
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లక్ష కోట్ల అవినీతి జరిగినట్లు పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లో దోషులను శిక్షిస్తామని, హవాలా మార్గం ద్వారా విదేశాలకు తరలించిన వేల కోట్ల రూపాయలను తిరిగి రప్పిస్తామని హామీ ఇచ్చారని బిజెపి శాసనసభాపక్ష ఉపనాయకుడు పాయల్ శంకర్ గుర్తు చేశారు.
కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 90 రోజుల్లో ఏమీ జరగలేదే అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం అవినీతిపై సిబిఐ విచారణను కోరాలని ఆయన డిమాండ్ చేశారు. అందుకు 15 రోజుల సమయం ఇస్తున్నామని చెబుతూ లేదంటే జిఓ సవరించాలని సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు.
ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత కూడా కాళేశ్వరంలో జరిగిన అవినీతిని బయటకు తీయలేదని ఆయన ధ్వజమెత్తారు. ఒకవైపు ఘోష్ కమిటీని ఏర్పాటు చేసినా, మరోవైపు మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారంలోని బ్యారేజీలకు బుంగలు పడ్డాయి కానీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌కు సంబంధిత సమాచారం కూడా ఇవ్వకుండా, వారి సలహాలు పట్టించుకోకుండా వ్యవహరించారని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఒకటి… చేసేది మరొక్కటి అంటూ లక్ష కోట్ల రూపాయిలకు పైగా అవినీతి జరిగిందని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల విలువ రూ. 12 వేల కోట్లు మాత్రమే ఉన్నట్లు గుర్తించారని విస్మయం వ్యక్తం చేశారు. మిగతా లక్షల కోట్లకి సంబంధించి స్పష్టత చెప్పలేదని తెలిపారు.
పదుల సంఖ్యలో బ్యారేజీలు, వందల సబ్ స్టేషన్లు, పంపుహౌస్‌లు… అనేక అంశాల్లో అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని, కానీ ఈ అంశాలపై సీబీఐ విచారణ జరగలేని విధంగా జీవో జారీ చేశారని పాయల్ శంకర్ విస్మయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్‌ను కాపాడే ప్రయత్నంలో భాగంగా మూడు బ్యారేజీలపై మాత్రమే విచారణకు అప్పగిస్తూ జీవో ఇచ్చారని ఆయన ఆరోపించారు.
జీవోలో టర్మ్స్ అండ్ రిఫరెన్స్‌ను ఎందుకు చేర్చలేకపోతున్నారని ఆయన ప్రశించారు. టెండర్లు లేకుండా ఇచ్చిన వేల కోట్ల రూపాయల విలువ కలిగిన కాంట్రాక్టులు, నాణ్యత లేకుండా పనులు చేసిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఎందుకు ప్రస్తావించలేదని ఆయన నిలదీశారు.
సీబీఐకి అప్పగించే విషయంలో జీవోను వెంటనే సవరించి, జీవోలో టర్మ్స్ అండ్ రిఫరెన్స్‌ను సవరించాలని శంకర్ డిమాండ్ చేశారు. అసలు తుమ్మడిహట్టి నుంచి కాళేశ్వరానికి మార్చాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందో, దానికి బాధ్యులు ఎవరో నిగ్గు తేల్చాలని ఆయన సృతం చేశారు.
మిగతా లక్ష కోట్ల అవినీతికి సంబంధించిన అంశాలను కూడా టర్మ్స్ అండ్ రిఫరెన్స్‌లో మెన్షన్ చేయాలని కోరారు.
More Stories
హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు.
రాంచందర్ రావు కార్యవర్గంలో 8 మంది ఉపాధ్యక్షులు
11న బీజేపీ ప్రత్యేక రజాకార్ సినిమా స్క్రీనింగ్