
దేశంలో ప్రతి ఓటరు వివరాలు ఖచ్చితంగా ఉండేలా చూసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) పెద్దయెత్తున ప్రణాళికను రూపొందించింది. బీహార్‌లో చేపట్టిన విధంగా ఇప్పుడు ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఈసీ నిర్ణయించింది. ఈ కార్యక్రమం కింద, ఎన్నికల శాఖ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల డేటాను పరిశీలించనున్నారు.
వారి వివరాల్లో లోపాలుంటే సరిచేసి, కొత్తగా అర్హులైన వారిని జాబితాలో చేర్చడం, అర్హతలేనివారిని తొలగించడం జరుగుతుంది. తద్వారా జాబితా సత్యనిష్ఠతో ఉండేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నెల 10న, దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులతో (సీఈఓలు) ఈసీ ఒక ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది. ఇది ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేశ్ కుమార్ చేపట్టిన మూడో పెద్ద సమావేశం కానుంది.
2026లో తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఈసీ ఓటర్ల జాబితాను 100% ఖచ్చితంగా, పారదర్శకంగా తయారు చేయాలని భావిస్తోంది. ఈ ఏడాది చివరినాటికి దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియను ప్రారంభించే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవల బీహార్‌లో జరిగిన ఎస్‌ఐఆర్‌లో వివాదాలు, విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో, ఈసారి దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియను పకడ్బందీగా, నిష్పాక్షికంగా చేపట్టేందుకు ఈసీ నూతన మార్గదర్శకాలు సిద్ధం చేస్తోంది.
బంగ్లాదేశ్, మయన్మార్ వంటి దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చిన వారు ఓటర్ల జాబితాలో చేరకూడదనే ఉద్దేశంతో ఈ ప్రక్షాళన చేపట్టనున్నారు. అక్రమ ఓటర్లు, బోగస్ ఓట్లు లాంటి సమస్యలపై పూర్తిగా నియంత్రణ తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని ఈసీ చెబుతోంది. ఈ భారీ కసరత్తు విజయవంతంగా పూర్తవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాల సహకారం చాలా ముఖ్యం అని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈసీ చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు దోహదపడేలా ఉండనున్నాయి.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్