రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ..  సీబీఐ కేసు

రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ..  సీబీఐ కేసు
దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితురాలు అయిన వీకే శశికళపై కొత్త ఆరోపణలు వెలువడ్డాయి. పెద్ద నోట్ల రద్దు సమయంలో రూ.450 కోట్లు వెచ్చించి చక్కెర కర్మాగారం కొనుగోలు చేసినట్లు సీబీఐ తాజాగా కేసు నమోదు చేసింది. 2016లో పెద్ద నోట్ల రద్దు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఆ సమయంలో రద్దయిన కరెన్సీతో శశికళ బినామీల ద్వారా రూ.450 కోట్లను పెట్టుబడిగా పెట్టారని సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.

ఈ మొత్తంతో కాంచీపురంలో ఒక చక్కెర ఫ్యాక్టరీని కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంచీపురంలోని ఆ చక్కెర కర్మాగారం భారీ రుణాలు తీసుకున్నప్పటికీ చెల్లింపులు జరపలేదని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించింది. దాంతో గత సంవత్సరం జూలైలో సీబీఐ అధికారులు పలు చోట్ల సోదాలు నిర్వహించి ఆధారాలు సేకరించారు.

ముందుగా ఐటీ శాఖ స్వాధీనం చేసుకున్న పత్రాలను సీబీఐ తిరిగి పరిశీలించింది. అందులో కర్మాగారం కొనుగోలు వ్యవహారం శశికళతో సంబంధముందని తేలినట్లు సమాచారం. ఫ్యాక్టరీ యాజమాన్యంలో ఉన్న విదేశ్ శివగన్ పఠేల్ ఇచ్చిన వాంగ్మూలం ఈ కేసులో ముఖ్య ఆధారంగా మారింది. శివగన్ పఠేల్ వాంగ్మూలంలో కీలక వివరాలు బయటపడ్డాయి. కర్మాగారం కొనుగోలు కోసం రూ. 450 కోట్ల విలువైన పాత నోట్లను వినియోగించారని ఆయన వెల్లడించినట్లు తెలుస్తోంది. 

ఈ సమాచారం సీబీఐ దర్యాప్తులో బలమైన ఆధారంగా నిలిచింది. ఆ కర్మాగారం శశికళ బినామీ ఆస్తిగా ఐటీ శాఖ అప్పటికే గుర్తించిందని సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.  గతంలోనూ బినామీ ఆస్తులపై శశికళ వివాదాల్లో చిక్కుకున్నారు. తాజా కేసుతో ఆమెపై మరోసారి చట్టపరమైన ఒత్తిడి పెరిగింది. వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా శశికళతో పాటు ఆమె మద్దతుదారులను తిరిగి పార్టీలోకి తీసుకోవాలని అన్నాడీఎంకేలో అంతర్గతంగా వత్తిడి పెరుగుతున్న సమయంలో ఈ ఆరోపణలు రాజకీయంగా ఆమెకు ప్రతిబంధకంగా మారే అవకాశం ఉంది.

ఇప్పటికే శశికళ రాజకీయంగా పునరాగమనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, కొత్త కేసు ఆమె భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశముంది. రూ.450 కోట్ల కరెన్సీ లావాదేవీ కేసుతో శశికళ మరోసారి కష్టాల్లో చిక్కుకున్నారు. సీబీఐ దర్యాప్తు ఎలా సాగుతుందో, ఆమెకు ఇది ఎంత వరకు ఇబ్బందులు కలిగిస్తుందో చూడాలి.

ఎఐఎడిఎంకె ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి మాజీ మంత్రి, పార్టీ ఎమ్మెల్యే కెఎ సెంగొట్టయన్‌ను పార్టీ సంస్థాగత కార్యదర్శి,  ఈరోడ్ గ్రామీణ పశ్చిమ జిల్లా కార్యదర్శి పదవుల నుండి శనివారం తొలగించడం గమనార్హం. శశికళ వంటి బహిష్కరించబడిన నాయకులలో పది రోజుల్లోపు ఏకీకరణ తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని పళనిస్వామికి అల్టిమేటం విధించిన తర్వాత ఈ చర్య తీసుకున్నారు.

 
“పది రోజుల్లో ఎఐఎడిఎంకెలో ఐక్యతను తీసుకురావడానికి చర్యలు తీసుకోవడంలో పళనివామి విఫలమైతే, మేము సారూప్యత కలిగిన వారందరినీ ఏకం చేసి పార్టీ బలోపేతం అయ్యేలా చూస్తాము” అని మాజీ మంత్రి హెచ్చరించారు. 1977 నుండి ఎమ్యెల్యేగా ఉంటున్న  సెంగొట్టయన్‌  తమిళనాడులో సుదీర్ఘకాలంగా అసెంబ్లీకి ఎన్నికవుతున్న నాయకుడిగా పేరొందారు.