
27 రాష్ట్ర అసెంబ్లీలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర మంత్రి మండలి నుంచి 643 మంది మంత్రుల అఫిడవిట్లను ఏడీఆర్ పరిశీలించింది. 302 మంది మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని తేల్చింది. అందులో 174 మంది తీవ్రమైన క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారని నివేదిక పేర్కొంది.
నివేదిక ప్రకారం, 336 మంది బీజేపీకి చెందిన మంత్రుల్లో 136 మంది (40 శాతం)పై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 88 మంది (26 శాతం) మంది తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్లో 45 మంది మంత్రులు (74 శాతం) క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. వీరిలో 18 మంది (30 శాతం) మందిపై తీవ్రమైన నేరాలు ఉన్నాయి. 31 మంది డీఎంకే మంత్రుల్లో 27 మంది అంటే దాదాపు 87 శాతం మంది క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
అయితే 14 మంది (45 శాతం) మంది తీవ్రమైన కేసులు ఎదుర్కొంటున్నారు. తృణమూల్ కాంగ్రెస్కు చెందిన 40 మంది మంత్రుల్లో 13 మంది (33 శాతం) మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో 8 మంది (20 శాతం) మందిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఆప్ మంత్రుల్లో 16 మందిలో 11 మంది (69 శాతం) క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. ఐదుగురు (31 శాతం) తీవ్రమైన కేసులు ఎదుర్కొంటున్నారు.
జాతీయ స్థాయిలో 72 మంది కేంద్ర మంత్రులలో 29 మంది (40 శాతం) తమ అఫిడవిట్లలో క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, బిహార్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, పుదుచ్చేరి 11 అసెంబ్లీల్లో 60 శాతం కంటే ఎక్కువ మంది మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. హరియాణా, జమ్మూకశ్మీర్, నాగాలాండ్, ఉత్తరాఖండ్ మంత్రులపై ఎటువంటి క్రిమినల్ కేసులు లేవు.
మరోవైపు, ఏడీఆర్ నివేదికలో మంత్రుల ఆర్థిక ఆస్తుల విశ్లేషణను కూడా చేసింది. దాని ప్రకారం, మంత్రుల సగటు ఆస్తులు రూ. 37.21 కోట్లుగా ఉండగా, మొత్తం 643 మంది మంత్రుల మొత్తం ఆస్తులు రూ. 23,929 కోట్లుగా ఉన్నాయి. 30 అసెంబ్లీల్లో, 11 మంది బిలియనీర్ మంత్రులు ఉన్నారు. కర్ణాటకలో ఎనిమిది మంది బిలియనీర్ మంత్రులతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత ఆరుగురు బిలియనీర్ మంత్రులతో ఆంధ్రప్రదేశ్, నలుగురు మంత్రులు మహారాష్ట్రలో ఉన్నాయి.
అరుణాచల్ ప్రదేశ్, ఢిల్లీ, హరియాణా, తెలంగాణలలో ఇద్దరు చొప్పున ఉండగా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలలో ఒక్కొక్కరు బిలియనీర్ మంత్రులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో 72 మంది మంత్రులలో ఆరుగురు (ఎనిమిది శాతం) బిలియనీర్లు ఉన్నారని నివేదిక పేర్కొంది. పార్టీల వారీగా, బీజేపీకి అత్యధికంగా 14 మంది బిలియనీర్ మంత్రులు ఉన్నారని తెలిపింది.
కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంది. 61 మంది మంత్రులలో 11 మంది (18 శాతం) బిలియనీర్లు కాగా, టీడీపీకి 23 మందిలో (26 శాతం) 6 బిలియనీర్ మంత్రులు ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ, జనసేన పార్టీ, జేడీఎస్, ఎన్సీపీ, శివసేన పార్టీల్లో కూడా బిలియనీర్ మంత్రులు ఉన్నారు. దేశంలో అత్యంత ధనవంతుడైన మంత్రి టీడీపీకి చెందిన డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని నిలవగా, ఆయన లోక్సభలో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆస్తులతో తర్వాతి స్థానంలో ఉన్నారు. మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలిచారు. టాప్ 10లోని ఇతర ధనవంతులైన మంత్రులలో ఆంధ్రప్రదేశ్కు చెందిన నారాయణ పొంగూరు, నారా లోకేష్, తెలంగాణకు చెందిన గడ్డం వివేకానంద, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కర్ణాటకకు చెందిన సురేశ్, మహారాష్ట్రకు చెందిన మంగళ్ ప్రభాత్ లోధా, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఉన్నారు.
More Stories
సందడిగా దత్తాత్రేయ `అలయ్ బలయ్’
ఆర్ఎస్ఎస్ అంకితభావం, సేవకు అరుదైన ఉదాహరణ.. దలైలామా
భీమస్మృతి మనకు మార్గదర్శకం, మనుస్మృతి కాదు