జీఎస్​టీ సంస్కరణలు ఒక చారిత్రాత్మక నిర్ణయం

జీఎస్​టీ సంస్కరణలు ఒక చారిత్రాత్మక నిర్ణయం

సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ధరల భారం దించుతూ జీఎస్​టీ మండలి తీసుకున్న నిర్ణయంపై ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం అంటూ కొనియాడారు. ఈ సంస్కరణలు పౌరుల జీవితాలను మెరుగుపరుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్ సైతం దీనిని స్వాగతించింది.  జీఎస్​టీ సంస్కరణలు పౌరులన జీవితాలను మెరుగుపరుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

ఆమోదించిన మార్పులతో వ్యాపార నిర్వహణ అందరికీ సులభతరం అవుతుందని ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. ముఖ్యంగా చిరు వ్యాపారులు, రైతులు, మధ్యతరగతి, మహిళలు, యువతకు మేలు కలుగుతుందని చెప్పారు.  సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరచడం, ఆర్థికరంగాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణపై స్థూలంగా ఒక ప్రతిపాదనను కేంద్రం రూపొందించిందని చెబుతూ కేంద్రం-రాష్ట్రాల భాగస్వామ్యం ఉండే జీఎస్టీ మండలి ఉమ్మడిగా దీనిపై నిర్ణయం తీసుకోవడం ఆనందదాయకమని ప్రధాని రాసుకొచ్చారు.

రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ కూడా స్పందిస్తూ, ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​లను ప్రశంసించారు. మోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం అన్ని రంగాలకు ఉపశమనం కలిగించడానికి జీఎస్టీ సంస్కరణలను ప్రకటించిందని పేర్కొన్నారు. ముఖ్యమైన వస్తువులపై పన్ను రేట్లు తగ్గించడంతో వ్యాపార సౌలభ్యాన్ని మరింత బలోపేతం చేస్తోందని చెప్పారు. ఆత్మనిర్భర్​ కింద భారత స్వావలంబనను పెంచుతుందని తెలిపారు.

 
జీఎస్టీ సంస్కరణలు చారిత్రాత్మక నిర్ణయమని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలిపారు. పన్ను రేట్లను తగ్గించడం చారిత్రక నిర్ణయం అని అభివర్ణించారు. జీఎస్టీ వ్యవస్థను సరళీకృతం చేయడం ద్వారా, సాధారణ పౌరులపై భారాన్ని తగ్గించి, చిన్న వ్యాపారుల వ్యాపార సౌలభ్యానికి పెద్ద ప్రోత్సాహాన్ని కల్పిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.  వస్తువులు, సేవల పన్ను రిజిస్ట్రేషన్​ పథకాన్ని ప్రవేశపెట్టాలనే జీఎస్టీ కౌన్సిల్​ నిర్ణయాన్ని ఆయన ప్రశంసించారు. ఈ మేరకు ఆయన ఎక్స్​లో పోస్ట్​ చేస్తూ “ప్రధాని మోదీ తాను చేసే దానికి కట్టుబడి ఉన్నారు. జీఎస్టీ రేటు తగ్గింపులు, ప్రక్రియ సంస్కరణల చారిత్రక నిర్ణయం. ఇది పేద, మధ్యతరగతికి భారీ ఉపశమనం కలిగిస్తుంది” అని చెప్పారు

ఇది ఉండగా జీఎస్టీ సంస్కరణల గురించి కాంగ్రెస్​​ నేత, మాజీ ఆర్ధిక మంత్రి చిదంబరం స్పందిస్తూ “వివిధ వస్తువుల రేట్ల తగ్గింపు స్వాగతించదగినది కానీ ఎనిమిది సంవత్సరాలుగా చాలా ఆలస్యం జరిగింది. జీఎస్టీ రూపకల్పన, రేట్లకు వ్యతిరేకంగా గత ఎనిమిది సంవత్సరాలుగా మేం పోరాడుతున్నాం. కానీ మా విన్నపాలు పట్టించుకోలేదు”అని ఆయన ఎక్స్​లో పోస్ట్​ చేశారు. ఈ సంస్కరణలు తెచ్చేందుకు ఇంతకాలం ఎందుకు పట్టిందని మోదీ సర్కార్ ను ప్రశ్నించారు. రాజకీయ కారణాల వల్లే అకస్మాత్తుగా జీఎస్టీలో ఈ మార్పులు తీసుకొచ్చారని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా జీఎస్టీ సంస్కరణల గురించి ఆల్​ ఇండియా తృణముల్​ కాంగ్రెస్​ ‘ప్రభుత్వంపై నిరంతర ఒత్తిడి తర్వాత సాధించిన సామాన్య ప్రజల విజయం’ అని అభివర్ణించింది. జీఎస్​​టీ సంస్కరణలు నిజంగా ప్రశంసనీయం. ఈ పరివర్తన చర్యలు పౌరుల జీవతాలను, వ్యాపారాలను సులభతరం చేస్తాయి”అని ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్​ తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, మరింత సమగ్రంగా మార్చడానికి ఈ సంస్కరణలు ఉపయోగపడతాయని చెప్పారు.

“స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మోదీ జీఎస్​టీ తదుపరి తరం సంస్కరణలను తీసుకువస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చారు. దేశంలోని సామాన్య ప్రజలకు దీపావళి బహుమతి అందించారు. ఈ నిర్ణయం వల్ల సామాన్యుల జీవితం సౌకర్యవతంగా ఉంటుంది” అని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా హర్షం ప్రకటించారు.

“జీఎస్​టీ సంస్కరణలను స్వాగతిస్తున్నాం. దీంతో రైతుల నుంచి వ్యాపారుల వరకు సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రతి భారతీయుడికి మెరుగైన జీవన నాణ్యతను నిర్ధారిస్తాయి” అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మోదీ, నిర్మలాసీతారామన్​కు అభినందనలు తెలిపారు.

భారత ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు, పెట్టుబడులను పెంచడానికి మరిన్ని వేగవంతమైన సంస్కరణలు అవసరమని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా కోరారు. ‘లేవండి, మేల్కొనండి, లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆగకండి’ అనే స్వామి వివేకానంద పిలుపును ఉద్బోధిస్తూ ఆయన ఈ మేరకు ఎక్స్​లో పోస్ట్​ చేశారు. ప్రపంచంలో తన స్వరాన్ని పెంపొందించే దిశగా భారత్​ అడుగులు వేస్తోందని అభివర్ణించారు.