
జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్రం. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్ రేట్లు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించారు. 5, 18 శాతం స్లాబ్‌లు మాత్రమే కొనసాగించాలని, 12, 28 శాతం స్లాబ్‌లు తొలగించాలని నిర్ణయించారు. విలాస వస్తువులపై 40 శాతం ట్యాక్స్ వేయనున్నారు.
జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ తరువాత జనరేషన్ సంస్కరణలకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారని మీడియాతో తెలిపారు. అందుకే ఇకపై జీఎస్టీలో రెండు స్లాబ్‌లు మాత్రమే కొనసాగించాలని నిర్ణయించామని వెల్లడించారు. ముఖ్యంగా రైతులు, సామాన్య ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు.
స్లాబుల తగ్గనున్న నిత్యావసరాలు, వాహన ధరలు కుదింపునకు సమావేశంలో రాష్ర్టాలు అంగీకరించినట్టు చెప్పారు. దీంతో దేశవ్యాప్తంగా మారిన జీఎస్టీ రేట్లే చలామణిలో ఉంటాయన్నారు. చాలావరకు నిత్యావసరాలపై పన్నుల భారం తగ్గిందని పేర్కొన్నారు. ముఖ్యంగా వ్యక్తిగత జీవిత, ఆరోగ్య బీమాలపై పన్ను ఎత్తివేసినట్టు తెలిపారు. దీంతో ఆయా పాలసీదారులపై ప్రీమియం భారం తగ్గనున్నది.
మరికొన్ని నిత్యావసరాలపైనా జీఎస్టీ మినహాయింపునిచ్చినట్టు ఆమె వివరించారు. అంతేగాక విద్యార్థుల కోసం పెన్సిల్ షార్ప్నర్లు, మ్యాప్‌లు, ఎరేజర్లు, ఎక్సర్సైజ్ బుక్‌లపై పన్నును తీసేశారు. అలాగే ఈవీలపై 5 శాతం జీఎస్టీ ఉంటుందన్నారు.
అయితే సిగరెట్లు సహా ఇతర పొగాకు ఉత్పత్తులపై ఎప్పట్లాగే 28 శాతం జీఎస్టీ, నష్టపరిహార సెస్సు పడుతుందని ఆర్ధిక మంత్రి స్పష్టం చేశారు. కరోనా దృష్ట్యా జీఎస్టీ చెల్లింపుల కోసం తెచ్చిన రుణాలు తీరేంత వరకు ఇంతేనని తేల్చిచెప్పారు. ఆ తర్వాత కొత్త పన్నులు వర్తిస్తాయని పేర్కొన్నారు. మారిన విధానంతో రెవిన్యూ నష్టం రూ.48,000 కోట్లు అని వెల్లడించారు.
ఇదిలావుంటే జీఎస్టీ సంస్కరణలతో దేశ ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయన్న ఆశాభావాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కనబర్చారు. అలాగే వ్యాపార నిర్వహణ, ముఖ్యంగా చిరు వ్యాపారులకు లాభం చేకూరుతుందన్నారు. అమెరికా సుంకాలతో ప్రభావితమైన దేశ ఆర్థిక వ్యవస్థకు జీఎస్టీ భారం తగ్గింపుతో కొత్త జోష్ రాగలదన్నారు.
ప్రస్తుతం జీఎస్టీ ప్రధాన స్లాబులు నాలుగున్నాయి. అయితే వీటిని రెండుకు తగ్గిస్తామని పంద్రాగస్టు ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా తాజా జీఎస్టీ మండలి సమావేశంలో నిర్ణయాలు వెలువడ్డాయి. ఇప్పుడున్న 5, 12, 18, 28 శాతం స్లాబుల్లో 12, 28 శాతం స్లాబులను తీసేశారు.
ఈ క్రమంలోనే 12 శాతం జీఎస్టీని ఎదుర్కొంటున్న 99 శాతం వస్తూత్పత్తులను 5 శాతంలోకి, 28 శాతం పన్ను పడుతున్న వాటిలో 90 శాతం వస్తూత్పత్తులను 18 శాతంలోకి తెచ్చినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక ప్రత్యేకంగా 40 శాతం స్లాబును ఏర్పాటు చేయగా, ఇందులో 6-7 వస్తూత్పత్తులే ఉంటున్నాయి. వీటిలో పొగాకు, పాన్ మసాలా, లగ్జరీ బైకులు, కార్లు మొదలైన వాటిని ఉంచుతున్నారు.
