
స్థానిక సంస్థల ఎన్నికలను నవంబర్ నెలాఖరుకు వాయిదా వేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఈ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియ అమలు ఆలస్యం కానుండడంతో తనకు మరింత గడువు కావాలని హైకోర్టును ప్రభుత్వం అభ్యర్థించనున్నట్టుగా తెలిసింది.
ఇప్పటికే బిసిలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిసి బిల్లును ఆమోదించుకొని రాష్ట్రపతికి పంపించగా ప్రస్తుతం ఢిల్లీలో పెండింగ్ లో ఉన్నాయి. దీంతో కోర్టు ఇచ్చిన సమయం ఈ నెలాఖరు వరకు ఉండడంతో మూడు రోజుల క్రితం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించి, గత ప్రభుత్వం 50 శాతం రిజర్వేషన్లు మించకుండా తెచ్చిన చట్టాలకు సవరణ చేసింది.
అందులో పంచాయతీరాజ్ చట్టం 2018 లోని సెక్షన్ 285(ఏ), మున్సిపల్ చట్టం 2019 లోని సెక్షన్ 29కు సవరణలు చేస్తూ ప్రభుత్వం ఈ రెండు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి వాటిని ఆ మోదించుకుంది. ప్రస్తుతం అసెంబ్లీ ఆమోదించిన ఈ రెండు బిల్లులను గవర్నర్ ఆమోదానికి పంపించింది. అయితే, గవర్నర్ న్యాయ సలహా కోసం ఈ బిల్లులను పంపించినట్టుగా తెలిసింది.
దీంతో ఈ బిల్లుల ఆమోదానికి మరింత ఆ లస్యం అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ ఆ రెండు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపినా పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు అతి తక్కువ సమయంలో బిసిలకు రిజర్వేషన్ కల్పించడం ఇబ్బందిగా మారుతుందని, అందులో భాగంగానే తమకు మరింత సమయం కావాలని ప్రభుత్వం కోర్టును అభ్యర్థించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.
దీంతోపాటు త్వరలో జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని అనంతరం స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించుకోవాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలిసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి గెలిపిస్తే రాష్ట్రవ్యాప్తంగా పార్టీలో జోష్ పెరుగుతుందని అది స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ ఆలోచనగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కోర్టును అభ్యర్థించడంతో పాటు ఎన్నికల సంఘానికి కూడా లేఖ రాసే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల ఆలస్యానికి కారణాలను ఈ లేఖలో ప్రభుత్వం పేర్కొనే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. కోర్టు ఇచ్చే అనుమతిపై ప్రభుత్వం ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి