నోట్లో యాసిడ్ పోస్తా.. బీజేపీ ఎమ్మెల్యేకు టీఎంసీ నేత బెదిరింపు

నోట్లో యాసిడ్ పోస్తా.. బీజేపీ ఎమ్మెల్యేకు టీఎంసీ నేత బెదిరింపు
పశ్చిమబెంగాల్‌ లో ఓ బీజేపీ ఎమ్మెల్యేపై తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత అబ్దుర్ రహీం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఓ కార్యక్రమంలో మాల్దా జిల్లా టీఎంసీ అధ్యక్షుడు అబ్దుర్ రహీం బక్షి మాట్లాడుతూ బీజేపీ ఎమ్మెల్యే శంకర్ ఘోష్‌ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఆయన నోట్లో యాసిడ్‌ పోసి బూడిద చేస్తానంటూ హెచ్చరించారు. సరిహద్దు రాష్ట్రాల్లో బెంగాలీ వలస కార్మికులపై జరుగుతున్న “అత్యాచారాలను” నిరసిస్తూ శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఒక బహిరంగ సభలో బక్షీ ఈ వ్యాఖ్యలు చేశారు.
తన ప్రసంగంలో ఆయన బీజేపీ శాసనసభ్యుడు శంకర్ ఘోష్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. గతంలో శంకర్ ఘోష్ అసెంబ్లీలో మాట్లాడుతూ బెంగాల్ నుంచి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన 30 లక్షల మంది కార్మికులను రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు అని తెలిపారు. వాటిని గుర్తు చేస్తూ బక్షీ తీవ్ర విమర్శలు గుప్పించారు.  బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ వాసులను వేధిస్తున్నారని, నిర్బంధ శిబిరాల్లో ఉంచుతున్నారని ఆరోపించారు. బెంగాల్‌ ప్రజలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటున్న బీజేపీని రాష్ట్రం నుంచి బహిష్కరించాలని ప్రజలను కోరారు. 
అబ్దుర్ రహీం వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. అధికార టీఎంసీ రాష్ట్రంలో హింస, బెదిరింపు సంస్కృతులను పెంచుతోందని ఆరోపించింది. మాల్దా ఉత్తర్ బీజేపీ ఎంపీ ఖగెన్ ముర్ము మాట్లాడుతూ.. ఇలాంటి వ్యాఖ్యలు టీఎంసీలో ఉన్న బెదిరింపు, హింస సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామనే భయం కారణంగానే అధికార పార్టీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని విమర్శించారు.

 
“ఇది తృణమూల్ కాంగ్రెస్ సంస్కృతి. ప్రజలను భయపెట్టడం వారి పని. మాల్డాలో ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు నిరంతరం జరుగుతున్నాయి. టీఎంసీ జిల్లా అధ్యక్షుడు తరచుగా వార్తల్లో ఉండటానికి ఇలాంటివి చెబుతుంటాడు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ ఓడిపోతుందనే భయం వారిని వెంటాడుతోంది” అని ముర్ము ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధపు పోలీసు కేసులు పెట్టిస్తున్నారంటూ ఆరోపిస్తూ బీజేపీ కార్యకర్తలతో కలిసి ఆయన మాల్డాలో నిరసనలకు కూడా దిగారు.

బంగ్లాదేశ్‌ నుంచి చొరబాట్లను నిరోధించడంలో విఫలమైనందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా శిరస్సు ఖండించి బల్లపై ఉంచాలంటూ టీఎంసీ ఎంపీ మహువా చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఇటీవల దుమారం రేపిన విషయం తెలిసిందే. వివాదాల జోలికి పోవద్దని బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సూచించినప్పటికీ వరుసగా టీఎంసీ నేతలు తమ వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం.