రేవంత్ రెడ్డితో ఫిరాయించిన ఎమ్మెల్యేల భేటీ 

రేవంత్ రెడ్డితో ఫిరాయించిన ఎమ్మెల్యేల భేటీ 
 

బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు స్పీకర్‌కు సూచించడం, మరోవైపు స్పీకర్ నుంచి నోటీసులు రావడంతో ఏమి చేద్దామన్న అంశంపై చర్చించేందుకు ఫిరాయింపు ఎమ్మెల్యేలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో అత్యవసరంగా సమావేశమయ్యారు. 

బీఆర్‌ఎస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరగా, వీరిలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మినహా మిగతా వారంతా సీఎంతో భేటీ అయ్యారు.  పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి భరోసా ఇచ్చినట్లు తెలిసింది. అయితే ముఖ్యమంత్రితో సమావేశం ముగిసిన అనంతరం వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తాము పార్టీ ఫిరాయించలేదని, బిఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నామని చెప్పారు. 

నియోజకవర్గాల్లోని సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి వీటిని త్వరితగతిన పరిష్కరించాలని కోరామని వారు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు పార్టీ అధినాయకత్వం అనుమతి పొందారా? అని ప్రశ్నించగా, ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రిని కలిసేందుకు కూడా అనుమతి తీసుకోవాలా? అని వారు ఎదురు ప్రశ్నించారు.  ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు స్పీకర్ ఇచ్చిన నోటీసులకు వివరణ కూడా ఇచ్చారు. మిగతా వారు సీఎం తో చర్చించాక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది.

కాగా తాము పార్టీ ఫిరాయించలేదని, ఒక ఎమ్మెల్యేగా సీఎంను మర్యాద పూర్వకంగా కలిసినప్పుడు శాలువా కప్పారే తప్ప కాంగ్రెస్ కండువా కప్పుకోలేదన్నద్నది వీరి వాదన.  ఇదే కోణంలో స్పీకర్‌కు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన ఎమ్మెల్యేల మాదిరిగా మిగతా వారు కూడా సమాధానం ఇవ్వాలని ఈ సందర్భంగా నిర్ణయించినట్లు సమాచారం. 

ప్రస్తుత బిఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు కెఆర్ సురేష్ రెడ్డి లోగడ అంటే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో స్పీకర్‌గా ఉన్నప్పుడు ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్లపై సుదీర్ఘంగా విచారణ కొనసాగించి, ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేందుకు ఒక రోజు ముందు ముగ్గురు ఎమ్మెల్యేలపై మాత్రమే అనర్హత వేటు వేసి, మిగతా ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించలేదని తేల్చడం గురించి కూడా ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన సమావేశంలో చర్చించినట్లు సమాచారం.

వివిధ సమావేశాలకు వెళ్ళినప్పుడు వేర్వేరు పార్టీల కార్యకర్తలు ఉత్సాహంగా కండువా కప్పుతుంటారని, గుళ్ళు గోపురాలకు వెళ్ళినప్పుడు కూడా గౌరవపూర్వకంగా కండవా కప్పుతుంటారన్న అంశాన్నీ స్పీకర్‌కు సమర్పించే సమాధానంలో పేర్కొనాలని నిర్ణయించినట్లు తెలిసింది.  ఇంకా ఈ విషయమై న్యాయ నిపుణులతో సలహా తీసుకోవాలని ముఖ్యమంత్రి వారికి సూచించినట్లు తెలిసింది.

అయితే తమ పార్టీ ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్‌లో చేరినందున రాజ్యాంగంలోని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని బిఆర్‌ఎస్ నేతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.  ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి పూర్తి ఆధారాలతో స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తే కనీసం వారికి నోటీసులు కూడా ఇవ్వలేదని బిఆర్‌ఎస్ తరఫు న్యాయవాది కోర్టులో వాదన వినిపించారు. అనర్హత పిటిషన్లపై వాదనలు విన్న సుప్రీం కోర్టు ఈ వ్యవహారంపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు సూచించింది.

పది మంది ఎమ్మెల్యేలు ఒకేసారి కాకుండా వేర్వేరుగా కాంగ్రెస్‌లో చేరారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కార్యాలయం నుంచి వచ్చిన నోటీసులకు ఈ నెల 2వ తేదీలోగా సమాధానం ఇవ్వాల్సి ఉండగా, తమకు ఈ గడువు సరిపోదని, మరో 10 రోజుల గడువు కావాలని ఎమ్మెల్యేలు కోరారు. స్పీకర్ నుంచి వచ్చిన నోటీసులకు సమాధానాలు వేర్వేరు తేదీల్లో అందజేయాలని భావించారు. 

స్పీకర్ వద్ద విచారణ ప్రారంభమైన తర్వాత ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది గడువు కోరాలని, ఇలా పది మంది ఎమ్మెల్యేల తరఫున విచారణ వేర్వేరు నెలల్లో ప్రారంభం కావడంతో, అంత తొందరగా తుది నిర్ణయం తీసుకోకుండా జాప్యం జరిగేందుకు అవకాశం ఉంటుందన్న ఆలోచన చేశారు.