మహారాష్ట్రలోని సముద్రతీరానికి మూడు అనుమానాస్పద కంటైనర్లు కొట్టుకు రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. పాల్ఘర్ జిల్లాలోని సత్పతి, షిర్గావ్ బీచ్‌లకు మూడు అనుమానాస్పద కంటైనర్లు కొట్టుకొచ్చాయి. దీంతో భద్రతా, విపత్తు నిర్వహణ సంస్థలను పోలీసులు అప్రమత్తం చేశారు. ఈ సమాచారం అందుకున్న కోస్ట్‌గార్డ్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని అవి ఎక్కడి నుంచి వచ్చాయి? వాటిలో ఏమున్నాయి? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సముద్ర తీర గ్రామాలను మత్య్సకారులను అధికారులు అప్రమత్తం చేశారు. బీచ్‌ల వెంబడి ముమ్మరంగా పెట్రోలింగ్ చేపడుతున్నట్లు వెల్లడించారు. సముద్రంలో అధిక ఆటుపోట్లు ఉండడం వల్ల ప్రస్తుతం కంటైనర్లను తెరవడం కష్టతరంగా ఉంది. ఓ కంటైనర్ మాత్రం పాక్షికంగా మునిగిపోయిందని అధికారులు తెలిపారు. పోలీసులు, సముద్ర నిఘా అధికారులు, కోస్ట్ గార్డ్‌లు సమన్వయంతో పని చేస్తూ కంటైనర్లకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి షిప్పింగ్ లాగ్‌లు, తీరప్రాంత నిఘా డేటా ద్వారా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఆగస్టులో ఒమన్ నుంచి వెళుతున్న ఓ కార్గో షిప్ నుంచి దాదాపు 48 కంటెయినర్లు సముద్రంలో జారిపడ్డాయి. ఆ కంటెయినర్లు అరేబియా సముద్రం గుండా ఆటుపోట్ల కారణంగా మహారాష్ట్రలోని సముద్రపు ఒడ్డుకు కొట్టుకువచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే ఇంకా ఆ కంటెయినర్లు గురించి దర్యాప్తు జరుగుతోంది. ఈ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
సముద్ర తీరానికి అనుమానాస్పద కంటెయినర్లు కొట్టుకొచ్చిన వేళ తీర ప్రాంత వాసులను, మత్స్యకారులను అధికారులు అప్రమత్తం చేశారు. సముద్ర తీరాల్లో అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే ఎవ్వరూ ముట్టుకోవద్దని హెచ్చరించారు. కంటెయినర్లను లేదా సంబంధిత వస్తువులను ఎవరైనా గుర్తిస్తే భారత నావికాదళానికి, స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని స్థానిక మత్స్యకారులు, తీర ప్రాంతాల్లోని గ్రామస్థులు, గస్తీ బృందాలకు అధికారులు సూచించారు.
More Stories
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్
ఆధార్ ను ఐడీ ప్రూఫ్ గా ఆమోదించాల్సిందే
జమ్మూ కశ్మీర్ లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి