చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలో రూ 12,000 కోట్ల విలువైన డ్రగ్స్

చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలో రూ 12,000 కోట్ల విలువైన డ్రగ్స్
డ్రగ్స్ లేని నగరంగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నది. అయినా పోలీసుల కళ్లుగప్పి, డ్రగ్స్ సరఫరాను కొనసాగిస్తున్న ముఠాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ శివార్లలోని చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతం కేంద్రంగా నడుస్తున్న అతిపెద్ద డ్రగ్స్ రాకెట్ ను ముంబై పోలీసులు ఛేదించారు. ఈ ఫ్యాక్ట‌రీ నుంచి ఇప్ప‌టికే కొన్ని వేల కోట్ల డ్ర‌గ్స్ బిజినెస్ జ‌రిగిన‌ట్లు తెలుస్తుంది. 
 
ఓ రసాయన ఫ్యాక్టరీ ముసుగులో మాదకద్రవ్యాలు తయారు చేస్తున్న ఈ ముఠా గుట్టును రట్టుచేసి, సుమారు రూ 12,000 కోట్ల విలువైన ఎండీ (మెథెడ్రోన్) డ్రగ్సను, ముడి రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు.  గ‌త నెల‌లో మ‌హారాష్ట్ర పోలీసులకు ఓ విదేశీయుడు డ్ర‌గ్స్‌తో ప‌ట్టుబ‌డ్డాడు. అత‌ని నుంచి రూ. 25 ల‌క్ష‌ల విలువైన డ్ర‌గ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.  విదేశీయుడు ఇచ్చిన స‌మాచారంతో మ‌హారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు. 
ప‌క్కా స‌మాచారంతో శనివారం మేడ్చ‌ల్‌లో దాడులు చేసి, భారీగా డ్ర‌గ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.  మహారాష్ట్రకు చెందిన మీరా-భయందర్, వసాయి-విరార్ (ఎంబివివి) పోలీసులు కొన్నాళ్లుగా ఓ డ్రగ్స్ ముఠాపై నిఘా పెట్టారు. ముఠా మూలాలు హైదరాబాద్ లోని చర్లపల్లిలో ఉన్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక ఫ్యాక్టరీపై మెరుపుదాడి చేశారు. ‘వాఘేవి ల్యాబ్స్’ అనే నకిలీ లైసెన్స్ నడుస్తున్న ఈ ఫ్యాక్టరీలో అత్యాధునిక పరికరాలతో భారీ ఎత్తున డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు.

ఈ దాడిలో ఫ్యాక్టరీ యజమాని, రసాయన నిపుణుడైన శ్రీనివాస్ తోపాటు అతని సహచరుడు తానాజీ పాఠే, ఓ విదేశీయుడు సహా మొత్తం 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ప్రాథమికంగా 100 గ్రాముల ఎండీ డ్రగ్స్, రూ.25 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. 

ఫ్యాక్టరీలో జరిపిన సోదాలలో డ్రగ్స్ తయారీకి వినియోగించే సుమారు 32,000 లీటర్ల రసాయనాలతో పాటు,  భారీ ఉత్పత్తి యూనిట్లను కూడా సీజ్ చేశారు. ఈ ఫ్యాక్ట‌రీలో త‌యారైన డ్ర‌గ్స్ వివిధ ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్న‌ట్లు తేలింది. దేశంతో పాటు విదేశాల‌కు కూడా ఎండీ డ్ర‌గ్స్‌ను స‌ర‌ఫ‌రా చేసిన‌ట్లు గుర్తించారు. ఎక్స్‌టాసీ, మోలీ, ఎక్స్‌టీసీ పేర్ల‌తో డ్ర‌గ్స్‌ను నిందితులు స‌ర‌ఫ‌రా చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇంత పెద్ద నెట్వర్క్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుండటం తీవ్ర కలకలం రేపుతోంది.