పంజాబ్ లో 1,400 గ్రామాలను ముంచెత్తిన వరదలు, 30 మంది మృతి

పంజాబ్ లో 1,400 గ్రామాలను ముంచెత్తిన వరదలు, 30 మంది మృతి
 
* ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాల బీభత్సం

భారీ వరదలతో పంజాబ్ రాష్ట్రం అతలాకుతలమైంది. అత్యంత దారుణ వరదలతో జనజీవనం స్తంభించిపోయింది. దశాబ్దాలలో ఎన్నడూ లేనంత దారుణమైన వరదలు సంభవించడంతో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విపత్తు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించింది.  విపత్తు నిర్వహణ చట్టం, 2025 ప్రకారం రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ (ఎస్ఈసి) ఛైర్మన్‌గా, విపత్తు పరిస్థితులు తలెత్తితే చట్టంలోని సెక్షన్ 34 కింద అవసరమైన ఉత్తర్వులు జారీ చేయడానికి ప్రధాన కార్యదర్శి కె ఏ పి సిన్హా జిల్లా న్యాయాధికారులకు అధికారం ఇచ్చారు.

బాధిత ప్రజలకు సహాయం అందించడానికి వేగంగా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లా విపత్తు నిర్వహణ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర శాఖలు అత్యవసర సహాయ విధులను ఖచ్చితంగా పాటించాలని, తగినంత మంది సిబ్బంది ఎల్లప్పుడూ విధుల్లో ఉండేలా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రజా పనుల శాఖ, జల వనరుల శాఖ, పంజాబ్ రాష్ట్ర విద్యుత్ కార్పొరేషన్ లిమిటెడ్ లతో సహా కీలక విభాగాలకు యుద్ధ ప్రాతిపదికన అవసరమైన సేవలను పునరుద్ధరించే బాధ్యతను అప్పగించారు.

రాష్ట్రవ్యాప్తంగా నిరంతరాయంగా మొబైల్, ల్యాండ్‌లైన్ కనెక్టివిటీని నిర్ధారించాలని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను అధికారులు ఆదేశించారు. అధికారిక సమాచారం ప్రకారం రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో ఇప్పటివరకు వివిధ కనీసం 30 మంది మరణించినట్లు ప్రభుత్వం తెలిపింది.  పంజాబ్‌లోని 23 జిల్లాల్లో 1,400 గ్రామాలను వరదలు ముంచెత్తాయి. 

భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు సెప్టెంబర్ 7 వరకు మూసివేసినట్లుగా విద్యా శాఖ మంత్రి హర్జిత్ సింగ్ బెయిన్స్ ప్రకటించారు. స్థానిక పరిపాలన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని బెయిన్స్ పౌరులకు విజ్ఞప్తి చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని భాక్రా ఆనకట్ట పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నందున సట్లెజ్ నది పరివాహక ప్రాంతంలో నివసించే స్థానికులు అప్రమత్తంగా ఉండాలని పంజాబ్‌లోని రూప్‌నగర్ జిల్లా యంత్రాంగం బుధవారం కోరింది.

కాగా, ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆకస్మిక వరదల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడి ఆరుగురు మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్‌లోనూ ఆకస్మిక వరదలు కారణంగా నలుగురు మరణించారు. ముగ్గురు గల్లంతయ్యారు.  ఇక జమ్మూకాశ్మీర్‌లోనూ భారీ వర్షాల కారణంగా నదులు పొంగిపొర్లుతున్నాయి. నీటి మట్టాలు పెరగడం వల్ల అనేక ఇండ్లు నీట మునిగాయి. 

అఖ్నూర్‌లో చీనాబ్ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. సమీపంలోని గర్ఖాల్ గ్రామంలోకి భారీగా వరద చేరగా పెద్ద సంఖ్యలో ఇళ్లు నీట మునిగాయి.  ఢిల్లీలో యమునా నది ప్రమాద స్థాయి అయిన 205.33 మీటర్లు దాటి ప్రవహిస్తోంది. పాత రైల్వే వంతెన వద్ద యమునా నది ప్రవాహం 207 మీటర్లకు చేరుకుంది. ఫలితంగా నిగమ్‌బోధ్ ఘాట్‌, యమునా బజార్‌ ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. కాళింది కుంజ్‌లోని పలు ప్రాంతాలు, విశ్వకర్మ కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

వరద నేపథ్యంలో ఈ ప్రాంతాల్లోని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సమీపంలోని ఓల్డ్ ఉస్మాన్‌పుర్‌, ఓల్డ్‌ గడీ మాండూ గ్రామాల్లోకి వరద చేరడంతో 2 వేల 500 మందిని, వారి పెంపుడు జంతువులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని నాలుగు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. మరో 18 బృందాలు సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.

ఛత్తీస్‌గఢ్‌ బలరాంపుర్‌ జిల్లా ధనేష్‌పుర్ గ్రామంలో ఓ చిన్న డ్యామ్‌ కూలి ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు గల్లంతయ్యారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోందని మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు