
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఔట్‌సోర్సింగ్‌పై కఠిన విధానాలు అమలు చేసే అవకాశం ఉందన్న భయాలతో, భారత ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. దేశీయంగా సుమారు 300 బిలియన్ డాలర్ల విలువైన ఐటి పరిశ్రమను, దానిపై ఆధారపడిన లక్షలాది ఉద్యోగాలను రక్షించేందుకు సమగ్ర వ్యూహాన్ని అమలు చేస్తున్నామని కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
ఐటీ రంగంలోని ఉద్యోగుల భవిష్యత్తుకు ఎటువంటి ప్రమాదం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. అమెరికాలో ట్రంప్ మద్దతుదారులు “మేక్ అమెరికా గ్రేట్ అగేన్” నినాదంతో ఔట్‌సోర్సింగ్‌కు వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. తాజాగా, ట్రంప్ మాజీ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో చేసిన వ్యాఖ్యలు ఆందోళనలకు మరింత ఊతమిచ్చాయి. ఆయన ప్రకారం, విదేశీ రిమోట్ వర్కర్లపై కూడా వస్తువుల మాదిరిగా పన్నులు విధించాలని సూచించారు.
ఇది అమల్లోకి వస్తే, భారత ఐటీ రంగం ఎగుమతులపై నేరుగా ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, “భారత్‌లో పనిచేస్తున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జిసిసిలు), బహుళజాతి సంస్థలతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నాం. అలాగే అమెరికా, యూరప్, జపాన్, ఆగ్నేయాసియా దేశాల ప్రభుత్వాలతో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఐటీ సేవలతో పాటు, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాన్ని బలోపేతం చేస్తున్నాం” అని తెలిపారు.
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ తయారీలో భారత్ వాటా గణనీయంగా పెరిగిందని, ఎలక్ట్రానిక్స్ పరికరాల స్థానిక ఉత్పత్తి గొలుసుని వేగంగా విస్తరిస్తున్నామని మంత్రి వివరించారు. దేశంలో ఉన్న ఐటీ ఉద్యోగాలను రక్షించడమే కాకుండా, తయారీ రంగంలో కొత్త అవకాశాలను కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. నాస్కామ్ నివేదిక ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరంలో భారత టెక్నాలజీ రంగం 5.1% వృద్ధితో 282.6 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించనుంది. 2026 నాటికి ఈ పరిశ్రమ 300 బిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమిస్తుందని అంచనా. అదనంగా, 1,26,000 కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయని నివేదిక పేర్కొంది.
More Stories
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి
రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ.. సీబీఐ కేసు
భారతీయ వస్తువులపై ట్రంప్ సుంకాలు స్వల్పకాలికమే