ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బీఎస్ సుదర్శన్ రెడ్డిపై విజయం సాధించారు. దీనితో భారత 17వ ఉపరాష్ట్రపతి అయ్యారు. ఎన్డీఏ అభ్యర్థిగా నిలబడిన ఆయనకు 452 ఓట్లు రాగా, ఇండియా కూటమి తరఫున పోటీ చేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. దీనితో 152 ఓట్ల మెజారిటీతో రాధాకృష్ణన్ ఘనవిజయం సాధించారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల ఎలక్టోరల్ కాలేజ్‌లో మొత్తం 781 మంది సభ్యులు ఉండగా, అందులో 752 ఓట్లు పోల్ అయ్యాయి. అందులో 15 ఓట్లు చెల్లుబాటు కాకుండా పోయాయి. వాస్తవానికి ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక కావాలంటే 377 ఓట్లు సాధించాలి. అయితే అధికార ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేసిన సీపీ రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు వచ్చాయి.
ఇండియా కూటమి తరఫున పోటీ చేసిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీనితో జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై రాధాకృష్ణన్ సునాయాసంగా (152 ఓట్ల భారీ మెజారిటీ) గెలిచారు. 17 మంది ఎంపీలు గైర్హాజరవగా,15 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 781 మంది సభ్యులు ఉన్నారని రాజ్యసభ సెక్రటరీ తెలిపారు. ఎన్నికల్లో 767 మంది సభ్యులు ఓటు వేశారని, 752 చెల్లుబాటు అయ్యాయని ఆయన తెలిపారు.
మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ కు ఎన్డీయే ఆశించిన 427 మంది ఎంపీల కంటే దాదాపు 25 ఓట్లు ఎక్కువగా గెలుపొందడంతో క్రాస్ ఓటింగ్ జరిగిందని స్పష్టంగా కనిపించింది. మరోవైపు ప్రతిపక్షం అంచనా వేసిన 315 ఓట్లకు బదులుగా సుదర్శన రెడ్డికి 300 ఓట్లు మాత్రమే వచ్చాయి.
ప్రతిపక్ష అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫలితాన్ని వినయంగా అంగీకరించారు, భారతదేశ ప్రజాస్వామ్య ప్రక్రియలపై తనకున్న అచంచల విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఫలితం తనకు అనుకూలంగా లేకపోయినప్పటికీ, సైద్ధాంతిక పోరాటం మరింత శక్తితో కొనసాగుతుందని రెడ్డి స్పష్టం చేశారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన రాధాకృష్ణన్ కు అభినందనలు తెలిపారు.
ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సి.పి. రాధాకృష్ణన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందించారు. ప్రజా జీవితంలో ఆయన దశాబ్దాల గొప్ప అనుభవాన్ని గుర్తు చేస్తూ ఆయన నాయకత్వం దేశ పురోగతికి గణనీయంగా దోహదపడుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. = విజయవంతమైన, ప్రభావవంతమైన పదవీకాలం కోసం ఆమె తన శుభాకాంక్షలు తెలిపారు.
2025 ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన తిరు సి.పి. రాధాకృష్ణన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. సమాజానికి సేవ చేయడం, ముఖ్యంగా పేదలు, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడం పట్ల ఆయన జీవితకాల నిబద్ధతను ప్రశంసించారు. రాధాకృష్ణన్ అసాధారణ ఉపరాష్ట్రపతి అవుతారని, భారతదేశ రాజ్యాంగ విలువలను మరింత బలోపేతం చేస్తారని, పార్లమెంటరీ చర్చను సుసంపన్నం చేస్తారని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సి.పి. రాధాకృష్ణన్ విజయం సాధించినందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే అభినందనలు తెలిపారు. ఖర్గే తన సందేశంలో, ఉమ్మడి ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డి తన సూత్రప్రాయమైన పోరాటానికి కృతజ్ఞతలు తెలిపారు.
More Stories
అడ్డంకుల తొలగింపుకు చర్చలకు ట్రంప్, మోదీ సుముఖం!
ఇది ప్రతి భారతీయుడి విజయం
రాహుల్ గాంధీ మలేసియా `విహార యాత్ర’పై దుమారం