వెనిజులాపై అమెరికా యుద్ధ సన్నాహాలు

వెనిజులాపై అమెరికా యుద్ధ సన్నాహాలు
ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న దేశం వెనిజులాపై అమెరికా యుద్ధ సన్నాహాలు చేస్తోంది. ఆ దేశం చుట్టు అమెరికా యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు మోహరించి ఉన్నాయి. ఏ క్షణమైనా అమెరికా దళాలు వెనిజులాలో చొరబడొచ్చని ప్రచారం జరుగుతోంది. ఇటీవలే వెనిజులాలోని మదురో సర్కారు ఇక రోజులు లెక్కపెట్టుకోవాలని ట్రంప్‌ స్వయంగా సోషల్‌ మీడియాలో హెచ్చరించారు. 

వెనెజులా డ్రగ్స్‌ ముఠాల నుంచి తమ దేశాన్ని మాదకద్రవ్యాలు ముంచెత్తుతున్నాయంటూ ట్రంప్‌ ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ ముఠాలతో వెనెజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురోకు సంబంధాలు ఉన్నాయని కూడా ఆయన విమర్శించారు. ఆయనను పట్టించే సమాచారం ఇస్తే ఏకంగా రూ.430 కోట్ల బహుమతి ఇస్తామంటూ కూడా ప్రకటించారు. అమెరికా యుద్ధ దుందుడుకు చర్యలను వెనెజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురో తప్పుబట్టారు. తమపై యుద్ధానికి దిగితే తాము కూడా సైనిక దాడితో సమాధానం ఇస్తామని హెచ్చరించారు.

ట్రంప్‌ గౌరవం దెబ్బతినేలా ఆయన కార్యదర్శి, విదేశాంగ మంత్రి మార్కో రుబియో కరేబియన్‌ యుద్ధంలోకి ఆయనను లాగుతున్నారని ఆరోపించారు. మదురో ఎన్నికను అమెరికా గుర్తించడంలేదని శ్వేతసౌధం ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లెవెట్టి వెల్లడించారు. కేవలం మాదకద్రవ్యాల ముఠాల కోసం యుద్ధం స్థాయిలో అమెరికా ఈ బలగాలను మోహరించింది. మొత్తం ఎనిమిది వార్‌షిప్‌లను అక్కడకు పంపింది.

ది ఇవో జిమా యాంఫిబియస్‌ రెడీగ్రూప్‌లోని యూఎస్‌ఎస్‌ శాన్‌ ఆంటోనియో, యూఎస్‌ఎస్‌ ఇవో జిమా, యూఎస్‌ఎస్‌ ఫోర్ట్‌ లాడర్‌డేల్‌ నౌకలు 4,500 మంది సైనికులతో కరేబియన్‌ సముద్రంలోకి వెళ్లాయి.  కరేబియన్‌ సముద్రంలో అగ్రరాజ్యం భారీగా యుద్ధ నౌకలు, హెలికాప్టర్లు, జలాంతర్గములు, అత్యాధునిక ఫైటర్‌ జెట్‌లను మోహరించింది. ఏక్షణామైనా వెనెజులా దేశంలోకి చొరబడటానికి ఇవి సిద్ధంగా ఉన్నాయి. వీటితోపాటు 4,500 మంది సైనికులు, 2,300 మంది మెరైన్లు కూడా సిద్ధంగా ఉన్నారు.

22వ మెరైన్‌ యూనిట్‌ కమాండోలు 2,200 మంది వీరిలో ఉన్నారు. ఏవీ-8బీ హారియర్‌ అటాక్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌, గైడెడ్‌ మిసైల్‌ డెస్ట్రాయర్లైన యూఎస్‌ఎస్‌ జాన్సన్‌ డున్హమ్‌, యూఎస్‌ఎస్‌ గ్రేవ్లీ దక్షిణ కరేబియన్‌లో మోహరించాయి. తూర్పు పసిఫిక్‌లో యూఎస్‌ఎస్‌ శాంప్సన్‌ త్వరలో వచ్చి చేరనుంది. ఒక్కో డెస్ట్రాయర్‌లో 90 క్షిపణులు ఉంటాయి. గైడెడ్‌ మిసైల్‌ క్రూయిజర్‌ యూఎస్‌ఎస్‌ లేక్‌ ఎరి, మిన్నియాపోలీస్‌ సెయింట్‌ పాల్‌ కూడా వెనుజువెలాపై గురిపెట్టి ఉన్నాయి. 
 
శుక్రవారం రాత్రి 10 ఎఫ్‌-35 ఫైటర్‌ జెట్‌లను ప్యూర్టోరికోలో మోహరించింది. పెద్ద సంఖ్యలో పీ-8 నిఘా విమానాలను రంగంలోకి దించింది. అమెరికా మోహరింపులను మదురో తప్పుపట్టారు. గత 100 ఏళ్లలో తమ దేశం ఎదుర్కొన్న అతిపెద్ద ముప్పుగా దానిని వర్ణించారు. 8 నౌకల్లో 1200 క్షిపణులను తమపై గురిపెట్టారని విమర్శించారు.