
గణేశ్ శోభాయాత్రకు గ్రేటర్ హైదరాబాద్ సర్వం సిద్ధమైంది. నవరాత్రులు మండపాలలో విశిష్ట పూజలు అందుకున్న గణనాథులను గంగమ్మ ఒడికి తరలించేందుకు భక్తులు సిద్ధమయ్యారు. కాలనీలు, వీధులు లంబోదరుడి నామస్మరణతో మార్మోగుతున్నాయి. హైదరాబాద్‌లో ఖైరతాబాద్, బాలాపూర్ గణనాథుల శోభయాత్రకు సర్వంసిద్ధమైంది.
దేశంలోనే ఎంతో ప్రతిష్ఠాత్మకంగా సాగే గణనాథుల నిమజ్జన యాత్రకు వేలాదిగా భక్తులు తరలిరానున్నారు. భాగ్యనగరంలో వినాయక మహా నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి.
హుస్సేన్‌సాగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో నిమజ్జనాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, సంజీవయ్య పార్క్ వైపు నిమజ్జనాలకు క్రేన్లు అందుబాటులో ఉన్నాయి.
ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. అంతకు ముందు బడా గణపతికి కమిటీ సభ్యుడు రాజ్‌కుమార్ కలశ పూజ నిర్వహించారు. ఖైరతాబాద్ గణేశుడికి ఉత్సవ కమిటీ భారీ గజమాల వేసింది. సంప్రదాయ మేళతాళాలతో ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ఘనంగా జరుగుతోంది.
టెలిఫోన్ భవన్, సచివాలయం మీదుగా ట్యాంక్ బండ్ వరకు శోభాయాత్ర చేరుకోనుంది. మధ్యాహ్నం 1.30 కల్లా మహా గణపతిని హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయనున్నారు.
సరూర్‌నగర్, ఐడిఎల్, సఫిల్‌గూడ, ఉప్పల్, సున్నంచెరువుతో పాటు పలు ప్రాంతాలలో నిమజ్జనం ఏర్పాట్లు చేశారు. 20 ప్రాంతాల్లో భారీ విగ్రహాలు నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. నిమజ్జనానికి 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు సిద్ధంగా ఉంచారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ 30 వరకు క్రేన్లు ఉన్నాయి.
గ్రేటర్ వ్యాప్తంగా 303 కి.మీ. మేర శోభాయాత్రలు జరుగనున్నాయి. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ 13 కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి 15 వేల మంది సిబ్బందిని రంగంలోకి దింపింది. హైడ్రా, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హుస్సేన్ సాగర్‌లో 9 బోట్లు సిద్ధం చేయగా, 200 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచింది. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనాలకు అన్ని విభాగాలతో కలిపి 40వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు పోలీసుశాఖ తెలిపింది. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ విగ్రహ కమిటీ, ఉత్సవ నిర్వాహకులతో ఇప్పటికే ఆయా స్టేషన్ల పరిధిలోని ఎస్‌హెచ్‌ఓలు సమావేశాలు నిర్వహించారని వెల్లడించింది.
నిమజ్జనోత్సవాలను డీజీజీ ఆఫీస్, కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్టు పోలీసుశాఖ స్పష్టంచేసింది. రాష్ట్రవ్యాప్తంగా అనుసంధానించిన సీసీ కెమెరాలతో ప్రతీక్షణం నిఘా పెడుతామని తెలిపింది. అనుమానాస్పద, సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్లతో ప్రత్యేకంగా నిఘా పెడుతామని పేర్కొంది. హైదరాబాద్ రాజేంద్రనగర్ బండ్లగూడ జాగీర్‌లోని కీర్తి రిచ్మండ్ విల్లాలో జరిగిన గణేశ్ లడ్డూ వేలం రికార్డు ధర పలికింది. శుక్రవారం రాత్రి జరిగిన లడ్డూ వేలంలో కీర్తి రిచ్మండ్ విల్లావాసులు రూ.2,31,95,000 పైగా చెల్లించి దక్కించుకున్నారు.
More Stories
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి
హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు.
రాంచందర్ రావు కార్యవర్గంలో 8 మంది ఉపాధ్యక్షులు