భారత్, రష్యాకు దూరమయ్యాం- అవి చీకటి చైనా చేతిలో పడ్డాయ్

భారత్, రష్యాకు దూరమయ్యాం- అవి చీకటి చైనా చేతిలో పడ్డాయ్

భారత్, రష్యా దేశాలకు తాము దూరమైనట్లు అనిపిస్తోందని, వక్రబుద్ది కలిగిన చైనా చీకట్లలోకి ఆ రెండు దేశాలు వెళ్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. ఆ మూడు దేశాలు వర్ధిల్లాలని తాను కోరుకుంటున్నానని ఆయన తన ట్రూత్‌ సోషల్‌ లో ఒక పోస్టు పెట్టారు.  భారత ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్ ఇటీవల చైనాలోని తియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులో వేదిక పంచుకున్నారు.

ఈ సందర్భంగా భారత్‌- రష్యా, భారత్‌- చైనా, రష్యా- చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక సమావేశాలు జరిగాయి.  ఆయా దేశాల ద్వైపాక్షిక అంశాలపై ఆ సమావేశాల్లో చర్చించారు. ఈ మూడు దేశాల మధ్య జరుగుతున్న పరిణామాలు ట్రంప్‌కు కంటగింపుగా మారాయి. అందుకు ఈ మూడు దేశాలను ఎత్తిపొడుస్తూ ట్రంప్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. తియాన్‌జిన్‌ వేదికగా జరిగిన ఎస్‌సీవో సదస్సులో  మోదీ, పుతిన్‌, జిన్‌పింగ్‌లు కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసిన ట్రంప్, వ్యంగ్యంగా పోస్ట్ పెట్టారు.

“భారత్‌, రష్యాలను చైనాకు కోల్పోయినట్లు కనిపిస్తోంది. ఆ మూడు దేశాలకు ఉజ్వల, సుసంపన్నమైన భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా” అంటూ సెటైరికల్గా పోస్ట్ చేశారు.  ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలపై ట్రంప్‌ విరుచుకుపడుతున్న వేళ, తామంతా ఒకటే అన్నట్లు ఆ మూడు దేశాల అధినేతలు సంకేతాలిచ్చారు. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లపై చర్చించగా, వారి సమావేశంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. ట్రంప్‌ తీరువల్లే ఆ మూడు దేశాలు ఒక్కటయ్యాయనే వాదన కూడా అమెరికాలో వినిపించింది. 

ఈ నేపథ్యంలో మిత్ర దేశంగా ఉన్న భారత్‌ దూరమైనట్లు తాజాగా ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా తన సుంకాల దూకుడు దుష్ఫలితాలను అంగీకరించినట్లయింది. దీంతో భారతదేశం, రష్యా, చైనా మధ్య సంబంధాలు బలపడుతున్నాయని ట్రంప్ బహిరంగంగా అంగీకరించినట్లు ఈ వ్యాఖ్య లు చెబుతున్నాయి. ఉక్రెయిన్‌యుద్ధం, ప్ర పంచ వాణిజ్యంలో ట్రంప్ విధానాల ను విభేదిస్తున్న మూడు దేశాల అధినేతలు వివిధ స్థాయిలలో ఇంధనం నుంచి, భద్రత వరకూ పలు రంగాలలో సహకారంపై బహిరంగంగా చర్చించిడం గమనార్హం.

ఇంధన వాణిజ్యం భారత అమెరికా దేశాల మధ్య ప్రధానంగా చిచ్చురేపింది. రష్యానుంచి చమురు చౌకగా కొనుగోలు చేయడం ద్వారా ఉక్రెయిన్ పై యుద్ధంలో రష్యాకు నిధులు సమకూరుస్తోందని ట్రంప్ ఆరోపించారు. భారత్ పై కక్ష కట్టిన ట్రంప్, రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న చైనా, యురోపియన్ దేశాల పట్ల మరో విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నదన్న భారత్ ప్రశ్నకు సమాధానం చెప్పే స్థితిలో ట్రంప్ లేకపోవడం విశేషం.