ఎలాన్‌ మస్క్‌ టెస్లాఎలక్ట్రిక్‌ కార్లకు భారత్ లో చుక్కెదురు

ఎలాన్‌ మస్క్‌ టెస్లాఎలక్ట్రిక్‌ కార్లకు భారత్ లో చుక్కెదురు

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ కు చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ దిగ్గజం టెస్లా అధికారికంగా భారత విపణిలోకి అడుగుపెట్టగా పెద్దగా డిమాండ్ కనిపించకపోవడంతో చుక్కెదురైంది. ఈ ఏడాది జులై 15న ఆర్థిక రాజధాని ముంబైలో తొలి షోరూంను ప్రారంభించింది. ఆ తర్వాత ఢిల్లీలో రెండో షోరూంను కూడా ప్రారంభించింది. ఈ వారం బెంగుళూరు, పూణేలలో ప్రారంభిస్తున్నది.

ఎన్నో అంచనాలతో భారత విపణిలోకి అడుగుపెట్టిన టెస్లాకు నిరాశే ఎదురైంది. ఆశించిన స్థాయిలో బుకింగ్స్‌ జరగలేదని సమాచారం. బ్లూమ్‌బర్గ్‌ నివేదిక ప్రకారం జులై నుంచి ఇప్పటి వరకూ మొత్తం 600 బుకింగ్స్‌ మాత్రమే వచ్చాయి. కంపెనీ అంచనాల కంటే ఇవి చాలా తక్కువ. ఎందుకంటే టెస్లా ప్రపంచ వ్యాప్తంగా కేవలం నాలుగు గంటల్లోనే ఇన్ని కార్లను విక్రయిస్తుంది. 

దీంతో భారత్‌లో టెస్లాకు అనుకున్నంత స్పందన రాలేదని కంపెనీకి చెందిన కీలక వ్యక్తులను ఊటంకిస్తూ బ్లూమ్‌బర్గ్‌ వెల్లడించింది. టెస్లా భారత్‌లో ఈ ఏడాది 350 నుంచి 500 కార్లను డెలివరీ చేయాలని ప్లాన్‌ చేసుకుంది. ఇందు కోసం మొదటి బ్యాచ్‌ షాంఘై నుంచి ఈ నెల మొదట్లో భారత్‌కు చేరుకోవచ్చని సమాచారం. 

ఈ వాహనాల డెలివరీలను ప్రస్తుతానికి ముంబై, ఢిల్లీ, పుణే, గురుగ్రామ్‌ నగరాలకే పరిమితం చేయాలని కంపెనీ భావిస్తోంది. పూర్తి చెల్లింపుల తర్వాతే కార్లను డెలివరీ చేయనుంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లలో అత్యధిక అమ్మకాలతో రికార్డు నెలకొల్పిన ‘వై’ మోడల్ కార్లను భారత వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది టెస్లా. ఆర్ డబ్ల్యు డి (రియర్-వీల్ డ్రైవ్), లాంగ్-రేంజ్ ఆర్ డబ్ల్యు డి వేరియంట్‌ కార్లను అమ్మకానికి ఉంచింది. 

ఇక ధర విషయానికొస్తే రియర్-వీల్ డ్రైవ్ (ఆర్‌డబ్ల్యూడీ) వేరియంట్‌ ధర రూ. 59.89 లక్షలు, లాంగ్-రేంజ్ ఆర్‌డబ్ల్యూడీ వేరియంట్‌ ధరను రూ. 67.89 లక్షలుగా నిర్ణయించింది. వీటి ‘ఆన్ రోడ్’ ధరల్ని పరిశీలిస్తే ఆర్ డబ్ల్యు డి వెర్షన్ ఆన్-రోడ్ ధర రూ. 61.07 లక్షలుకాగా, లాంగ్-రేంజ్ వెర్షన్ ఆన్-రోడ్ ధర రూ. 69.15 లక్షలుగా ఉంది. టెస్లా అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ఇందులో 18 శాతం జీఎస్టీతో సహా రూ. 50,000 అడ్మినిస్ట్రేషన్, సర్వీస్ ఫీజు కూడా ఉంటుంది. 

అయితే, భారత్‌లో సగటు ఎలక్ట్రిక్‌ కారు ధర రూ.22 లక్షలు ఉంది. టెస్లా మోడల్‌ వై ధర దాదాపు రూ.60 లక్షల వరకు ఉంది. టెస్లాకు బ్రాండ్ పేరు ఉన్నప్పటికీ ఎక్కువ ధర కారణంగా భారత ఈవి మార్కెట్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోతోందన్నదని భావిస్తున్నారు.