ప్రధాని మోదీ అమెరికా పర్యటన రద్దు

ప్రధాని మోదీ అమెరికా పర్యటన రద్దు

* వరద ప్రభావిత రాష్ట్రాల్లో పర్యటించనున్న ప్రధాని మోదీ

అమెరికా విధిస్తున్న శునకాల విషయమై భారత్ – అమెరికాల మధ్య వివాదాలు చెలరేగుతున్న సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెలలో జరగాల్సిన తన అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. న్యూయార్క్‌లో సెప్టెంబర్ 23 నుంచి 29 వరకు జరగనున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఆయన ప్రసంగించాల్సి ఉంది.  ప్రారంభంలో విడుదలైన షెడ్యూల్ ప్రకారం, మోదీ సెప్టెంబర్ 26న ప్రసంగించాల్సి ఉంది. అయితే, తాజాగా సవరించిన షెడ్యూల్‌లో ప్రధాని పేరు తొలగించారు.
ప్రధాని మోదీ స్థానంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించనున్నారు. జైశంకర్ సెప్టెంబర్ 27న భారతదేశం తరపున తన ప్రసంగాన్ని అందిస్తారు.  సాధారణంగా, ఒక దేశాధినేత లేదా ప్రభుత్వ అధినేత ఈ ఉన్నత స్థాయి సమావేశాలలో పాల్గొనడం ఒక గౌరవంగా పరిగణిస్తారు. అయితే, ప్రధాని మోదీ పర్యటన రద్దుకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. మోదీ పర్యటన రద్దుకు గల కారణాలపై అధికారిక ప్రకటన వెలువడలేదు. 
 
దేశీయ రాజకీయ పరిణామాలు లేదా ఇతర ముఖ్యమైన అంతర్జాతీయ కార్యక్రమాలు దీనికి కారణం కావచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. 
ఏదేమైనా, ఈ రద్దు అంతర్జాతీయ సమాజంలో కొంత చర్చకు దారితీసే అవకాశం ఉంది. విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ సమావేశంలో భారతదేశం వైఖరిని, అంతర్జాతీయ సమస్యలపై మన దృక్పథాన్ని ప్రపంచానికి తెలియజేస్తారు.
 
కాగా, వరద ప్రభావిత రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. తద్వారా క్షేత్రస్థాయి పరిస్థితులతోపాటు బాధితులకు అందుతున్న సహాయక చర్యలను గురించి తెలుసుకోనున్నారు. అయితే ప్రధాని మోదీ షెడ్యూల్‌ ఖరారైనప్పటికీ అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. ఏయే రాష్ట్రాల్లో పర్యటిస్తారనే దానిపై స్పష్టత రావాల్సి ఉన్నది.
ఉత్తరభారతంలోని జమ్ముకశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లో వర్షాలకు భారీగా కురుస్తున్నాయి.
దీంతో ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. వర్షాకాలం ప్రారంభమైన జూన్‌ నుంచి ఇప్పటివరకు ఈ నాలుగు రాష్ట్రాల్లో 500 మందికిపైగా మరణించారు. ఒక్క హిమాచల్‌ ప్రదేశ్‌లోనే జూన్‌ 20 నుంచి ఇప్పటివరకు 95 ఆకస్మక వరదలు, 45 మేఘ విస్పోటనాలు, 132 భారీ కొండచరియలు విరిగిపడిన ఘటనలు నమోదయ్యాయి. దీంతో సుమారు 355 మంది మరణించగా, 49 మంది ఆచూకీ లేకుండా పోయారు.

ఉత్తరఖండ్‌లో ఏప్రిల్‌ 1 నుంచి ఆగస్టు 31 వరకు భారీ వర్షాలకు 79 మంది మరణించగా, 90 మంది గల్లంతయ్యారు. మరో 115 మంది గాయపడ్డారు. అదేవిధంగా పంజాబ్‌లో గతంలో ఎన్నడూ చూడనివిధంగా ప్రకృతి కన్నెర్ర చేసింది. కుంభవృష్టి కురవడంతో 23 జిల్లాల్లోని 1900పైగా గ్రామాలు నీటమునిగాయి. ఇప్పటివరకు 43 మంది మరణించగా, 1.71 లక్షల హెక్టార్లలో పంట కొట్టుకుపోయింది.