ట్రంప్ కొత్త స్వరాన్ని జాగ్రత్తతోనే స్వాగతిస్తున్నా

ట్రంప్ కొత్త స్వరాన్ని జాగ్రత్తతోనే స్వాగతిస్తున్నా
భారత్​, అమెరికా సంబంధాలపై అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సానుకూలంగా చేసిన వ్యాఖ్యలకు ప్రధాని నరేంద్ర మోదీ స్పందించడంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ చాలా వేగంగా స్పందించినప్పటికీ ఇరు దేశాల ప్రభుత్వాలు, రాయబారులు కలిసి కీలకమైన సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ట్రంప్ కొత్త స్వరాన్ని జాగ్రత్తతోనే స్వాగతిస్తున్నానని స్పష్టం చేశారు.

“ప్రధాని మోదీ చాలా త్వరగా స్పందించారు. విదేశాంగ మంత్రి కూడా ఇరుదేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రాధాన్యతను పునరుద్ఘాటించారు. అది ఇంకా కొనసాగుతున్నదనే సందేశం ఇవ్వడం అవసరం. కానీ, ఇరువైపుల ప్రభుత్వాలు, రాయబారులు గణనీయమైన మరమ్మతు పనులు చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా” అని తెలిపారు. 

“ట్రంప్ విధించిన సుంకాలు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపాయి. ఇవన్నీ సులభంగా మర్చిపోలేం. ఆర్థికపరంగా ఇప్పటికే భారత ప్రజలపై వాటి ప్రభావం పడింది. క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న పరిణామాలను అధిగమించాల్సిన అవసరం ఉంది. భారతీయులకు కలిగించిన నష్టం, అవమానం అంత త్వరగా మరచిపోలేం. క్షమించలేరు” అని శశి థరూర్ చెప్పారు.

అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవర్డ్ లుట్నిక్‌ రష్యాతో భారత డీల్​పై చేసిన వ్యాఖ్యలకు కూడా శశి థరూర్ స్పందించారు ‘భారత్ ఎంతో పరిపక్వతతో వ్యవహరించింది. మనం ఎవరితోనూ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయమని అమెరికా పూర్వ ప్రభుత్వాలు మనకే సూచించాయి. గ్లోబల్ చమురు ధరలను స్థిరపరచడం కోసం వారు మమ్మల్ని కోరారు’ అని గుర్తు చేశారు. 

అంతేకాదు, రష్యా చమురు-గ్యాస్‌ను మనకంటే ఎక్కువగా చైనా కొంటుందని చెప్పారు. తుర్కియే కూడా మనకంటే ఎక్కువగా కొనుగోలు చేస్తోందని, ఐరోపా చమురు-గ్యాస్‌ కాకపోయినా, ఇతర రష్యా ఉత్పత్తులను కొనుగోలు చేస్తోందని తెలిపారు. వారు రష్యాకు బిలియన్ల డాలర్లు అందిస్తున్నారని చెప్పారు. ఇటీవల అమెరికాకు భారత్ దూరమైందని, చీకటి చైనా చేతిలోకి పోయిందని అన్న కొద్ది గంటలకే భారత్ తో పాటు ప్రధాని మోదీపై కీలక వాఖ్యలు చేశారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీతో తాను ఎప్పుడూ స్నేహంగానే ఉంటానని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. కానీ ఆయన చేస్తున్న కొన్ని పనులు తనకు నచ్చడం లేదని పేర్కొన్నారు.  అయితే ఈ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందిస్తూ ట్రంప్ వ్యాఖ్యలను అభినందిస్తున్నట్లు ఎక్స్​లో పోస్ట్ చేశారు. భారత్‌, అమెరికా మంచి భవిష్యత్తు, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయని తెలిపారు.

జీఎస్​టీ సంస్కరణలతో అందరికీ మేలు

ఇక జీఎస్​టీ సంస్కరణలను శశి థరూర్ స్వాగతించారు. ఇవి సాధారణ ప్రజలకు ఉపశమనం కలిగిస్తాయని, అందరికీ మంచిగా ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. ఈ సంస్కరణలు మరింత న్యాయమైన వ్యవస్థ అని అభివర్ణించారు.

“మేం కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నో ఏళ్లుగా జీఎస్​టీ శ్లాబ్‌లలో మార్పులు కోరుతున్నాం. మా నాయకులు నాలుగు రేట్లకు బదులుగా కనీసం రెండు లేదా ఒకే రేటు ఉండాలని ఎప్పటినుంచో చెబుతున్నారు. నాలుగు రేట్లు ఉండటం ప్రజలకు గందరగోళం కలిగించింది, ఇబ్బందిగా మారింది. ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు ఇది మరింత న్యాయమైన వ్యవస్థ అయింది. అందరికీ మేలును కలిగిస్తుందని ఆశిస్తున్నాం” అని శశి థరూర్ పేర్కొన్నారు.