరాటంగా అభివర్ణించిందని గుర్తు చేశారు. అయితే, ప్రతి ప్రభుత్వ పదవికి కొన్ని ప్రాముఖ్యతలు, పరిమితులు ఉంటాయని, ఆ పరిధిలోనే పని చేయాల్సి ఉంటుందని సీపీ రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. ఎన్నిక వరకే రాజకీయాలు చేయాలని, ఆ తర్వాత పాలిటిక్స్‌ను పక్కన పెట్టి అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
“ప్రతి పదవి ముఖ్యమైనదే. ప్రతి పదవికి దాని సొంత పరిమితులు ఉంటాయి. ఆ పరిధిలో ఉండి మనం పని చేయాలని అర్థం చేసుకోవాలి. అవతలి పక్షం (ఇండియా కూటమి) ఇది ఒక సైద్ధాంతిక పోరాటమని చెప్పింది. కానీ ఓటింగ్ సరళిని బట్టి చూస్తే, జాతీయవాద భావజాలం విజయం సాధించిందని మనకు అర్థమవుతుంది” అని తెలిపారు.