34 మానవ బాంబులతో ఉగ్రదాడికి సిద్ధం… ముంబయిలో బెదిరింపు!

34 మానవ బాంబులతో ఉగ్రదాడికి సిద్ధం… ముంబయిలో బెదిరింపు!
దేశ ఆర్థిక రాజధాని ముంబైకి ఉగ్ర బెదిరింపులు కలకలం రేపుతున్నాయి.

ముంబయి నగరంలో పేలుళ్లుకు ప్లాన్ చేశామంటూ పోలీసులకు బెదిరింపుల మెసేజ్ రావడంతో కలకలం రేపుతోంది. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. 14 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు నగరంలోకి ప్రవేశించారని, 34 మానవ బాంబులను సిద్ధం చేశామని ముంబయి ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూమ్‌ వాట్సాప్ నెంబరుకు మెయిల్ చేశారు. 

 
400 కిలోల ఆర్డీఎక్స్ మానవ బాంబులు వద్ద ఉందని, మొత్తం ముంబయిని వణికిస్తామని బెదిరించారు. గణపతి నవరాత్రులు ముగింపుకు చేరుకుని, నిమజ్జనానికి సిద్ధమైన వేళ ఈ బెదిరింపుల రావడంతో పోలీసులు, సెక్యూరిటీ ఫోర్సెస్‌ హైఅలర్ట్ అయ్యాయి. ‘లష్కర్‌ ఏ జిహాదీ’ అనే అకౌంట్ నుంచి మెయిల్‌ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. పాకిస్థాన్‌కు చెందిన జిహాదీ గ్రూప్‌ మెంబర్‌‌ను అని ఆ మెయిల్‌ పంపిన వ్యక్తి పేర్కొన్నట్లు సమాచారం.
 
బాంబు పేలుళ్ల బెదిరింపులలో క్రైమ్ బ్రాంచ్ విచారణ చేపట్టింది. అలాగే, ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) సహా ఇతర భద్రతా సంస్థలకు సమాచారం చేరవేసి నగరంలో బలగాలను భారీగా మోహరించినట్లు అధికారులు తెలిపారు. అన్ని ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీల కోసం బాంబు, డాగ్ స్క్యాడ్‌లను రంగంలోకి దింపినట్టు అధికారులు పేర్కొన్నారు. అనుమానిత ప్రదేశాల్లో ముమ్మరంగా సోదాలు కొనసాగుతున్నాయని, ఇప్పటి వరకు ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదని చెప్పారు. 
 
అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తిస్తే తక్షణమే తమకు సమాచారం అందజేయాలని ప్రజలకు ముంబయి పోలీసులు విజ్ఞప్తి చేశారు. అలాగే, సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. ఈ బెదిరింపులు నిజమైనవేనా? ఆకతాయిలు పనా? అనే కోణంలో విచారణ కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.  ఈ బెదిరింపు బూటకమని కనిపిస్తున్నప్పటికీ, నగరం అంతటా భద్రతను పెంచినట్లు ముంబై సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. 
అనంత చతుర్దశి నాడు విగ్రహ నిమజ్జనం సందర్భంగా శాంతిభద్రతలను కాపాడటానికి 21,000 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించనుని చెప్పారు. తొలిసారిగా, రూట్ నిర్వహణ, ఇతర ట్రాఫిక్ సంబంధిత నవీకరణల కోసం పోలీసులు కృత్రిమ మేధస్సును ఉపయోగించనున్నారు.  ముంబై, థానేలలో ఇటీవలి కాలంలో అనేక నకిలీ బెదిరింపు సందేశాలు వచ్చాయి.
ఈ వారం ప్రారంభంలో, థానేలోని రైల్వే స్టేషన్‌ను పేల్చివేస్తానని బాంబు బెదిరింపు కాల్ చేసినందుకు 43 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. తరువాత అది పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత నకిలీగా తేలింది. నిందితుడు రూపేష్ మధుకర్ రాన్పిసే సెప్టెంబర్ 1న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కల్వా రైల్వే స్టేషన్‌లో బాంబు అమర్చానని పేర్కొంటూ పోలీసు హెల్ప్‌లైన్‌కు కాల్ చేశాడు. రైల్వే పోలీసులు సోదాలు ప్రారంభించి మద్యం మత్తులో ఉన్నట్లు కనిపించిన రాన్పిసేను పట్టుకున్నారు.
 
ఆగస్టులో, దక్షిణ ముంబైలోని గిర్గావ్ ప్రాంతంలోని ఇస్కాన్ ఆలయానికి కూడా ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. అది తరువాత బూటకమని వెల్లడైంది. ఆగస్టు 22 సాయంత్రం, ఆలయ పరిపాలనకు బాంబు పేలుడు గురించి హెచ్చరిక ఇమెయిల్ వచ్చిందని ఒక అధికారి తెలిపారు. మే 2025లో, మహారాష్ట్ర సచివాలయానికి ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది, 48 గంటల్లో పేలుడు జరుగుతుందని హెచ్చరించింది.
జూలై చివరి వారంలో, ముంబై పోలీసులకు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పేలుడు జరుగుతుందని మరో బాంబు బెదిరింపు కాల్ హెచ్చరిక వచ్చింది. దీనితో భారీ గాలింపు ఆపరేషన్ ప్రారంభించి భద్రతా చర్యలను పెంచారు. మూడు వేర్వేరు నంబర్ల నుండి కాల్స్ వచ్చాయి. కానీ గంటల తరబడి జరిగిన గాలింపు తర్వాత, అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని అధికారులు నిర్ధారించారు.
 
జనవరిలో, ముంబైలోని జోగేశ్వరి-ఓషివారా ప్రాంతంలోని అనేక పాఠశాలలకు బాంబు ఉందని బెదిరించే ఇమెయిల్ వచ్చింది. ఆ ఇమెయిల్‌లో బాంబును “అఫ్జల్ గ్యాంగ్” అని పిలువబడే ఒక బృందం పెట్టిందని పేర్కొన్నారు. అయితే, దర్యాప్తులో ఎటువంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. తరువాత అది నకిలీదని నిర్ధారించబడింది. 
 
ఇదిలా ఉండగా, బిహార్ రాజధాని పట్నా సివిల్ కోర్టుకు ఇదే విధంగా బాంబు బెదిరింపులు వచ్చాయి. జైషే మహ్మద్‌‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు ఆ రాష్ట్రంలోకి చొరబడినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో బిహార్‌ వ్యాప్తంగా పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించారు. చొరబడిన ఉగ్రవాదుల ఫొటోలు, వివరాలను మీడియాకు విడుదల చేశారు. ఈ ముగ్గురూ నేపాల్‌ మీదుగా బిహార్‌‌లోకి చొరబడినట్టు సీనియర్‌ అధికారులు వెల్లడించారు.