
“కేంద్రం మళ్లీ జీఎస్టీ శ్లాబ్‌ల హేతుబద్ధీకరణ చేస్తామంటోంది. శ్లాబుల మార్పు వల్ల తెలంగాణకు దాదాపు రూ.7 వేల కోట్ల ఆదాయం తగ్గే అవకాశం ఉంది. ఈ నష్టాన్ని కేంద్రమే భర్తీ చేయాలి” అని ఈ నెల 29న డిల్లీలో జీఎస్టీ శ్లాబ్‌ల హేతుబద్ధీకరణపై తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలివీ. భట్టి విక్రమార్కతో పాటు విపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నాయి.
బుధవారం, గురువారం శ్లాబ్ల హేతుబద్ధీకరణపై జీఎస్టీ కౌన్సిల్ భేటీ అవుతున్న వేళ విడుదలైన ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్’ (ఎస్‌బీఐ రీసెర్చ్) నివేదిక అటువంటి ఆందోళనలను కొట్టిపారవేసింది. జీఎస్టీ సంస్కరణలతో ఎలాంటి నష్టం జరగబోదోని చెప్పింది. ఈ సరిళీకరణ రాష్ట్రాలకు ప్రయోజనమని నివేదించింది. విపక్షాలు ఆందోళన చెందుతున్నట్లు జీఎస్టీ వసూళ్లు తగ్గినా ఆ ఇబ్బంది స్వల్ప కాలమే ఉంటుందని, దీర్ఘకాలంలో రాబడి పుంజుకుంటుందని అధ్యయనం అంచనా వేసింది.
జీఎస్టీ సంస్కరణలు చేసిన తర్వాత కూడా దేశంలోని రాష్ట్రాలు లాభంలోనే ఉంటాయని ఈ నివేదిక తేల్చి చెప్పింది. జీఎస్టీ వ్యవస్థ మౌలిక నిర్మాణం రాష్ట్రాలకు లబ్ధి చేకూర్చేలా, ఆర్థిక సమాఖ్య స్ఫూర్తితో ఉందని స్పష్టం చేసింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం జీఎస్టీ వసూళ్లలో 50 శాతం ‘స్టేట్ జీఎస్టీ’ (ఎస్ జీఎస్టీ) రూపంలో నేరుగా రాష్ట్రాలకే అందుతుంది. కేంద్ర జీఎస్టీ ఆదాయంలో 41 శాతం వాటా రాష్ట్రాలకు అందుతుంది. అంటే జీఎస్టీ ఆదాయంలో 70శాతం రాష్ట్రాలకే అందుతుంది.
2026 ఆర్థిక సంవత్సరం (2025 ఏప్రిల్ 1 – 2026 మార్చి 31)లో ‘స్టేట్ జీఎస్టీ’ (ఎస్ జీఎస్టీ) రూపంలో కనీసం రూ.10 లక్షల కోట్లను రాష్ట్రాలు పొందే అవకాశం ఉంది. కేంద్ర పన్ను వాటాలో కింద రూ.4.1 లక్షల కోట్లు కూడా రాష్ట్రాలకు నికరంగా పొందొచ్చు. ఈసారి జీఎస్టీ సంస్కరణలు చేసిన తర్వాత మనదేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వస్తు,సేవల వినియోగం గణనీయంగా పెరగొచ్చు. దీనివల్ల అదనంగా రూ.52వేల కోట్ల జీఎస్టీ ఆదాయం పెరగొచ్చని నివేదిక అంచనా వేసింది. దీన్నికూడా కేంద్ర, రాష్ట్రాలు సరిసమానంగా పంచుకోనున్నాయి.
జీఎస్టీ అమలు ప్రారంభమైనప్పుడు (2017)లో రాబడి సగటున 14.4శాతం ఉంది. అయితే 2018, 2019లో కేంద్రం జీఎస్టీ రేట్లను సవరించింది. అప్పుడు వసుళ్ల తగ్గాయి. అయితే ఆ తర్వాత కొంతకాలానికి మళ్లీ జీఎస్టీ రాబడి పుంజుకుంది. ఈసారి కూడా జీఎస్టీ రేట్ల రేషనలైజేషన్ తర్వాత ఆదాయం 9.5శాతానికి తగ్గొచ్చని ఎస్‌బీఐ రీసెర్చ్ భావిస్తోంది. గతసారి చేసిన జీఎస్టీ సంస్కరణల వల్ల దాదాపు రూ.1 లక్ష కోట్ల అదనపు ఆదాయం లభించిందని పేర్కొంది.
More Stories
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి
రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ.. సీబీఐ కేసు
ట్రంప్ బెదిరింపులతో ఐటి రంగంపై భారత్ దృష్టి