ఎర్రకోటలో వజ్రాల కలశం అపహరణ

ఎర్రకోటలో వజ్రాల కలశం అపహరణ

దేశ రాజధాని ఢిల్లీలో భారీ చోరీ జరిగింది. అత్యంత పటిష్ఠమైన భద్రత ఉండే చారిత్రక ఎర్రకోట ప్రాంగణంలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. జైన మతపరమైన ఆచారంలో భాగంగా ప్రదర్శనకు ఉంచిన దాదాపు కోటి రూపాయల విలువైన వజ్రాలు పొదిగిన కలశాన్ని దొంగలు అపహరించుకుపోయారు.

ఎర్రకోటలో ప్రస్తుతం జైనుల ‘దశలక్షణ మహాపర్వం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో 760 గ్రాముల బంగారం, వజ్రాలు, పచ్చలు పొదిగిన ఆభరణాల కలశాన్ని ఉపయోగించారు. అయితే, ఈ కార్యక్రమాలకు లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా హాజరయ్యారు. నిర్వాహకులు ఓం బిర్లాకు స్వాగతం పలకడంలో బిజీగా ఉన్న సమయంలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు.

అక్కడ వేదికపై ఉంచిన దాదాపు రూ.కోటి విలువైన కలశాన్ని అపహరించుకుపోయారు. కార్యక్రమం తిరిగి ప్రారంభమయ్యాక కలశం కనిపించకపోవడంతో నిర్వాహకులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  కట్టుదిట్టమైన భద్రత ఉండే రెడ్‌ఫోర్ట్‌ ప్రాంతంలో భారీ చోరీ వ్యవహారం రాజధానిలో కలకలం రేపుతోంది. ఓ దొంగ ఆ బంగారు ఆభరణాల గురించి తెలుసుకుని చోరీకి సిద్ధపడ్డాడు. ఇందుకోసం బుధవారం జైన సన్యాసిలా దుస్తులు వేసుకుని పూజలు జరిగే స్టేజి దగ్గరకు వచ్చాడు.

నిర్వాహకులందరూ కార్యక్రమానికి వచ్చే అతిధుల కోసం ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇదే అదునుగా భావించిన దొంగ తన పని మొదలుపెట్టాడు. పవిత్రమైన బంగారు వస్తువులు పెట్టిన స్టేజి దగ్గరకు వెళ్లాడు. బంగారు వస్తువుల్ని సంచిలో వేసుకుని మెల్లగా అక్కడినుంచి జారుకున్నాడు.  నిర్వాహకులు కొద్దిసేపటి తర్వాత పూజా కార్యక్రమాలు మొదలుపెట్టడానికి స్టేజి దగ్గరకు వచ్చారు. అక్కడ బంగారు వస్తువులు కనిపించలేదు. దీంతో వారు షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సీసీటీవీ కెమెరాల ఆధారంగా దొంగను గుర్తించారు. అతడి కోసం గాలింపు చర్యలు మొదలెట్టారు. ఆ బంగారు వస్తువుల యజమాని సుధీర్ జైన్ మీడియాతో మాట్లాడుతూ ‘వస్తువులు అందంగా కనిపించాలని వాటిపై విలువైన రాళ్లు పొదిగించాము. కానీ, కలశాలు మాత్రం మా సెంటిమెంట్లకు సంబంధించినవి. ఆ వస్తువులకు విలువ కట్టలేము. దొంగను పోలీసులు గుర్తించారు. వీలైనంత త్వరగా అతడ్ని పట్టుకుంటారు’ అని తెలిపారు.