రాష్ర్టాల ఆందోళన
జీఎస్టీ స్లాబుల కుదింపు నేపథ్యంలో బీజేపీ, దాని మిత్రపక్షాలేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలు ఆందోళన వ్యక్తం చేశాయి. జీఎస్టీతో ఇప్పటికే పన్ను ఆదాయాన్ని కోల్పోయామని, ఇప్పుడు స్లాబులను తగ్గించి మరింతగా నష్టపరుస్తున్నారని తెలంగాణ సహా పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, పంజాబ్, కేరళ, తమిళనాడు రాష్ర్టాలు అభ్యంతరాలను వెలిబుచ్చాయి.
అందుకే నష్టపరిహార సెస్సుపై స్పష్టత కావాలని డిమాండ్ చేస్తున్నాయి. 40 శాతంపై విధించే ఏ లెవీ రాబడినైనా ఆదాయాన్ని నష్టపోతున్న రాష్ర్టాలకే చెందేలా చూడాలని పశ్చిమ బెంగాల్ అన్నది. ఆయా కేంద్ర, రాష్ట్ర పన్నులను కలిపి 2017 జూలై 1న దేశవ్యాప్తంగా జీఎస్టీని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీంతో నష్టపోతున్న రాష్ర్టాల కోసం ఐదేండ్లు నష్టపరిహార సెస్సును అమలు చేశారు. అయితే 2022 జూన్‌లో మళ్లీ 2026 మార్చి 31దాకా పొడిగించారు.
కొత్త పన్నులు ఇలా
- 1200సీసీ లోపున్న పెట్రోల్, ఎల్పీజీ, సీఎన్జీ కార్లు, 1500 సీసీ లోపున్న డీజిల్ కార్లు, 350సీసీ లోపున్న ద్విచక్ర వాహనాలు,
త్రిచక్ర వాహనాలు, అంబూలెన్స్‌లు, ఏసీ, టీవీలు, డిష్ వాషర్లు, వాషింగ్ మెషీన్లు, సిమెంట్, ఆటో విడిభాగాలపై
జీఎస్టీ భారం 28 శాతం నుంచి 18 శాతానికి. - 20 లీటర్ ప్యాకేజ్డ్ వాటర్, హెయిర్ ఆయిల్, బిస్కట్లు, ఐస్‌క్రీములు,టూత్‌పేస్ట్, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, సబ్బులు, సైకిళ్లు, హస్తకళలు, మార్బుల్స్, గ్రానైట్ బ్లాక్స్, జామ్, కోకోనట్ వాటర్, సాస్, పాస్తా,ఇన్స్టంట్ న్యూడుల్స్, చాక్లెట్లు, హోటల్ గది, వెదురు ఫర్నీచర్ మొదలైనవి 12 లేదా18 శాతం స్లాబ్ నుంచి 5 శాతం స్లాబులోకి.
- పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లు, 350సీసీ మించిన మోటార్ సైకిళ్లు, 1200సీసీ మించిన పెట్రోల్ కార్లు, 1500సీసీ మించిన డీజిల్ కార్లు కొన్ని రకాల శీతల పానీయాలు, వ్యక్తిగత విమానాలపై ప్రత్యేకంగా 40 శాతం జీఎస్టీ.
- వ్యక్తిగత జీవిత, ఆరోగ్య బీమాలపై 18 శాతం పడుతున్న జీఎస్టీ ఎత్తివేత.
- బట్టర్, డ్రైనట్స్, బుజియా, ఎరువులు, క్రిమిసంహారకాలు, ట్రాక్టర్లపై పన్ను భారం 12 శాతం నుంచి 5 శాతానికి.
- రోటీ, పరోట, ముఖ్యమైన ఔషధాలపై మరికొన్ని నిత్యావసరాలపై పన్ను లేదు.
More Stories
అడ్డంకుల తొలగింపుకు చర్చలకు ట్రంప్, మోదీ సుముఖం!
రాహుల్ గాంధీ మలేసియా `విహార యాత్ర’పై దుమారం
నిరసనలతో రగిలిపోతున్న నేపాల్… రంగంలోకి సైన్యం