ఉక్రెయిన్‌ యుద్ధం ముగింపులో భారత్‌ కీలక పాత్ర పోషించాలి

ఉక్రెయిన్‌ యుద్ధం ముగింపులో భారత్‌ కీలక పాత్ర పోషించాలి

యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షురాలు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాన్ఫరెన్స్ ఫోన్ కాల్లో గురువారం  మాట్లాడారు. ఆ సమయంలో నేతలు ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిని సమీక్షించారు. ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలను పంచుకున్నారు. వాణిజ్యం, సాంకేతికత, పెట్టుబడి, ఆవిష్కరణ, స్థిరత్వం, రక్షణ, భద్రతపై చర్చించారు.

భారత్ -ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత త్వరగా ఖరారు చేయాలనే తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. ప్రపంచ సమస్యలను సంయుక్తంగా పరిష్కరించడంలో, పరస్పర శ్రేయస్సు ప్రోత్సహించడంలో భారత్ -ఈయూ వ్యూహాత్మక భాగస్వామ్యం పాత్రను మోదీ నొక్కిచెప్పారు. భారతదేశం- ఈయూ శిఖరాగ్ర సమావేశాన్ని భారతదేశంలో నిర్వహించడం గురించి కూడా మాట్లాడారు. శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాలని ఇరువురిని మోదీ ఆహ్వానించారు.

అదే సమయంలో ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న వివాదంపై కూడా నాయకులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. శాంతియుత పరిష్కారం, స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించడం కోసం భారత్ స్థిరమైన వైఖరిని ప్రధానమంత్రి మోదీ పునరుద్ఘాటించారు. ఉక్రెయిన్‌ యుద్ధం ముగింపులో భారత్‌ కీలక పాత్ర పోషించాలని ఈయూ చీఫ్‌ అన్నారు. జెలెన్‌స్కీతో భారత్‌ నిరంతర భాగస్వామ్యాన్ని తాము స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు.

మోదీతో మాట్లాడడం ఆనందంగా ఉందని తెలిపారు. “అధ్యక్షుడు జెలెన్స్కీతో భారత్ నిరంతర భాగస్వామ్యాన్ని మేము హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. రష్యా తన దురాక్రమణ యుద్ధాన్ని ముగించడంలో, శాంతి వైపు మార్గాన్ని సృష్టించడంలో సహాయపడటంలో భారత్ ముఖ్యమైన పాత్ర పోషించాలి. ఈ యుద్ధం ప్రపంచ భద్రతా పరిణామాలను కలిగి ఉంటుంది. ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది” అని ఈయూ చీఫ్ పోస్ట్ చేశారు.

“యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్‌తో చాలా మంచి సంభాషణ జరిగింది. భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత త్వరగా ఖరారు చేయడంతోపాటు ఐఎంఈఈసి కారిడార్ అమలు కోసం ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటించాం” అని ప్రధాని మోదీ వెల్లడించారు.

పరస్పర ఆసక్తి ఉన్న అంశాలపై ఉక్రెయిన్‌లో వివాదానికి త్వరిత ముగింపు తీసుకురావడానికి ప్రయత్నాలపై అభిప్రాయాలను మార్పిడి చేసుకున్నామని మోదీ తెలిపారు. స్థిరత్వాన్ని పెంపొందించడంలో తమ వ్యూహాత్మక భాగస్వామ్యం కీలక పాత్ర పోషించాలని అంగీకరించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.