వరుసగా ఏడోసారి అత్యుత్తమ విద్యాసంస్థగా ఐఐటి మద్రాస్‌

వరుసగా ఏడోసారి అత్యుత్తమ విద్యాసంస్థగా ఐఐటి మద్రాస్‌

* ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం 24, ఉస్మానియా 53, విజ్ఞాన్ 70 ర్యాంకులు

దేశవ్యాప్తంగా అన్ని విభాగాల్లో అత్యుత్తమ విద్యాసంస్థగా ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ- మద్రాస్‌ (ఐఐటి మద్రాస్‌) మరోసారి తన స్థానాన్ని పదిలపరుచుకుంది. వరుసగా ఏడోసారి అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సి) బెంగళూరు, ఐఐటి ముంబయి ఈ కేటగిరీలో వరుసగా రెండు, మూడో స్థానాల్లో నిలిచాయి. గతేడాది ఇవి వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలవడం గమనార్హం.

నేషనల్‌ ఇనిస్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) -2025  రూపొందించిన  పదవ ఎడిషన్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి గురువారం విడుదల చేశారు. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ పదవ ఎడిషన్‌లో 17 విభాగాలకు అవార్డులు ప్రకటించబడ్డాయని కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పేర్కొన్నారు.  మరిన్ని సంస్థలు ఈ జాబితాలో చేరాయని, ఇది మన ఉన్నత విద్యారంగం సాధించిన స్థిరమైన వృద్ధిని చూపుతోందని తెలిపారు.  బెంగళూరులోని నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా దేశంలోనే అత్యుత్తమ లా కాలేజీగా, ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఉత్తమ వైద్య, దంత కళాశాలగా ర్యాంక్‌ సాధించాయి.

కాగా, ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్‌ల్లో తెలంగాణ నుంచి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం 24వ స్థానంలో నిలించింది. ఉస్మానియా యూనివర్సిటీ 70వ స్థానం నుండి 53వ స్థానంకు మెరుగైన రాంక్ పొందింది. గత ఏడాది ఈ యూనివర్సిటీ 37వ స్థానంలో ఉంది  విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకి జాతీయస్థాయిలో 70వ ర్యాంకు లభించిందని యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్‌, ప్రొఫెసర్‌ పి.నాగభూషణ్‌ తెలిపారు.అదే విధంగా ఇంజనీరింగ్‌ విభాగంలో కూడా 80వ ర్యాంకు సాధించినట్టు చెప్పారు.

ఢిల్లీలోని ఇండియన్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వ్యవసాయానికి ఉత్తమ విద్యాసంస్థగా ఎంపికైంది. అలాగే పరిశోధనలో బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఉత్తమంగా నిలిచింది. ఇన్నోవేషన్‌ ర్యాంకింగ్‌ విభాగంలో ఐఐటి -మద్రాస్‌ మొదటి స్థానంలో నిలవడమే కాక ఉత్తమ ఇంజనీరింగ్‌ సంస్థ హోదాను కూడా పొందింది. రెండో స్థానంలో ఐఐటి -ఢిల్లీ నిలిచింది.

ఉత్తమ రాష్ట్ర ప్రభుత్వ యూనివర్శిటీగా కోల్‌కతాలోని జాదవ్‌పూర్‌ యూనివర్శిటీ, చెన్నైలోని అన్నా యూనివర్శిటీలు నిలిచాయి. ఉత్తమ ఓపెన్‌ యూనివర్శిటీగా ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్శిటీ-ఢిల్లీ, స్కిల్స్‌లో ఉత్తమ యూనివర్శిటీగా సింబయాసిస్‌ స్కిల్స్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ యూనివర్శిటీ నిలిచింది.

ఉత్తమ యూనివర్శిటీగా ఐఐఎస్‌సి బెంగళూరు అత్యుత్తమ ర్యాంక్‌ పొందగా, జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు) న్యూఢిల్లీ, మణిపాల్‌ అకాడమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. మేనేజ్‌మెంట్‌ విభాగంలో ఉత్తమ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) అహ్మదాబాద్‌ అత్యుత్తమ ర్యాంకును సాధించగా, ఐఐఎం బెంగళూరు, ఐఐఎం కోజికోడ్‌లు తరువాతి స్థానాల్లో నిలిచాయి.

ఫార్మసీ విభాగంలో ఉత్తమ సంస్థగా జామియా హమ్‌దార్ద్‌, న్యూఢిల్లీ మొదటి ర్యాంకులో నిలవగా, బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌- పిలానీ, చండీగఢ్‌లోని పంజాబ్‌ యూనివర్శిటీ రెండు,మూడు స్థానాల్లో నిలిచాయి. ఉత్తమ కళాశాల విభాగంలో మొదటి మూడు స్థానాలను వరుసగా ఢిల్లీ హందూ కళాశాల, మిరండా హౌస్‌, హన్స్‌రాజ్‌ కాలేజీలు గెలుచుకున్నాయి. ఆర్కిటెక్చర్‌,ప్లానింగ్‌లో ఐఐటి రూర్కీ అగ్రస్థానంలో నిలిచింది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, కోజికోడ్‌, ఐఐటి ఖరగ్‌పూర్‌లు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. కొత్త విభాగం స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలలోనూ ఐఐటి మద్రాస్‌ మొదటి స్థానంలో నిలవడం గమనార్హం.