
అమెరికాతో టారిఫ్స్ యుద్ధం, పాక్‌తో ఉద్రిక్తతల వేళ భారత రక్షణ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన గగనతల రక్షణ వ్యవస్థగా పేరుగాంచిన ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్ అదనపు యూనిట్స్‌ని రష్యా నుంచి మరిన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఈ విషయమై మాస్కోతో చర్చలు ప్రారంభించింది.
భారత్ ఇప్పటికే ఎస్-400 వ్యవస్థలను ఉపయోగిస్తున్నది. ఇటీవలే పాకిస్థాన్‌తో ఘర్షణల సమయంలో ఈ ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసింది. పాకిస్థాన్ డ్రోన్లు, మిసైల్స్‌తో దాడికి ప్రయత్నించగా ఎస్-400 సహాయంతో వాటిని భారత్ విజయవంతంగా కూల్చివేసింది. ఖచ్చితత్వంతో సరిహద్దు నుంచి వైమానిక ముప్పును ఎదుర్కోవడంలో ఈ వ్యవస్థ సమర్థవంతంగా పని చేసిన నేపథ్యంలో భారత్ తన వైమానిక రక్షణ సామర్థ్యాన్ని మరింత విస్తరించేందుకు నిర్ణయం తీసుకుంది.
చైనా నుంచి పెరుగుతున్న సైనిక ముప్పును ఎదుర్కొనే లక్ష్యంతో ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు రష్యాతో ఇండియా 5 బిలియన్ల డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ ఒప్పందం 2018లో కుదిరింది. ఈ ఒప్పందం కింద మొత్తం ఐదు ఎస్-400 వ్యవస్థలను కొనుగోలు చేయాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల సరఫరాలో జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో భారత్‌కు ఇవ్వాల్సిన మిగిలిన రెండు యూనిట్లను 2026లోగా అందజేసేందుకు కట్టుబడి ఉన్నామని రష్యా ఇటీవలే ప్రకటించింది.
ఇప్పుడు ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్ అదనపు యూనిట్స్ కోసం రష్యాతో భారత్ చర్చలు ప్రారంభించింది. ఎస్-400 ట్రయాంఫ్ అనేది భూమిపై నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థ. దీన్ని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కూడా మోహరించవచ్చు. ఆకాశంలో దూసుకొచ్చే శత్రువుల జెట్స్, రాకెట్లను ఇది భూమిపై నుంచే కూల్చివేయగల సామర్థ్యం వీటికి ఉంది. విమానాలు, మానవరహిత వైమానిక విమానాలు, క్రూయిజ్ క్షిపణులను ధ్వంసం చేస్తుంది. ఇది టెర్మినల్ బాలిస్టిక్ క్షిపణి రక్షణ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది.
ఎస్-400 ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన మొబైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీన్ని సులభంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించేందుకు అవకాశం ఉంటుంది. స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రకారం, 2020-2024 మధ్య కాలంలో భారత్ ఆయుధ దిగుమతుల్లో 36 శాతం వాటా రష్యాదే. బ్రహ్మోస్ క్షిపణులు, సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానాలు, టీ-90 ట్యాంకులు, ఏకే-203 రైఫిళ్ల తయారీ వంటి ఎన్నో కీలక రక్షణ ప్రాజెక్టుల్లో ఇరు దేశాలు దశాబ్దాలుగా కలిసి పనిచేస్తున్నాయి.
ఒకేసారి 36 టార్గెట్‌లను ట్రాక్ చేసే సామర్థ్యం దీనికి ఉంది. అలాగే, 12 టార్గెట్స్‌పై ఒకే సారి దాడి చేస్తుంది. 600 కిలోమీటర్ల దూరం నుంచే ట్రాక్ చేస్తూ 400 కిలోమీటర్ల పరిధిలోనే శత్రువుల మిస్సైల్స్‌ను కూల్చే సత్తా వీటి సొంతం. విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్ ఇలా వేర్వేరు లక్ష్యాలను ఒకేసారి టార్గెట్ చేసి ఛేదిస్తుంది. వీటి రియాక్షన్ టైమ్ చేలా వేగంగా ఉంటుంది. ఎస్-400 యాంటీ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్‌ను ఫైర్ చేసేందుకు ఐదు నిమిషాల్లోనే సిద్ధం చేయొచ్చు. ఇందులో 3డీ ఫేజ్‌డ్ అరే రాడార్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది.
More Stories
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్ కు చైనా, ఐరోపా, యుఎఈ, అమెరికాల నిఘా యంత్రాలు
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు