పాక్‌లో మ్యాచ్‌ జరుగుతుండగా ఉగ్ర దాడి

పాక్‌లో మ్యాచ్‌ జరుగుతుండగా ఉగ్ర దాడి

ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్థాన్ లోనే ఉగ్రవాదులు దాడులు చేసి ఎన్నో ప్రాణాలను బలికొంటున్నారు. కొన్నేళ్ల క్రితం శ్రీలంక క్రికెట్ జట్టు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఆ దేశంలో పర్యటించే సాహసాన్ని ఏ జట్టు కూడా చాలా సంవత్సరాల వరకూ చేయలేదు. ఈ మధ్యకాలంలో తమ దేశంలో భద్రతను కల్పిస్తామని పాక్ హామీ ఇవ్వడంతో అక్కడ అడపాదడపా క్రికెట్ సిరీస్‌లు, కొన్ని నెలల క్రితం ఛాంపియన్స్  ట్రోఫీ టోర్నమెంట్ జరిగాయి.

అయితే తాజాగా పాకిస్థాన్‌ల మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఉగ్రదాడి జరిగింది. బబౌర్ జిల్లా ఖార్ తహసీల్‌లోని కౌసర్ క్రికెట్ గ్రౌండ్‌‌లో మ్యాచ్ జరుగుతున్న సమయంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారని స్థానిక పోలీసులు వెల్లడించారు. 

ఈ పేలుడులో ఐఇడిని ఉపయోగించారని తెలిపారు. గాయపడిన వారిని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని జిల్లా పోలీసు అధికారి వక్వాస్ రఫీక్వ్ పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా పేలుడుకు బాధ్యత తీసుకోలేదని చెప్పారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భద్రతా దళాలు ప్రారంభించిన ‘ఆపరేషన్ సర్బకాఫ్’కు ప్రతిస్పందనగా ఈ దాడి జరిగినట్లు అనుమానిస్తున్నారు.

పేలుడు కారణంగా క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లు, మైదానంలో ఉన్న ప్రేక్షకులు భయంతో పరుగులు తీయడంతో స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంది. కాగా, వచ్చే నెలలో పాకిస్థాన్‌లో సౌతాఫ్రికా పర్యటించనుంది. ఈ టూర్‌కి ముందు పాక్‌లో ఇలాంటి ఉగ్రదాడులు జరగడం పాకిస్థాన్ క్రికెట్ బోర్డును ఆందోళనకు గురి చేస్తుంది. రాబోయే రోజుల్లో ఇటువంటి ఘటనలు జరిగితే సౌతాఫ్రికా బోర్డు తమ పర్యటన నిర్ణయాన్ని రద్దు చేసుకొనే అవకాశం ఉందని భావిస్తున్నారు.