జపాన్‌ ప్రధాని షిగేరు ఇషిబా రాజీనామా

జపాన్‌ ప్రధాని షిగేరు ఇషిబా రాజీనామా

జపాన్‌ ప్రధాని పదవికి షిగేరు ఇషిబా రాజీనామా చేశారు. పార్లమెంటరీ ఎన్నికల తర్వాత పార్టీలో వచ్చిన అంతర్గత విభేదాలకు స్వస్తి పలకాలనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆదివారం జపాన్ టీవీ ఎన్‌హెచ్‌కే వెల్లడించింది.  జపాన్‌ ప్రధానమంత్రి షిగేరు ఇషిబా నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం పార్లమెంటు ఎగువసభలో మెజారిటీ కోల్పోయింది. సభలో 248 స్థానాలుండగా, వాటిలో సగం సీట్లకు జులైలో ఎన్నికలు జరిగాయి.

అధికార లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ (ఎల్‌డీపీ) సభలో మెజారిటీ సాధించాలంటే 50 స్థానాలు దక్కించుకోవాలి. కానీ 47 స్థానాలకే పరిమితమైంది.  గత అక్టోబరులో జరిగిన దిగువసభ ఎన్నికల్లోనూ ఈ కూటమి ఓటమి పాలైంది. 1955లో స్థాపించిన ఎల్‌డీపీ రెండు సభల్లో మెజారిటీని కోల్పోవడం ఇదే తొలిసారి. ప్రతికూలంగా ఫలితాలొచ్చినా తాను పదవిలో కొనసాగుతానని ఇంతకు ముందు ఇషిబా తెలిపారు. 

కానీ ఈ ఓటమితో రాజీనామా చేయాలని లేదా కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాలని అధికార కూటమిలోని ఇతర రాజకీయ పార్టీల నుంచి ఇషిబాపై ఒత్తిడి పెరిగింది. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. గత ఏడాది సెప్టెంబర్​లో జపాన్ మాజీ ప్రధానమంత్రి ఫుమియో కిషిద వారసుడిగా షిగెరు ఇషిబా ఎన్నికయ్యారు.  అధికార లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ (ఎల్‌డీపీ) అధ్యక్ష ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. పార్టీ అధినాయకత్వ పదవికి 9 మంది పోటీపడ్డారు. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.

ఎల్‌డీపీ పార్లమెంట్‌ సభ్యులతో పాటు దాదాపు 10లక్షల మంది పార్టీ సభ్యులు ఈ ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఫలితంగా ఇషిబా విజయం సాధించారు.  దీంతో 2024 అక్టోబరు 1న ఇషిబా దేశ 102వ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. షిగేరు ఇషిబా మొదట బ్యాంకింగ్‌ రంగంలో పనిచేశారు. తన 29 ఏళ్ల వయసులో అనగా 1986లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. అప్పట్లో ప్రభుత్వ విధానాలను బహిరంగంగా వ్యతిరేకిస్తూ తరచూ వార్తల్లో నిలిచేవారు.

ఈ క్రమంలో కిషిద ప్రభుత్వంలో ఆయనను పక్కనబెట్టారు.  గత ఎల్‌డీపీ ప్రభుత్వంలో రక్షణశాఖ మంత్రిగా పనిచేశారు. పార్టీ అధ్యక్ష పదవికి ఆయన ఐదు సార్లు పోటీపడ్డారు. ఇక అంతకుముందు ఉన్న ప్రధాని కిషిద పార్టీ కార్యక్రమాలకు టికెట్లు విక్రయించి రాజకీయ నిధులను సేకరించి కుంభకోణానికి పాల్పడ్డారని విమర్శలు వచ్చాయి. ఇందులో 80కుపైగా ఎల్‌డీపీ చట్టసభ సభ్యుల భాగస్వామ్యం ఉందంటూ గతంలో ఆరోపణలు వచ్చాయి. 

ఈ పరిణామాలతో పార్టీలో, ప్రజల్లో ఆయన మద్దతు పడిపోతూ వస్తోంది. దీంతో కిషిద తన కేబినెట్‌లో పలువురు మంత్రులను, పార్టీ కార్యనిర్వాహక సభ్యులను పదవుల్లోంచి తొలగించారు. ఆపై రాజకీయ నిధుల నియంత్రణ చట్టాన్ని కఠినతరం చేస్తూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. అయినా కిషిదకు ప్రజాదరణ తగ్గిపోవడంతో గతేడాది ప్రారంభంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలైంది. అలాగే పార్లమెంట్​ ఎన్నికల్లోనూ ఈ పార్టీ ఓడిపోయింది.