చట్టాలు చేయడంలో గర్వర్నర్లకు ఎటువంటి పాత్ర ఉండదు

చట్టాలు చేయడంలో గర్వర్నర్లకు ఎటువంటి పాత్ర ఉండదు
చట్టాలు చేయడం అసెంబ్లీల పరిధిలోకి మాత్రమే వస్తుందని, ఆ ప్రక్రియలో గవర్నర్లకు ఎటువంటి పాత్ర ఉండదని రాష్ట్ర ప్రభుత్వాలు బుధవారం సుప్రీంకోర్టులో వాదించాయి. రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులకు సమ్మతి తెలియచేసేందుకు గవర్నర్లు, రాష్ట్రపతికి గడువు విధించడంపై రాష్ట్రపతి పంపిన ప్రస్తావనపై, వివిధ రాష్ర్టాలు దాఖలు చేసిన పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) గవాయ్‌ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం బుధవారం ఏడవ రోజు విచారణ కొనసాగించింది.

బిల్లులను తమ వద్దనే అట్టిపెట్టుకోవడంలో గవర్నర్లకు గల విచక్షణాధికారాలకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌, కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌లు సుప్రీంకోర్టులో వాదించాయి. శాసనసభలు పంపిన బిల్లులను గవర్నర్లు తొక్కిపట్టి జాప్యం చేసే అధికారం లేదని పేర్కొన్నారు. రాజ్యాంగంలో చాలా స్పష్టంగా బిల్లులను ‘వీలైనంత త్వరగా పరిష్కరించాలి’ అన్న నిబంధన ఉందని, దీనర్థం ‘వెనువెంటనే లేదా తక్షణమే’ అని తెలిపారు.
 
గవర్నర్లకు ప్రతీకాత్మక (నామమాత్రపు) అధికారాలే వుంటాయని, గవర్నర్ల ఇష్టానుసారంమీద ప్రజల అభీష్టం లేదా సంకల్పం ఆధారపడి వుండదని పేర్కొన్నాయి. బిల్లును తన వద్దనే సుదీర్ఘకాలం అట్టిపెట్టుకోవడం లేదా దాన్ని తొక్కిపట్టి వుంచడమంటే బిల్లును ఆమోదించడానికి నిరాకరించడమేనని ఆ మూడు రాష్ట్రాలు పేర్కొన్నాయి.  బిల్లులను పరిశీలించేటపుడు గవర్నర్‌ వంటి ఉన్నత రాజ్యాంగ అధికారి చిత్తశుద్ధితోనే వ్యవహరిస్తారని కేంద్రం భావించినట్లైతే రాష్ట్రాల శాసనసభల పట్ల కూడా అదే మర్యాద పాటించాలని, ఆ సభలు కూడా ఉన్నత రాజ్యాంగ వ్యవస్థలేనని వాదించాయి.

పశ్చిమ బెంగాల్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపిస్తూ రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు తప్పనిసరిగా సంతకం చేయాలని చెప్పారు. అసెంబ్లీ ఆమోదించిన చట్టం రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే కేంద్రం ఆ చట్టాన్ని రద్దు చేయవచ్చని లేదా కోర్టులో సవాలు చేయవచ్చని ఆయన తెలిపారు. కాని ప్రజాభీష్టాన్ని గవర్నర్‌ అడ్డుకోలేరని ఆయన స్పష్టం చేశారు. తన వ్యక్తిగత సంతృప్తి ఆధారంగా గవర్నర్లు బిల్లులను పెండింగ్‌లో పెట్టడానికి అనుమతిస్తున్నట్లు ఆర్టికల్‌ 200లో ఏ నిబంధన చెప్పలేదని ఆయన వాదించారు.

బిల్లులను గవర్నర్లు అడ్డుకోవడం వల్ల కేంద్రం-రాష్ట్ర మధ్య ఘర్షణలను పెంచుతుందని, ప్రజాస్వామ్యానికి ఇది ముప్పుగా పరిణమించగలదని హిమాచల్‌ ప్రదేశ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఆనంద్‌ శర్మ హెచ్చరించారు. కర్ణాటక తరఫున సీనియర్‌ న్యాయవాది గోపాల్‌ సుబ్రహణ్యం కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ రాష్ర్టాలలో రెండు ప్రభుత్వ వ్యవస్థలు ఉండరాదని వాదించారు. రెండు రాజ్యాంగపరమైన పరిస్థితులలో తప్పించి గవర్నర్లు రాష్ట్ర మంత్రిమండలి సూచన మేరకు పనిచేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.